కేసీఆర్.. ఇదీ ఓ గెలుపేనా..? : వైఎస్ షర్మిల

కేసీఆర్.. ఇదీ ఓ గెలుపేనా..? : వైఎస్ షర్మిల

మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలపై.. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఊరికో ఎమ్మెల్యేని పెట్టి.. మండలానికి ముగ్గురు మంత్రులను పెట్టి.. మద్యం, డబ్బులు పంపిణీ చేయించారని సీఎం కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారాన్ని దుర్వినియోగం చేసి.. ఓటర్లను బెదిరించి ఫామ్ హౌస్ డ్రామా ఆడారని షర్మిల మండిపడ్డారు. కేవలం 10వేల ఓట్లతో గెలిచిన ఎన్నిక గెలుపేనా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి.. గెలిచామని సంబురాలు చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

బీజేపీ పార్టీపైనా షర్మిల ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేను కొని.. ఉపఎన్నిక తెచ్చిన బీజేపీకి నైతికత గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి.. పార్టీని బలోపేతం చేసుకోవాలనుకుంటున్న బీజేపీకి ఇప్పుడైనా సిగ్గు వచ్చిందా అని మండిపడ్డారు. దొంగదారి రాజకీయాలను తెలంగాణ ప్రజలు సహించరన్న ఆమె.. అధికార, ప్రతిపక్షాలు పట్టించుకోకపోయినా.. ప్రజలకు తాను అండగా ఉంటానని చెప్పారు. ప్రజా సమస్యలపై వైఎస్ఆర్టీపీ పార్టీ నిత్యం పోరాడుతుందని షర్మిల చెప్పుకొచ్చారు. పేదల సంక్షేమం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థాన పాదయాత్ర బెల్లంపల్లి నియోజకవర్గానికి చేరుకుంది. సాయంత్రం 4 గంటలకు అవడం గ్రామ ప్రజలతో షర్మిల ముచ్చటించనున్నారు.