నేను పాలేరు నుంచి బరిలోకి దిగుతా: షర్మిల

నేను పాలేరు నుంచి బరిలోకి దిగుతా: షర్మిల
  • అవసరమైతే బ్రదర్ అనిల్, విజయమ్మ కూడా పోటీ చేస్తరు
  • కాంగ్రెస్‌తో కలిస్తే వ్యతిరేక ఓటు చీలదని చర్చలు జరిపినం
  • 4 నెలలు వెయిట్ చేసినం.. వాళ్ల నుంచి స్పందన రాలే
  • ఎమ్మెల్యేగా పోటీకి ఆశావహుల నుంచి అప్లికేషన్లు తీసుకుంటున్నట్లు వెల్లడి

హైదరాబాద్, వెలుగు: వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్లు వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల ప్రకటించారు. అన్ని నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్‌‌లోని లోటస్‌‌పాండ్ లో షర్మిల అధ్యక్షతన పార్టీ రాష్ర్ట కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ “అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నం. నేను పాలేరు నుంచి పోటీ చేస్తున్నా. ఇంకో నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయాలని డిమాండ్ ఉంది. ఇంకో సీటు నుంచి కూడా పోటీ చేస్తే ఆ చుట్టూ ఉన్న నియోజకవర్గాలపై ప్రభావం ఉంటుంది. బ్రదర్ అనీల్, వైఎస్ విజయమ్మ కూడా పోటీ చేయాలని పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు కోరుతున్నారు. అవసరమైతే వాళ్లూ పోటీ చేస్తారు” అని తెలిపారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకునే అభ్యర్థులు అప్లికేషన్లను నింపి పార్టీ ఆఫీసులో అందజేయాలని నేతలకు షర్మిల సూచించారు. 3 పేజీలతో అప్లికేషన్‌‌ను పార్టీ ఆఫీసులో ఆశావాహులకు పంపిణీ చేశారు.

ప్రజల కోసమే కాంగ్రెస్‌‌తో వెళ్లాలనుకున్నం

కాంగ్రెస్‌‌తో కలిసి వెళ్తే ప్రజావ్యతిరేక ఓటు చీలదని అనుకున్నామని షర్మిల చెప్పారు. ‘‘తెలంగాణ ప్రజల కోసమే కాంగ్రెస్‌‌తో వెళ్లాలనుకున్నం. ప్రజా వ్యతిరేక ఓటు చీల్చిన అపఖ్యాతి వస్తుందని భావించాం. ఓట్లు చీలిస్తే కేసీఅర్ మళ్లీ సీఎం అవుతారు. అందుకే కాంగ్రెస్‌‌తో చర్చలు జరిపాం. 4 నెలలు ఎదురుచూసినం. ఇప్పుడు వ్యతిరేక ఓటు చీలిన అపఖ్యాతి మనకు రాదు. కాంగ్రెస్‌‌ నుంచి స్పందన రాలేదు. అందుకే ఒంటరిగా పోటీ చేస్తున్నం. ప్రజల కోసం స్టార్ట్ చేసిన ఈ పోరాటం ఆగదు. రాష్ట్రంలో వైఎస్ఆర్ సంక్షేమ పాలన తీసుకొస్తాం. పార్టీ కోసం అందరం చిత్తశుద్ధితో పనిచేయాలి”అని పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ నుంచి షర్మిల భర్త అనీల్, మిర్యాలగూడ నుంచి విజయమ్మ పోటీ చేస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. వీటిపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

‘రైతు నాగలి’ గుర్తు కోసం దరఖాస్తు

ఎన్నికల్లో పోటీ చేసేందుకు సింబల్ కేటాయించాలని కోరుతూ ఇటీవల ఈసీకి వైఎస్సార్‌‌‌‌టీపీ నేతలు అప్లై చేశారు. ‘రైతు నాగలి’ గుర్తు కేటాయించాలని దరఖాస్తు చేసుకున్నట్లు నేతలు చెబుతున్నారు. నేడో రేపో ఈసీ కేటాయిస్తుందని అంటున్నారు. మరోవైపు పార్టీ నేత తుడి దేవేందర్ రెడ్డి చైర్మన్ గా మేనిఫెస్టో కమిటీని షర్మిల ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో పార్టీ నేతలు పిట్టా రాంరెడ్డి, నీలం రమేశ్, గడిపల్లి కవిత, ముస్తాఫా, సుజాత మంగీలాల్‌‌ను సభ్యులుగా నియమించారు.

త్వరలో మేనిఫెస్టో: పిట్టా రాంరెడ్డి

మీటింగ్ తర్వాత నేతలు నీలం రమేశ్, సుజాత మంగీలాల్ లతో కలిసి పిట్టా రాంరెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో షర్మిల పర్యటిస్తారని, బహిరంగ సభలు నిర్వహిస్తామని వెల్లడించారు. త్వరలో మేనిఫెస్టోను, పార్టీ సింబల్ ను షర్మిల విడుదల చేస్తారన్నారు.

‘రైతు నాగలి’ గుర్తు కోసం దరఖాస్తు

ఎన్నికల్లో పోటీ చేసేందుకు సింబల్ కేటాయించాలని కోరుతూ ఇటీవల ఈసీకి వైఎస్సార్‌‌టీపీ నేతలు అప్లై చేశారు. ‘రైతు నాగలి’ గుర్తు కేటాయించాలని దరఖాస్తు చేసుకున్నట్లు నేతలు చెబుతున్నారు. నేడో రేపో ఈసీ గుర్తును కేటాయిస్తుందని అంటున్నారు. మరోవైపు పార్టీ నేత తూడి దేవేందర్ రెడ్డి చైర్మన్​గా మేనిఫెస్టో కమిటీని షర్మిల ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో పార్టీ నేతలు పిట్టా రాంరెడ్డి, నీలం రమేశ్, గడిపల్లి కవిత, ముస్తాఫా, సుజాత మంగీలాల్‌ను సభ్యులుగా నియమించారు. 
ఇప్పటికే పలుసార్లు సమావేశమై మేనిఫెస్టోను ఖరారు చేసినట్లు తెలుస్తున్నది.