గాలి మాటలతో గెలిచి రాష్ట్రాన్ని లూటీ చేసిండు: షర్మిల

గాలి మాటలతో గెలిచి రాష్ట్రాన్ని లూటీ చేసిండు: షర్మిల

నిజామాబాద్, వెలుగు: కేసీఆర్ ఎన్నికల్లో గాలిమాటలతో గెలిచి.. రాష్ట్రాన్ని లూటీ చేశాడని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్​ వైఎస్ షర్మిల ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరిట కేసీఆర్ రాష్ట్ర ఖజానాను దోచుకున్నారని విమర్శించారు. బుధవారం184వ రోజు షర్మిల పాదయాత్ర నిజామాబాద్​జిల్లా డిచ్​పల్లి, సుద్దపల్లి, గన్యాతండా, జక్రాన్ పల్లి, మదన్ పల్లి, అమ్రాద్ గ్రామాల్లో కొనసాగింది. డిచ్​పల్లి, అమ్రాద్​లో నిర్వహించిన బహిరంగసభల్లో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో 2లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 20 వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారని విమర్శించారు. పొట్టకూటి కోసం దుబాయి, మస్కట్ పోయి బతుకుతున్న వారి కోసం గల్ఫ్ పాలసీ, -ఎన్ఆర్ఐ సెల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి మోసగించారని అన్నారు. రూ.500 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పి మాట తప్పారన్నారు. ఇంత వరకు పత్తా లేదన్నారు. తెలంగాణ యూనివర్సిటీని భ్రష్టు పట్టించారని విమర్శించారు. 150 మంది ప్రొఫెసర్లు ఉండాల్సిన చోట 70 మంది కూడా లేరన్నారు. కేసీఆర్ ఎన్నికలు ఉంటేనే బయటకు వస్తారని గాలిమాటలు చెప్పి ఓట్లు గుద్దించుకొని మళ్ల ఫామ్ హౌస్​కు వెళ్లిపోతారన్నారు. ఈ సారి ఎన్నికల్లో ఆయనకు కర్రుకాల్చి వాతపెట్టాలని పిలుపునిచ్చారు.

ఇయ్యాల ఢిల్లీకి షర్మిల

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఫిర్యాదు చేసేందుకు గురువారం షర్మిల మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. శుక్రవారం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు ఆమె కంప్లైంట్​చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ ప్రాజెక్టులో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ ఈనెల 7న సీబీఐకి ఫిర్యాదు చేశారు.