21న ఢిల్లీకి షర్మిల.. కాళేశ్వరంపై ఈడీకి ఫిర్యాదు !

21న ఢిల్లీకి షర్మిల.. కాళేశ్వరంపై ఈడీకి ఫిర్యాదు !

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఈ నెల 21 న మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి అక్రమాలపై  ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి లేదా కేంద్ర జలశక్తి శాఖకు ఆమె ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ ఇప్పటికే అక్టోబరు 7న సీబీఐకి వైఎస్ షర్మిల ఫిర్యాదు చేశారు.  ‘‘రూ.1.2 లక్షల కోట్లతో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కట్టామని టీఆర్ఎస్ సర్కారు చెబుతున్నా.. దాంట్లో భారీ కుంభకోణం దాగి ఉంది’’ అని సీబీఐ డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైస్వాల్ ను ఢిల్లీలో కలిసి కంప్లైంట్ ఇచ్చారు. తాను చేసిన ఫిర్యాదుకు సీబీఐ స్పందించిందని..  కాళేశ్వరం అవినీతిపై దర్యాప్తునకు ఇప్పటికే డీఐజీ ర్యాంకు అధికారిని నియమించిందని షర్మిల ఇటీవల మీడియాకు తెలిపారు.

‘కాళేశ్వరం ప్రాజెక్టు వరదపాలు కాగా.. లక్ష కోట్లు కేసీఆర్ పాలయ్యాయి’ అని గతంలో పలుమార్లు ఆమె వ్యాఖ్యానించారు.  ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 33వేల కోట్లతో రూపొందించారని.. కేసీఆర్ ఆ ప్రాజెక్టుకు తలకాయ, కాళ్లు తీసేశారని షర్మిల చాలాసార్లు కామెంట్స్ చేశారు. కాగా, షర్మిల నిర్వహిస్తున్న ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రస్తుతం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలోని  ముగ్పల్ మండలంలో  కొనసాగుతోంది.