
తిరుపతి వేదికగా ఎన్నికల సమర శంఖారావం పూరించారు ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత జగన్. వైసీపీ రూపొందించిన నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లు 3 వేలు చేస్తామని తెలిపారు. రైతులతో పాటు.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు అండగా ఉంటామన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ముందు చంద్రబాబు డ్రామాలాడుతున్నారని విమర్శించారు జగన్.
వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ వైసీపీ పొత్తు పెట్టుకోదన్నారు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ . అన్ని స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని తెలిపారు. వైసీపీ ఎన్నికల సమర శంఖారావం తిరుపతి వేదికగా ప్రారంభించారు. రేణిగుంట సమీపంలోని యోగానంద ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలో జరిగిన ఈ సమావేశంలో జగన్ .. సభ్యుల మధ్యకు వెళ్లి పలువురి సందేహాలను నివృత్తి చేశారు. ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ , బీజేపీ రెండూ మోసమే చేశాయన్నారు జగన్.
ఏపీలో న్యాయానికి, అన్యాయానికి మధ్య ఎన్నికలు జరగబోతున్నాయన్నారు వైసీపీ అధినేత జగన్. తిరుపతి వేదికగా ఏపీ ప్రజలకు పలు హామిలిచ్చారు. అధికారంలోకి వస్తే వృద్ధాప్య పింఛన్లు 3 వేలకు పెంచుతామని భరోసా ఇచ్చారు. రైతులకు ఏటా మే నెలలో 12 వేల 500.. పిల్లలను బడికి పంపితే ప్రతీ తల్లికి 15 వేల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారు జగన్. 45 ఏళ్లు దాటిన ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు వైఎస్సార్ చేయూత పథకం కింద నాలుగేళ్లలో 75 వేల రూపాయలు ఇస్తామని చెప్పారు. నవరత్నాలు ప్రతీ ఇంటికీ తీసుకెళ్లాలని కోరారు జగన్.
పాదయాత్రలో తానిచ్చిన హామీలకు, నవరత్నాలకు భయపడిన చంద్రబాబు.. హడావుడిగా మూడు నెలలకోసం సంక్షేమ పథకాలతో ప్రజల్ని మభ్యపెడుతున్నారన్నారు జగన్. పోలవరం పునాదులు కూడా పూర్తికాకుండానే జాతికి అంకితం చేయడమేంటని ప్రశ్నించారు. నాలుగేళ్లు బీజేపీతో, పవన్ కల్యాణ్ తో కలసి రాష్ట్రాన్ని దోచారన్నారు. ప్రత్యేక హోదా కోసం నాలుగున్నరేళ్లు పట్టించుకోలేదని, ఎన్నికల ముందు నల్ల చొక్కా వేసుకుని ధర్మపోరాట దీక్ష అంటూ డ్రామా ఆడుతున్నారని బాబుపై మండిపడ్డారు జగన్.
ఎన్నికల్లో చంద్రబాబు డబ్బులిస్తే తీసుకోవాలని… ఓటు మాత్రం మనస్సాక్షి చెప్పినట్లు వేయమని చెప్పాలని సూచించారు జగన్. ఇవాళ కడప మున్సిపల్ స్టేడియంలో సమర శంఖారావం సభ జరగనుంది. ఉదయం గ్లోబల్ ఇంజనీరింగ్ కాలేజీలో ముఖాముఖి కార్యక్రమంలో జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నం బూత్ కమిటీ కన్వీనర్లు, పార్టీ శ్రేణులతో జరిపే సభ ప్రసంగిస్తారు.