షర్మిలకు కాంగ్రెస్ గాలం : హస్తం పార్టీ లో వైఎస్సార్ టీపీ విలీనం?

షర్మిలకు కాంగ్రెస్ గాలం :  హస్తం పార్టీ లో వైఎస్సార్ టీపీ విలీనం?
  • ఏపీలో జగన్ కు చెక్ పెట్టేందుకు వ్యూహం
  • కర్నాటక పీసీసీ చీఫ్​ డీకే ద్వారా డిస్కషన్స్!

వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిలకు కాంగ్రెస్ గాలం వేస్తోంది. ఆమెను పార్టీలో చేర్చుకొనేందుకు కర్నాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ద్వారా చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. వైఎస్సార్టీపీని విలీనం చేసుకోవడం ద్వారా తెలంగాణలో వైఎస్ అభిమానుల ఓట్లను పొందడంతోపాటు ఏపీలో సీఎం జగన్ కు చెక్ పెట్టాలని కాంగ్రెస్ భావిస్తున్నది. షర్మిల చేరిక ద్వారా ఏపీలో నామమాత్రంగా ఉన్న తమ పార్టీ బలం పెంచుకోవచ్చని కాంగ్రెస్ భావిస్తున్నది.  ఇటు తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండటంతోపాటు వైఎస్సార్ అభిమానులు, రెడ్డి, క్రిస్టియన్ సామాజిక ఓట్లను తమ వైపు తిప్పుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ  ఈ వ్యూహం రచిస్తున్నట్టు సమాచారం. తెలంగాణలో ఇప్పటికే పలుమార్లు పాదయాత్రలు నిర్వహించడంతోపాటు ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతున్న షర్మిలను చేర్చుకోవడం తెలంగాణ లో కొంత మేర కలిసొస్తుందని భావిస్తున్నది. కర్నాటక ఎన్నికల్లో విజయం సాధించడంతో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం తెలంగాణపై దృష్టి సారించినట్టు సమాచారం. కర్నాటకలో ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే షర్మిల బెంగళూరు వెళ్లారు. మూడు రోజులుగా అక్కడే ఉంటూ పార్టీ విలీన అంశాలపై డీకే శివకుమార్ తో కలిసి చర్చిస్తున్నారని సమాచారం. ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన షర్మిల ఆ స్థానంతో పాటు మరికొన్ని సెగ్మెంట్లను తన అనుచరులకు ఇవ్వాలని కోరినట్టు తెలిసింది.  

టచ్ లోనే ఉన్న సునీల్ కనుగోలు

కాంగ్రెస్ పార్టీ  తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల వ్యూహకర్త సునీల్ కనుగోలు షర్మిలకు కాంటాక్ట్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై ఇదివరకే పలుమార్లు సంప్రదింపులు జరిగినట్టు సమాచారం. ఈ సందర్భంగా పలు డిమాండ్లను షర్మిల కనుగోలు ముందుంచినట్టు తెలుస్తోంది. వాటిని సునీల్ కనుగోలు హైకమాండ్ దృష్టికి కూడా తీసుకెళ్లారని సమాచారం. 

డీకేను కలిసిన షర్మిల

కర్నాటక పీసీసీ చీఫ్​ డీకే శివకుమార్ ను వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ఇవాళ బెంగళూరులో కలిశారు. డీకేకు బొకే అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫొటోను ఆమె ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ‘ ప్రియమైన సోదరుడు శ్రీ డీకే శివకుమార్ గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. అసెంబ్లీ ఎన్నికల్లో మీ పార్టీ అఖండ విజయం సాధించిన తర్వాత జరుపుకొనే ఈ పుట్టిన రోజు మీకు మరింత మధురమైనదని, ముఖ్యమైనదని భావిస్తున్నాను. కర్నాటక ప్రజలకు సేవ చేసేందుకు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’అంటూ ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు.
 

For More Info
https://v6digital.in/EditionPage/EPpage.php?edn=Evening&isid=V6V_EVE_20230515#Page/1