ధర్మపురికి ఇస్తానన్న రూ.100 కోట్లు ఎక్కడ? : షర్మిల

ధర్మపురికి ఇస్తానన్న రూ.100 కోట్లు ఎక్కడ? : షర్మిల

జగిత్యాల, వెలుగు: తెలంగాణ ప్రజలతో పాటు దేవుళ్లను కూడా కేసీఆర్​ మోసం చేస్తున్నారని వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. కేసీఆర్​కు యాదాద్రి తప్ప మిగిలిన టెంపుల్స్​ డెవలప్​మెంట్​ పట్టదని విమర్శించారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం నాగారం క్రాస్ నైట్ క్యాంప్ నుంచి గురువారం 198వ రోజు వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర ప్రారంభమైంది. బుద్దేశ్​పల్లి మీదుగా ధర్మపురికి చేరుకోగా, బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆమె మాట్లాడారు. ధర్మపురి ఆలయాభివృద్ధికి రూ.500 కోట్లు ఇస్తామని ఒకసారి.. వంద కోట్లని మరోసారి చెప్పిన కేసీఆర్, ఇప్పటిదాకా డబ్బులు మాత్రం ఇవ్వలేదన్నారు. దళిత సీఎం, డబుల్ బెడ్ రూం, ఇంటికో ఉద్యోగమని చెప్పి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. 

ఉద్యోగాల పేరుతో లక్షల వసూళ్లు

మంత్రి కొప్పుల ఈశ్వర్​పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కొప్పుల ఈశ్వర్, ఆయన అనుచరులు వందల ఎకరాల భూములు కబ్జా చేశారని, ఇసుక మాఫియాగా మారి దోచుకుంటున్నారని ఆరోపించారు. ‘‘కేవలం 440 ఓట్ల తేడాతో చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు కొప్పుల ఈశ్వర్ గెలిచి అధికారం అనుభవిస్తున్నడు. ప్రశ్నించిన జర్నలిస్టుల మీద, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టివాళ్ల మీద  కేసులు పెట్టిస్తున్నడు. ధర్మపురి నియోజకవర్గంలో లక్ష్మీ నరసింహ స్వామి పేరుతో ప్రాజెక్ట్ నిర్మిస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు. ఇప్పటిదాకా హామీ నెరవేర్చలేదు. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉద్యోగాల పేరుతో మంత్రి అనుచరులు మస్త్​ డబ్బులు వసూలు చేసుకున్నరు”అని షర్మిల ఆరోపించారు. వైఎస్సార్ టీపీ అధికారంలోకి వస్తే కుటుంబంలో అర్హులైన ప్రతీ ఒక్కరికి రూ.3వేల పెన్షన్ అందిస్తామన్నారు. సభ తర్వాత తిమ్మాపూర్, బూరుగుపల్లి మీదుగా రాయపట్నం చేరుకున్న షర్మిల, గ్రామస్తులతో మాట ముచ్చటలో పాల్గొన్నారు. తర్వాత గోదావరి బ్రిడ్జి మీదుగా మంచిర్యాల జిల్లాలోకి ప్రవేశించారు.