కొత్త అకౌంట్ ఓపెనింగ్‌‌లు తగ్గినయ్ : నితిన్ కామత్‌‌

కొత్త అకౌంట్ ఓపెనింగ్‌‌లు తగ్గినయ్ : నితిన్ కామత్‌‌

న్యూఢిల్లీ: కొత్తగా ఓపెన్ అవుతున్న అకౌంట్‌‌లు  2020, మార్చి స్థాయికి దిగొచ్చాయని ఆన్‌‌లైన్ బ్రోకింగ్ కంపెనీ జెరోధా సీఈఓ నితిన్ కామత్ పేర్కొన్నారు. మంత్లీ అకౌంట్ ఓపెనింగ్‌‌ ట్రెండ్‌‌ను, మిడ్‌‌క్యాప్‌‌ 100 ఇండెక్స్‌‌ ట్రెండ్‌‌ను పోల్చుతూ ఓ గ్రాఫ్‌‌ను  ట్విట్టర్‌‌‌‌లో షేర్ చేశారు.  కొత్త అకౌంట్లు ఓపెన్‌‌ అవ్వడం తగ్గిందని, దీనర్ధం కంపెనీల రెవెన్యూ  కూడా తగ్గుతుందని వివరించారు. కానీ, ఇందుకు కొంత టైమ్‌‌ పడుతుందన్నారు. ట్రేడింగ్ వాల్యూమ్స్‌‌ ఎంత వేగంగా పెరిగాయో అంతే వేగంగా పడిపోగలవని అభిప్రాయపడ్డారు. జనవరి, 2018 నుంచి జనవరి, 2023 మధ్య  జెరోధాలో నెలవారీగా ఓపెన్ అయిన కొత్త అకౌంట్ల ట్రెండ్‌‌ను, మిడ్‌‌క్యాప్‌‌ 100 ఇండెక్స్‌‌తో ఆయన పోల్చారు.

 మిడ్‌‌క్యాప్ 100 ఇండెక్స్‌‌ పెరిగినప్పుడు జెరోధా ప్లాట్‌‌ఫామ్‌‌లో కొత్త అకౌంట్లు ఓపెన్ అవ్వడం పెరిగిందని అన్నారు. బుల్లిష్ ట్రెండ్ కనిపించినప్పుడు  కొత్త ఇన్వెస్టర్లు పెరిగారన్నారు.   ట్రేడింగ్ నెంబర్లు చూసి  బ్రోకింగ్ ఇండస్ట్రీలో బోలెడు అవకాశాలు ఉన్నాయని బయట వ్యక్తులు అనుకుంటారని నితిన్‌‌ ట్వీట్ చేశారు. నిజానికి బ్రోకింగ్ ఇండస్ట్రీ సైక్లికల్ బిజినెస్‌‌ అని,  రెవెన్యూ మీన్ (యావరేజ్‌‌) పొజిషన్‌‌కు తిరిగొస్తుందని అభిప్రాయపడ్డారు. కాగా,  ఈ ఏడాది జనవరి నాటికి దేశంలో డీమాట్ అకౌంట్‌‌లు 11 కోట్లకు పెరిగాయి. ఇది ఏడాది ప్రాతిపదికన 31 శాతం ఎక్కువ. కానీ, ఎన్‌‌ఎస్‌‌ఈలో  యాక్టివ్‌‌ అకౌంట్‌‌లు  జనవరిలో 2.9 శాతం (నెల ప్రాతిపదికన) తగ్గి 3.4 కోట్లుగా రికార్డయ్యాయి.