చరిత్ర సృష్టించిన పాక్ మాజీ బౌలర్.. 12 బంతుల్లో 6 వికెట్లు

చరిత్ర సృష్టించిన పాక్ మాజీ బౌలర్.. 12 బంతుల్లో 6 వికెట్లు

పాకిస్తాన్‌ మాజీ ఆల్‌రౌండర్‌ మహ్మద్‌ హఫీజ్‌ టీ10 క్రికెట్‌లో సంచలన గణాంకాలు నమోదుచేశారు. జిమ్ ఆఫ్రో టీ10 లీగ్‌(జింబాబ్వే)లో జోబర్గ్‌ బఫెలోస్‌‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న మాజీ ఆల్‌రౌండర్‌.. జూలై 21న బులవాయో బ్రేవ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తీశారు. ఇచ్చిన 6 పరుగులు కూడా ఒకే ఓవర్‌లో రావడం గమనార్హం. మరో ఓవర్‌లో 3 వికెట్లు తీయగా.. ఒక్క పరుగు ఇవ్వలేదు.

మొదటి బ్యాటింగ్ చేసిన జోబర్గ్‌ బఫెలోస్‌ నిర్ణీత 10 ఓవర్లలో 105 పరుగులు చేయగా.. బులవాయో బ్రేవ్స్‌ 95 పరుగులకే పరిమితమైంది. హాఫిజ్ ధాటికి బులవాయో బ్యాటర్లు వికెట్లు కాపాడుకోవడానికే అధిక ప్రాధాన్యమిచ్చారు.  బ్రేవ్స్‌ బ్యాటర్లలో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా.. వారిలో ముగ్గురు గోల్డన్‌ డకౌట్లు కావడం విశేషం.

ఒకే ఒక్కడు

టీ10 క్రికెట్‌లో 6 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా హఫీజ్ చరిత్ర సృష్టించారు. అతనికంటే ముందు టీ10 క్రికెట్‌లో వనిందు హసరంగా, ప్రవీణ్ తాంబే, మర్చంట్ డిలాంగే 5 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టారు.

18 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్     

పాకిస్థాన్ తరపున 55 టెస్టులు, 218 వన్డేలు, 119 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఈ ఆల్‌రౌండర్. 2018లో టెస్టు క్రికెట్‌కు గుడ్ బై చెప్పగా, గతేడాది (2022 జనవరి 3) అన్ని అంతర్జాతీయ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. మూడు ఫార్మాట్లలోనూ హఫీజ్.. పాక్ జట్టుకు నాయకత్వం వహించారు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 392 మ్యాచ్‌లు ఆడిన హఫీజ్‌ 250కిపైగా వికెట్లు తీసుకున్నారు.