జూమ్ యాప్ పై సుప్రీం కోర్టులో పిటిషన్

జూమ్ యాప్ పై సుప్రీం కోర్టులో పిటిషన్

న్యూఢిల్లీ: మనదేశంలో జూమ్ వీడియో కాలింగ్ యాప్ ను బ్యాన్ చేయాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. యూజర్ల ప్రైవసీకి ఈ యాప్ భంగం కలిగిస్తుందని, సైబర్ నేరాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఢిల్లీకి చెందిన హర్స్ చుగ్ పిటిషన్ లో పేర్కొన్నారు. జూమ్ యాప్ పై నిషేధం విధించి.. తగిన చట్టాలు రూపొందించేవరకు బ్యాన్ కొనసాగించాలని కోరారు. వినియోగదారుల డేటాని హ్యాక్ చేసేందుకు అవకాశం కలిగించేలా ఈ యాప్ ఉందని ఆరోపించారు. ఇందులో ఎండ్ టు ఎండ్​ ఎన్​స్క్రిప్షన్ లేదని, ఈ యాప్ అంత సేఫ్ కాదని పేర్కొన్నారు. లాక్ డౌన్ సమయంలో యాప్ వినియోగిస్తున్న మిలియన్ల మంది ప్రైవసీని ఈ యాప్ దెబ్బతీస్తోందని, యూజర్స్ డేటాను థర్డ్ పార్టీకి చేరవేసేలా ఉందని ఆరోపించారు. ఈ యాప్ ను వాడుతున్న చాలా మంది నుంచి హ్యాకింగ్, సైబర్ నేరాలకు సంబంధించి ఫిర్యాదులు వస్తున్నాయని పిటిషన్ లో పేర్కొన్నారు. జూమ్‌ వీడియో కాలింగ్‌ యాప్‌ లో ఉన్న లోపాలపై ఆ కంపెనీ సీఈవో ఇప్పటికే యూజర్స్ కు క్షమాపణలు చెప్పిందని, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యాప్ అంత సేఫ్ కాదని ప్రకటించిందని గుర్తుచేశారు.