ఆ దేశ అణ్వాయుధాలు టెర్రరిస్టుల చేతుల్లోకి వెళ్లవచ్చు: బైడెన్

ఆ దేశ అణ్వాయుధాలు టెర్రరిస్టుల చేతుల్లోకి వెళ్లవచ్చు: బైడెన్
  • అఫ్గాన్ లో తాలిబాన్ల పాలన మొదలైనంక భయం పెరిగిందని వెల్లడి

వాషింగ్టన్: ప్రపంచంలోనే పాకిస్తాన్ అత్యంత ప్రమాదకరమైన దేశమని అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ అన్నారు. ఆ దేశ అణ్వాయుధాలు టెర్రరిస్టులు, జీహాదీ శక్తుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. డెమోక్రటిక్ పార్టీ కాంగ్రెషనల్ ప్రచార కార్యక్రమంలో బైడెన్ మాట్లాడారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో పాక్ భద్రతా అంశాన్ని ఆయన లేవనెత్తారు. పాక్ మొదటిసారిగా 1998లో అణ్వాయుధాలను పరీక్షించడం ప్రారంభించిదని, జాతీయ భద్రత దృష్ట్యా ఆ పరీక్షలు చేశామని పాక్ చెప్పుకొన్నా ఆ అణ్వాయుధాలు సంఘ వ్యతిరేక శక్తుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉన్నట్లు తాము భయాందోళనకు గురవుతున్నామని చెప్పారు. అఫ్గానిస్తాన్ ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఈ భయం మరింత పెరిగిందని వెల్లడించారు. ‘‘ప్రపంచం ప్రస్తుతం వేగంగా మారుతోంది. దేశాలు తమ మిత్రపక్షాల గురించి ఆలోచిస్తున్నాయి. అయితే ప్రపంచం మాత్రం కచ్చితంగా మన వైపే చూస్తున్నదని అనుకుంటున్నా. ఇది జోక్ కాదు. తానెన్నడూ చేరుకోని స్థానానికి ప్రపంచాన్ని నడిపించే శక్తి అమెరికాకు ఉండేది. అణ్వాయుధాలు ప్రయోగిస్తామని రష్యా బెదిరిస్తుందని మనం ఎప్పుడైనా అనుకున్నామా?” అని బైడెన్ అన్నారు. కాగా, నార్త్​ కరోలినాలో గురువారం జరిగిన కాల్పుల ఘటనను బైడెన్ ఖండించారు. బాధిత కుటుంబాలకు ప్రెసిడెంట్​ సంతాపం తెలిపారు.

ఉక్రెయిన్ కు అమెరికా 6 వేల కోట్ల సాయం

రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్ కు సాయం అందించేందుకు అమెరికా మరోసారి ముందుకొచ్చింది. ఆయుధాలు, మందుగుండు సామగ్రితో దాదాపు 6 వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీలో కొత్త ఆయుధాలేమీ లేవని, ఇప్పటికే పంపిన ఆయుధాలకు అవసరమైన మందుగుండు సామాగ్రిని పంపిస్తామని వైట్​హౌస్​ ఓ ప్రకటనలో వివరించింది. అమెరికాతో పాటు పలు యూరప్​ దేశాలు కూడా ఉక్రెయిన్​కు సాయం చేయడానికి ముందుకొచ్చాయి. ఇటీవల రష్యా భీకర దాడులు జరిపిన నేపథ్యంలో ఉక్రెయిన్​ సిటీల రక్షణ కోసం ఎయిర్​ డిఫెన్స్​ వ్యవస్థలను అందజేయడానికి అంగీకారం తెలిపాయి. 

1971లో పాక్​ ఆర్మీ ఊచకోతపై తీర్మానం

బంగ్లాదేశ్​లోని బెంగాలీలు, హిందువులపై 1971లో పాకిస్తాన్ ఆర్మీ ఊచకోత జరిపిందని అమెరికా ప్రతినిధుల సభలో సభ్యులు తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని గుర్తించాలని ప్రెసిడెంట్ బైడెన్ కు  ఇండియన్ అమెరికన్ కాంగ్రెస్ నేత రో ఖన్నా, మరో కాంగ్రెస్ నేత సీవ్ చాబోట్ విజ్ఞప్తి చేశారు. బెంగాలీలు, హిందువులపై పాక్ ఆర్మీ ఒడిగట్టిన దారుణాలకు పాకిస్తాన్ ప్రభుత్వం బంగ్లాదేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆ తీర్మానంలో ఖన్నా, సీవ్ డిమాండ్  చేశారు.