కశ్మీర్లో ఎంపీ ఎన్నికలు మాత్రమే.. నో అసెంబ్లీ

కశ్మీర్లో ఎంపీ ఎన్నికలు మాత్రమే.. నో అసెంబ్లీ
  • 4 రాష్ట్రాల్లో పార్లమెంటుతో పాటు అసెంబీ ఎలక్షన్ కూడా
  • భద్రతా కారణాలతో జమ్ము కశ్మీర్ లో ఎంపీ సీట్లకు మాత్రమే
  • కేవలం 6 స్థానాలకు 5 దశల్లో ఎన్నికలు..

న్యూఢిల్లీ: దేశంలో పార్లమెంటు ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. 543 ఎంపీ సీట్లకు మొత్తం 7 దశల్లో పోలింగ్ నిర్వహిస్తామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా వెల్లడించారు. పార్లమెంటు ఎన్నికలతో పాటే అసెంబ్లీ గడువు ముగిసిన రాష్ట్రాల్లో ఎమ్మెల్యే సీట్లకూ పోలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. అందులో నాలుగు రాష్ట్రాలను ప్రకటించారాయన. వాటిలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఉన్నాయి. అయితే రాష్ట్రపతి పాలన నడుస్తున్న జమ్ము కశ్మీర్ కు మాత్రం షెడ్యూల్ ప్రకటించలేదు.

2015లో జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పీడీపీ, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 2021 మార్చి 16 వరకు ఆరేళ్ల పాటు ఆ ప్రభుత్వం నడవాల్సి ఉంది. కానీ జమ్ము కశ్మీర్ లో వరుస అల్లర్లతో శాంతి భద్రతలు గాడి తప్పిన నేపథ్యంలో ప్రభుత్వం నుంచి బీజేపీ వైదొలిగింది. పీడీపీకి మద్దతు ఉపసంహరించుకుంది. దీంతో ప్రభుత్వం పడిపోయింది. ఇతర పార్టీలతో కలిసి పీడీపీ మళ్లీ అధికారం చేపట్టే ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. దీంతో నవంబరు నుంచి అక్కడ రాష్ట్రపతి పాలన సాగుతోంది.

భద్రత తలకుమించిన పని

ఆరు నెలల్లోపు అక్కడ మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ గడువు మే నెలకల్లా ముగుస్తుంది. కానీ పుల్వామా దాడి తర్వాత కశ్మీర్ లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా అక్కడ కేవలం పార్లమెంటు సీట్లకే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. జమ్ము కశ్మీర్ లో ఉన్న 6 ఎంపీ స్థానాలకు 5 విడతల్లో ఓటింగ్ జరపబోతున్నారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అక్కడ అసెంబ్లీ, పార్లమెంటు సీట్లకు ఒకే సారి ఎన్నికల నిర్వహణ తలకుమించిన భారంగా మారుతుందని విశ్లేషకులు అంటున్నారు. జమ్ము కశ్మీర్ లో ఎన్నికలను అడ్డుకునేందుకు ఓ వైపు ఉగ్రవాదులు, మరోవైపు పాక్ ఆర్మీ, ఐఎస్ఐ కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తాయి. ఎలక్షన్ జరగకుండా చేసేందుకు అభ్యర్థులకు హాని తలపెట్టే చాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఎన్నికలంటే తప్పనిసరిగా అన్ని పార్టీల అసెంబ్లీ, పార్లమెంటు అబ్యర్థులకు, వారి ఇళ్లు, కార్యాలయాల వద్ద కూడా ఈసీ, భద్రతా బలగాలు సెక్యూరిటీ కల్పించాల్సి ఉంటుంది.

87 అసెంబ్లీ, 6 పార్లమెంటు సీట్లు ఉన్న ఆ రాష్ట్రంలో ఒకేసారి ఎన్నికల నిర్వహణ అంటే వేల మందికి అభ్యర్థులకు భద్రత కల్పించాలి. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇది అసాద్యమని భావించే ఈసీ కేవలం పార్లమెంటు సీట్లకే ఎన్నికలు నిర్వహిస్తోంది.

అసెంబ్లీ ఎన్నికలు జరపలేకపోవడంపై సీఈసీ సునీల్ అరోరా వివరణ ఇస్తూ ఒక్క అనంత్ నాగ్ ఎంపీ స్థానానికే మూడు విడతల్లో పోలింగ్ నిర్వహిస్తున్నామని, దీన్ని బట్టే పరిస్థితిని అర్థం చేసుకోవాలని అన్నారు. జమ్ము కశ్మీర్లోని ఆరు ఎంపీ సీట్లకు ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఏప్రిల్ 11, ఏప్రిల్ 18, ఏప్రిల్ 23, ఏప్రిల్ 29, మే 6 తేదీల్లో ఓటింగ్ జరుగుతుందన్నారు.