ప్రాణ రక్షణ మందుల దిగుమతుల కోసమే
వాణిజ్య, వ్యూహాత్మక వెసులుబాటు కల్పించిన ఇరాన్
టెహ్రాన్: ప్రపంచ వాణిజ్యంలో అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిలో భారత నౌకలకు ఆంక్షల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ఇరాన్ తాజాగా ప్రకటించింది. నౌకల రాకపోకలకు సంబంధించి విధించిన ఆంక్షలు భారత్ సహా నాలుగు దేశాల నౌకలకు వర్తించవని పేర్కొంది. భారత్ నుంచి ప్రాణాలను రక్షించే ఔషధాలు, ఫార్మాస్యూటికల్ ఉత్పత్తుల దిగుమతులకు ఆటంకం కలగనీయకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ తెలిపింది. భారత్‌తో పాటు చైనా, ఇరాక్, ఖతార్ దేశాలకు చెందిన నౌకలకు కూడా ఈ రవాణా ఆంక్షల నుంచి మినహాయింపు లభించినట్లు ఇరాన్ పార్లమెంటు సభ్యుడు ఒకరు వెల్లడించారు.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నడుమ, ఈ దేశాలతో ఉన్న వాణిజ్య, వ్యూహాత్మక సంబంధాలను దృష్టిలో ఉంచుకుని ఈ వెసులుబాటు కల్పించినట్లు వివరించారు. అయితే, ఈ వెసులుబాటు కింద భారత్, చైనా దేశాల నౌకల నుంచి ఇరాన్ ప్రభుత్వం ట్రాన్సిట్ ఫీజులను (రవాణా రుసుములను) వసూలు చేస్తున్నట్లు సమాచారం. అయినప్పటికీ, మందుల దిగుమతులకు ప్రాధాన్యమిస్తూ భారత నౌకల రాకపోకలకు మాత్రం ఎలాంటి అంతరాయం లేకుండా ప్రత్యేక అనుమతి లభించడం గమనార్హం. కాగా, చైనా నౌకలకు మాత్రం బీజింగ్ రాజకీయ మద్దతును కూడగట్టుకునే లక్ష్యంతోనే మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది.
హార్మూజ్‌లో దాడులు, ప్రాణనష్టం
హార్మూజ్ జలసంధి పరిసరాల్లో నౌకలపై వరుసగా దాడులు జరగడం, పలువురు భారత నావికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలపై దాడులను నిలిపివేయాలని భారత్ గట్టిగా డిమాండ్ చేసింది. ఇటీవల ఒమన్ తీరం సమీపంలో భారత నౌక ‘ఎంఎస్‌వి అల్-యూసుఫీ’ పై దాడి జరగడంతో గుజరాత్ కు చెందిన నావికుడు చనిపోయాడు. మరో 13 మంది భారత నావికులను ఒమన్ తీర రక్షక దళం రక్షించింది. ఈ దాడిని భారత్ తీవ్రంగా ఖండించడమే కాకుండా, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా అంతర్జాతీయ జలాల్లో స్వేచ్ఛగా, ఎక్కడా ఆటంకాలు లేకుండా నౌకలు రాకపోకలు సాగించేలా చూడాలని అన్ని వర్గాలను కోరింది.
శాంతి ప్రయత్నాలు, దౌత్య సవాళ్లు
హార్మూజ్ జలసంధి ప్రాంతంలో మళ్లీ ఘర్షణలు చెలరేగకుండా నిరోధించేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ ఘర్షణలను నిలిపివేయాలని ఖతార్ మధ్యవర్తిత్వంతో కూడిన ఒక ప్రతిపాదనను ఇరాన్ సైనిక నేతల ముందుంచారు. ఈ ప్రతిపాదిత విధివిధానాలపై ఇరాన్ స్పేకణను కోరేందుకు ఖతార్ రాయబారులు టెహ్రాన్‌ను సందర్శించారు. అయితే, దౌత్యపరమైన పరిష్కారాలపై ఇరాన్ సైనిక వ్యూహకర్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, అమెరికాతో మళ్లీ ఘర్షణ తలెత్తే అవకాశమే ఎక్కువగా ఉందని భావిస్తున్నట్లు ఆ నివేదిక పేర్కొంది.
