
టీడీపీ అధినేత చంద్రబాబుకు స్కిల్ కేసులో ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ పై ఏపీ సీఐడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.ఈ మేరకు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరించిందని ఏపీ సీఐడీ ఆరోపిస్తుంది. సీఐడీ వాదనను హైకోర్టు పరిగణనలోకి తీసుకోకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సీఐడీ.ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు విచారణను లిస్ట్‌లో పొందుపరచాల్సి ఉంది.
చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ రావడంపై సీఐడీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తి బయట ఉంటే కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందని సీఐడీ భావిస్తోంది.ఈ క్రమంలోనే చంద్రబాబు బెయిల్ రద్దు చేసి కస్టడీకి అప్పగించాలని సీఐడీ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడాన్ని ... సుప్రీంకోర్టులో సీఐడీ సవాల్ చేసింది. మంగళవారం (నవంబర్ 21) ఉదయం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డితో పాటు సీఐడీ లీగల్ టీం న్యూడిల్లీ చేరుకుని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
చంద్రబాబు నాయుడు అవినీతికి సంబంధించిన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని సుప్రీంకోర్టుకు అందజేసింది. ఈ ఆధారాలను పరిగణలోకి తీసుకుని చంద్రబాబు బెయిల్ రద్దు చేసి కస్టడీకి అప్పగించాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని సీఐడీ కోరింది.
పిటిషనర్లు వాదించని, వారు కోరని అంశాల్లోకి కూడా హైకోర్టు వెళ్లేందుకు ప్రయత్నించిందని సీఐడీ తరపు న్యాయవాదులు పిటిషన్ లో పేర్కొన్నారు. హైకోర్టు తన అధికారపరిధిని అతిక్రమిస్తూ తీర్పులో వ్యాఖ్యానాలు చేసిందని.. కేసు మెరిట్స్ గురించి, ఔచిత్యం గురించి, ఆధారాల దర్యాప్తులో లోపాల గురించి బెయిల్ పిటిషన్ సమయంలోనే వ్యాఖ్యానించిందని.. దర్యాప్తుపై ఇప్పటికే టీడీపీ పార్టీ నాయకులు, ప్రతినిధులు నిరంతరం రాళ్లు వేస్తూనే ఉన్నారన్నారు.
ఇలాంటి సమయంలో బెయిల్ సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యలను వారు సానుకూలంగా మలుచుకునే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సీడీఐ కోరిన సమాచారాన్ని ఇప్పటి వరకూ టీడీపీ ఇవ్వనే లేదు.. కేసు మూలాల గురించి హైకోర్టు తీర్పులో పేర్కొనడం ట్రయల్ కోర్టు అధికారాలను హరించడమే అని ఏఏజీ పొన్నవోలు అంటున్నారు..