బ్యాంక్ మోసాలు తగ్గినయ్‌‌

బ్యాంక్ మోసాలు తగ్గినయ్‌‌

2021‑22 లో  రికార్డయిన మొత్తం బ్యాంకు మోసాలు 118
న్యూఢిల్లీ: బ్యాంక్‌‌ మోసాలు కిందటి ఆర్థిక సంవత్సరంలో బాగా తగ్గాయి. రూ. 100 కోట్ల కంటే ఎక్కువ మోసం జరిగిన కేసులు 2021–22 లో 118 గా రికార్డయ్యాయి. ఇందులో ప్రైవేట్ బ్యాంకులు, ప్రభుత్వ బ్యాంకుల దగ్గర రికార్డయిన మోసాలు కలిసి ఉన్నాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం అంటే 2020–21లో  బ్యాంక్‌‌ మోసాలు 265 గా నమోదయ్యాయి.  రూ. 100 కోట్ల కంటే ఎక్కువ ఫ్రాడ్ జరిగిన కేసులు ప్రభుత్వ బ్యాంకుల్లో 80 కి తగ్గాయి. 2020–21 లో ఈ నెంబర్ 167గా ఉంది. ప్రైవేట్ బ్యాంకుల విషయానికొస్తే  ఇటువంటి బ్యాంకు మోసాలు 98 నుంచి 38 కి తగ్గాయి. అదే మోసానికి గురయిన అమౌంట్‌‌ను లెక్కిస్తే ప్రభుత్వ బ్యాంకుల్లో 2021–22 లో రూ. 28 వేల కోట్లు మోసానికి గురయ్యాయి.  2020–21 లో ఈ అమౌంట్‌‌ రూ. 65,900 కోట్లుగా ఉంది. ప్రైవేట్ బ్యాంకుల్లో అయితే మోసానికి గురయిన అమౌంట్‌‌ రూ. 39,900 కోట్ల నుంచి రూ. 13 వేల కోట్లకు దిగొచ్చింది. 
 

ఆర్‌‌‌‌బీఐ తీసుకుంటున్న చర్యలతోనే..
బ్యాంకు మోసాలను గుర్తించడానికి ఆర్‌‌‌‌బీఐ కఠినమైన చర్యలను తీసుకుంటోంది. మోసాలను వేగంగా గుర్తించే సిస్టమ్‌‌ (ఈడబ్ల్యూఎస్‌‌) సామర్ధ్యాన్ని మెరుగుపరిచింది.  మోసాలు జరగకుండా ఉండేలా చూసుకోవడంతో పాటు  జరిగినా వేగంగా రెస్పాండ్​ అవుతోంది. ఇందులో ట్రాన్సాక్షన్లను మానిటర్ చేయడానికి డేటా అనాలసిస్‌‌ , మార్కెట్ ఇంటెలిజెన్స్‌‌ టెక్నాలజీలను వాడుతోంది. 2021–22 లో కొన్ని షెడ్యూల్డ్‌‌ కమర్షియల్ బ్యాంకుల్లో ఈడబ్ల్యూఎస్‌‌ ఫ్రేమ్‌‌వర్క్‌‌ను  రిజర్వ్‌‌ బ్యాంక్ ఇన్‌‌ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్‌‌ (ఆర్‌‌‌‌ఈబీఐటీ) తో కలిసి రిజర్వ్ బ్యాంక్ అమలు చేసింది. ఈ ఈడబ్ల్యూఎస్‌‌ విధానం ఎలా పనిచేస్తోందో మానిటర్ చేయడానికి మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్‌‌) అల్గారిథమ్‌‌ను ఉపయోగిస్తోంది. కాగా, ఈ ఏడాది ప్రారంభంలో రూ. 22,842 కోట్ల విలువైన బ్యాంక్ మోసానికి ఎస్‌‌బీఐ గురయ్యింది. ఏబీజీ షిప్‌‌యార్డ్‌‌, ప్రమోటర్లు బ్యాంకు నుంచి లోన్లు తీసుకొని ఎగ్గొట్టిన విషయం తెలిసిందే. ఇది పీఎన్‌‌బీకి నిరవ్‌‌మోడీ చేసిన మోసం కంటే ఎక్కువ. తాజాగా రూ. 34,615 కోట్ల డీహెచ్‌‌ఎఫ్‌‌ఎల్‌‌ బ్యాంక్ ఫ్రాడ్‌‌పై ఈ కంపెనీ మాజీ చైర్మన్ కపిల్‌‌ వాధావన్‌‌ను, 
డైరెక్టర్ ధీరజ్ వాధావన్‌‌ను సీబీఐ కేసు ఫైల్ చేసిన విషయం తెలిసిందే.