పొరుగు రాష్ట్రాల్లో కారు ఖాళీ!?..జాతీయ రాజకీయాలపై నీలినీడలు

పొరుగు రాష్ట్రాల్లో కారు ఖాళీ!?..జాతీయ రాజకీయాలపై నీలినీడలు
  •  ఒడిశాలో గిరిధర్ గమాంగ్ రాజీనామా
  • ఏపీలో సైలెంట్ మోడ్ లోనే తోట
  • మహారాష్ట్ర లీడర్లకు  నో అపాయింట్ మెంట్స్
  • జాతీయ రాజకీయాలపై నీలినీడలు
  • తెలంగాణలోనూ అవిశ్వాసాల రగడ
  • కారు వెళ్లింది సర్వీసింగ్ కా.. స్క్రాప్ కా అంటూ కామెంట్స్
  •  ఆత్మరక్షణలో బీఆర్ఎస్ లీడర్లు

హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో పొరుగు రాష్ట్రాల్లో కారు ఖాళీ అవుతోంది. అనుకున్నది ఒకటి.. అయింది మరొకటి.. బోల్తా పడింది బుల్ బుల్ పిట్ట.. అన్న చందంగా మారింది గులాబీ పార్టీ పరిస్థితి. మనం తప్ప వేరే దిక్కులేదని, ఇంతకాలం పాలించిన నేతలకు పాలన తెలియలేదని భావించిన గులాబీ బాస్.. పొరుగు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ బ్రాంచీలు ఓపెన్ చేశారు. హైదరాబాద్ కు మాజీ ముఖ్యమంత్రులు, మాజీ కేంద్రమంత్రులు ఇతర పార్టీల నాయకుల వరద కొనసాగింది. ప్రగతి భవన్ కాస్తా రాజకీయ మీటింగుల నిలయంగా మారింది. హడావుడిగా ఆంధ్రప్రదేశ్ లో పార్టీ శాఖను ఏర్పాటు చేసి, రాష్ట్ర అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను నియమించారు. ఆ తరువాత ఏపీ వైపు కన్నెత్తి చూసింది లేదు. అక్కడ యాక్టివిటీస్ కూడా జరగలేదు. ఆ స్టేట్ లో కారు పార్టీ సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయింది. మరో వైపు ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్, ఆయన కుమారుడు శిశిర్ గమాంగ్ లు. వీరిలో గిరిధర్ గమాంగ్ కు రాజకీయ దురంధరుడిగా పేరుంది. ఆయన ఏకంగా తొమ్మిది సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. అలాంటి గిరిధర్ గమాంగ్ తన కుమారుడితో కలిసి బీజేపీని వీడి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకొన్నారు. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో ఆయన మెల్లిగా కాంగ్రెస్ లోకి జారుకున్నారు.  

మహారాష్ట్ర లీడర్ల చక్కర్లు

కేసీఆర్ సీఎంగా కొనసాగిన సమయంలో మహారాష్ట్రలో భారీ బహిరంగ సభలు  ఏర్పాటు చేసి దేశాన్ని పాలించిన బీజేపీ, కాంగ్రెస్ ఎలాంటి అభివృద్ధి చేయలేదంటూ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహారాష్ట్ర లీడర్లు హైదరాబాద్ కు వస్తున్నారు. పార్టీ టికెట్ కోసం వస్తున్న నేతలకు ఇటు మాజీ సీఎం కేసీఆర్ గానీ, మాజీ మంత్రి కేటీఆర్ గానీ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని సమాచారం. దీంతో వాళ్లు తిరిగి తిరిగి వేసారి వేరే దారి వెతుక్కుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. 

బల్దియాల్లో అవిశ్వాసాలు

గులాబీ పార్టీ అధికారం కోల్పోవడంతో ఇటు రాష్ట్రంలోని పట్టణాలు మూడు రంగుల జెండా పడుతున్నాయి. బల్దియాల చైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్లు కారు దిగి వెళ్లిపోతున్నారు. 29 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అవిశ్వాసాల బాట పట్టాయి. పలువురు జిల్లా పరిషత్, డీసీసీబీ చైర్మన్లు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ కండువాలు కప్పుకొంటున్నారు.

ఆత్మరక్షణలో లీడర్లు

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా సన్నాహాక సమావేశాలు నిర్వహిస్తున్న పార్టీ వర్కింగ్  ప్రెసిడెంట్ కేటీఆర్ నైరాశ్యంలో పడిపోయారు. ఓటమికి తానే బాధ్యుడనని, అహంకారం, మితిమీరిన విశ్వాసమే దెబ్బతీసిందని బహిరంగంగానే కామెంట్ చేస్తుండటం గమనార్హం. కింది స్థాయి  నాయకులు, కార్పొరేషన్ల చైర్మన్ల పదవుల్లో కొనసాగిన వారు కూడా పార్టీ అధినాయకత్వం తీరుపై సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తి పోస్తున్నారు.  వరుస పరిణామాలన్నీ బీఆర్ఎస్ లీడర్లను ఆత్మరక్షణలో పడేస్తున్నాయి.