ఖాళీల లెక్క  తేలాకే ఉద్యోగాల భర్తీపై కేబినెట్​ నిర్ణయం 

ఖాళీల లెక్క  తేలాకే ఉద్యోగాల భర్తీపై కేబినెట్​ నిర్ణయం 

ఆఫీసర్లు ఇచ్చిన లెక్కలు అసమగ్రంగా ఉన్నయ్​
పూర్తి వివరాలు హరీశ్​ రావు కమిటీకి ఇవ్వాలని ఆదేశం
ఆయిల్​ పామ్​ పంటపై స్టడీకి విదేశాలకు వెళ్లి రావాలని మంత్రులకు సూచన
ఫుడ్​ ప్రాసెసింగ్​ పాలసీ,  లాజిస్టిక్స్ పాలసీకి ఆమోదం
పీహెచ్​సీల్లో డాక్టర్లు రాత్రి 8 దాకా ఉండాలని ఆర్డర్​ నోటిఫికేషన్లు  

హైదరాబాద్‌‌, వెలుగు: ఉద్యోగుల విభజన, ప్రమోషన్ల తర్వాత ఏర్పడే ఖాళీల లెక్కలన్నీ తేలిన తర్వాతే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలని కేబినెట్​ నిర్ణయించింది. సీఎం కేసీఆర్‌‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌‌లో వరుసగా రెండో రోజు బుధవారం కేబినెట్‌‌ సమావేశమై ఉద్యోగాల భర్తీతో పాటు పలు అంశాలపై చర్చించింది. రాత్రి 10 గంటల వరకు సుదీర్ఘంగా ఈ భేటీ జరిగింది. అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులు ఆయా డిపార్ట్‌‌మెంట్లలో పోస్టుల సంఖ్య, పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌‌ సోర్సింగ్‌‌ ఉద్యోగుల వివరాలు, ఖాళీల సంఖ్యను కేబినెట్‌‌కు అందజేశారు. ఆ వివరాలు సమగ్రంగా లేవని, అన్ని శాఖల్లోని ఉద్యోగుల సంఖ్య, ఖాళీల వివరాలను ఐదు రోజుల్లోగా మంత్రి హరీశ్‌‌రావు నేతృత్వంలోని కేబినెట్‌‌ సబ్‌‌ కమిటీకి అందజేయాలని కేబినెట్​ ఆదేశించింది. 

ఏపీలో మిగిలిపోయిన 200 నుంచి 300 మంది వరకు తెలంగాణ ఉద్యోగులను స్వరాష్ట్రానికి తీసుకురావాలని నిర్ణయించారు. వారి సంఖ్యను ఖాళీలను గుర్తించే క్రమంలో పరిగణనలోకి తీసుకోవాలన్నారు. సీఎంవో నుంచి ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
కొత్త పరిశ్రమలకు ప్రోత్సాహం
వానాకాలం సీజన్‌‌లో 1.40 కోట్ల ఎకరాల్లో పంటలు పండిస్తున్నారని వరి, పత్తి దిగుబడి రికార్డు స్థాయిలో వచ్చే అవకాశముందని కేబినెట్‌‌ అంచనా వేసింది. పండిన పంటను నిల్వ చేయడం, మార్కెటింగ్‌‌పై దృష్టి పెట్టాలని, మిల్లింగ్ సామర్థ్యాన్ని పెంచుకోవాలని, కొత్త రైస్​ మిల్లులు, పారా బాయిల్డ్ మిల్లులను గణనీయంగా స్థాపించాలని సీఎం ఆదేశించారు.  పండిన ధాన్యాన్ని ఫుడ్ ప్రాసెసింగ్‌‌లో భాగంగా  మిల్లింగ్ చేసి ఎక్కడ డిమాండ్ ఉంటే అక్కడికి సరఫరా చేసేందుకు వీలుగా అన్ని చర్యలు తీసుకోవాలని కేబినెట్ ఆదేశించింది. అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులకు కొత్త పరిశ్రమలను ప్రోత్సహించాలని స్పష్టం చేసింది.  రైతులకు శిక్షణ ఇవ్వడానికి వ్యవసాయ, ఉద్యాన శాఖలు తగిన సౌకర్యాలు కల్పించాలంది.  సివిల్​ సప్లయీస్‌‌తో పాటు వ్యవసాయ శాఖలో ఎటువంటి ఉద్యోగాలు ఖాళీగా ఉండకూడదని, అన్ని పోస్టులను భర్తీ చేయాలని  కేబినెట్ తెలిపింది. 
ఆయిల్​ పామ్​ రైతులకు సబ్సిడీ
రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలని కేబినెట్ నిర్ణయించింది. వచ్చే ఏడాది  20 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేపట్టేలా రైతులను  ప్రోత్సహించాలని సూచించింది. రైతులకు మొదటి ఏడాది ఎకరాకు రూ. 26 వేలు, రెండో ఏడాది ఎకరాకు రూ. 5 వేలు, మూడో ఏడాది ఎకరాకు రూ. 5 వేలు చొప్పున పంట పెట్టుబడి ప్రోత్సాహకం కింద సబ్సిడీగా అందజేయాలని నిర్ణయించింది. అటవీ శాఖ, అటవీ అభివృద్ధి కార్పొరేషన్,  పంచాయతీరాజ్ అండ్​ రూరల్ డెవలప్ మెంట్ శాఖల సహాయంతో ఆయిల్ ఫామ్ మొక్కల నర్సరీలను పెంచాలని ఆదేశించింది. ఈ పంట విధానంలో వస్తున్న మార్పులను తెలుసుకునేందుకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కూడిన  అధ్యయన బృందం కోస్టారికా, మలేసియా, థాయ్ లాండ్, ఇండోనేసియా తదితర దేశాలలో పర్యటన చేపట్టాలని కేబినెట్ సూచించింది. ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ యూనిట్లకు, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ అండ్ ఎంటర్ ప్రెన్యూయర్ అడ్వాన్స్​మెంట్ (టీఐడీఈఏ), తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల (టీఎస్ఎఫ్‌‌పీజెడ్)  నిబంధనల ప్రకారం అందించే ప్రోత్సాహకాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. 
తెలంగాణ లాజిస్టిక్స్ పాలసీకి ఆమోదం
రాష్ట్రంలోని పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులను దేశ విదేశీ వినియోగదారుల చెంతకు చేర్చడానికి లాజిస్టిక్స్ రంగాన్ని ప్రోత్సహించాలని కేబినెట్ అభిప్రాయపడింది. అందులో భాగంగా పరిశ్రమలు, వాణిజ్య శాఖ రూపొందించిన ‘తెలంగాణ లాజిస్టిక్స్ పాలసీ’ కి ఆమోదం తెలిపింది. గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీలు, డ్రై పోర్టులు, ట్రక్ డాక్ పార్కింగ్ సహా మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సుమారుగా 1400 ఎకరాల్లో భారీ స్థాయిలో డ్రై పోర్టును (మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కును) పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేయనుంది. ఎగుమతులను మరింతగా ప్రోత్సహించడానికి కస్టమ్స్ శాఖ అనుసంధానంతో, సనత్ నగర్​ లో ప్రస్తుతమున్న కాంకర్ ఐసీడీ తరహాలో కొత్తగా మరో రెండు ఇంటిగ్రేటెడ్ కంటేనర్ డిపో (ఐసీడీ)లను స్థాపించేందుకు కేబినెట్​ ఆమోదం తెలిపింది. బాటసింగారం పార్కు తరహాలో రాష్ట్రవ్యాప్తంగా మరో 10 ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్కులను నెలకొల్పేందుకు ఆమోద ముద్ర వేసింది. మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులు, వేర్ హౌజ్ లను ఏర్పాటు చేసే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు  ప్రోత్సహకాలు అందించనుంది.  లాజిస్టిక్స్ రంగాభివృద్ధి ద్వారా ప్రత్యక్షంగా లక్ష మందికి, పరోక్షంగా రెండు లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని అంచనా వేసింది. దాదాపు 10 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు చేపట్టాలని పరిశ్రమల శాఖకు కేబినెట్ సూచించింది. అన్ని ప్రభుత్వ సంస్థలకు చెందిన ఆస్తులను క్రోడీకరించి జిల్లా వారీగా విభాగాల వారీగా సంకలనం చేయాలని కేబినెట్ ఆదేశించింది. 
కేబినెట్ సబ్ కమిటీ
ఫుడ్‌‌ ప్రాసెసింగ్‌‌ సహా కొత్త పరిశ్రమల ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి నిరంజన్‌‌రెడ్డి ఆధ్వర్యంలో కేబినెట్‌‌ సబ్‌‌ కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీలో సభ్యులుగా మంత్రులు  గంగుల కమలాకర్, హరీశ్ రావు, కెటిఆర్, ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డిని నియమించారు. 
కృష్ణా నీళ్ల ముచ్చటే లేదు
రాష్ట్ర మంత్రివర్గం రెండ్రోజులు సమావేశమైనా కృష్ణా నీళ్ల ముచ్చటే ప్రస్తావనకు రాలేదు. మంగళ, బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో చర్చించిన అంశాలపై సీఎంవో ఇచ్చిన ప్రెస్‌‌నోట్‌‌లో ఎక్కడా కృష్ణా నీళ్లకు సంబంధించిన వివరాలు పేర్కొనలేదు. తెలంగాణ కరెంట్‌‌ ఉత్పత్తిపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్‌‌ దాఖలు చేసినా..  తెలంగాణ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని న్యాయపోరాటానికి దిగినా.. దానిపై చడీచప్పుడు లేదు. ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తోన్న పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ లిఫ్ట్‌‌, ఆర్డీఎస్‌‌ కుడికాలువపై గతంలో నిర్వహించిన కేబినెట్‌‌లో మీడియా సమావేశాలు పెట్టి ఏపీ తీరును ఎండగట్టాలని ఆదేశించిన సీఎం కేసీఆర్‌‌.. ఇప్పుడు ఆ అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టారు. చట్టబద్ధంగా రాష్ట్రానికి దక్కే ఒక్క చుక్క నీటిని వదులుకోబోమని ప్రకటనలు ఇవ్వడమే తప్ప ఆ దిశగా కేబినెట్‌‌లో ఎలాంటి తీర్మానం చేయలేదు. కొత్త ట్రిబ్యునల్‌‌ ఏర్పాటుకు ఏపీ అడ్డుతగులుతున్నా దానిని ఎండగట్టే ప్రయత్నమేది చేయలేదు. రాజకీయ అవసరాల కోసం కృష్ణా జలాల వివాదాన్ని ఎత్తుకున్న ప్రభుత్వం దానికి సంబంధించిన కార్యాచరణ ఏదీ కేబినెట్‌‌భేటీలో ప్రకటించలేదు.
ఫుడ్​ ప్రాసెసింగ్​ పాలసీ 
‘తెలంగాణ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ’ కి కేబినెట్ ఆమోదం తెలిపింది.  ధాన్యం దిగుబడి పెరుగుతున్నందున పెద్ద ఎత్తున  ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను స్థాపించాలని,  మొదటి దశలో రాష్ట్రవ్యాప్తంగా 10 జోన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.  2024–25 నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల ఎకరాల్లో జోన్ల ఏర్పాటు లక్ష్యంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. వీటి ద్వారా 25 వేల కోట్ల పెట్టుబడిని ఆకర్షించి, 70 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి 3 లక్షల మందికి పరోక్ష ఉపాధి లభిస్తుందని చర్చించింది. ఫుడ్ ప్రాసెసింగ్  జోన్ల చుట్టూ కనీసం 500 మీటర్ల వరకు బఫర్ జోన్ గా గుర్తించి ఎలాంటి జనావాసాలకు, నిర్మాణాలను అనుమతించకూడదని నిర్ణయం తీసుకుంది. ఆసక్తి కలిగిన వ్యాపారవేత్తలు దరఖాస్తు చేసుకునే గడువు జులై 31 వరకు పొడిగించింది. విదేశాలకు ఎగుమతి చేసే నాణ్యతతో కూడిన స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని సూచించింది.  ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ప్రత్యేకంగా ‘ప్లగ్ అండ్ ప్లే’ పద్ధతిలో షెడ్లను ప్రభుత్వమే నిర్మిస్తుందని తెలిపింది. రైస్ మిల్లులు, బియ్యం ఉత్పత్తుల అనుబంధ పరిశ్రమలు, పప్పుధాన్యాలు, నూనె గింజలు , పండ్లు, పూలు, కూరగాయలు, మాంసం, చేపలు, కోళ్లు, పాలు మరియు డైరీ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లన్నీ  ఈ జోన్లలో ఏర్పాటుకు అనుమతించనుంది. గ్రామీణ ఎస్సీ, ఎస్టీ  మహిళలకు జోన్లల్లో  వ్యవస్థాపక అవకాశాలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని కేబినెట్​ తెలిపింది.