ఖమ్మం మార్కెట్ లో పనులను పరిశీలించిన కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

ఖమ్మం మార్కెట్ లో  పనులను పరిశీలించిన కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

ఖమ్మం టౌన్, వెలుగు  : వ్యాపారులు, కొనుగోలుదారులకు సౌకర్యవంతంగా ఉండేలా వీధి వ్యాపారుల ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులకు సూచించారు. ఖమ్మం పాత బస్టాండ్ ఎదురుగా ఉన్న వీధి వ్యాపారుల ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులతో కలిసి ఆయన గురువారం పరిశీలించారు.  మార్కెట్ బయట ఉన్న పబ్లిక్ టాయిలెట్స్ ను మరొక ప్రాంతంలో ఏర్పాటు చేయాలని, ఆ ప్లేస్​లో పార్కింగ్ కు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద మహిళా వ్యాపారులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలన్నారు. కలెక్టర్ వెంట మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ షఫీ ఉల్లా, మున్సిపల్ ఈఈ కృష్ణలాల్  ఉన్నారు. 

 ప్రత్యామ్నాయ స్థలంలో శ్మశానవాటిక 

ఖమ్మం రూరల్, వెలుగు: ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ప్రభుత్వ స్థలంలో శ్మశాన వాటిక ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.  ఖమ్మం రూరల్ మండలం జలగం నగర్ వద్ద ఉన్న డాడీ లంబాడ శ్మశాన వాటికను కలెక్టర్ పరిశీలించారు. కరకట్ట నిర్మాణంలో శ్మశాన వాటిక భూమి కొంత మేరకు కోల్పోతున్నందున, సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిలో కొత్తగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.