
సూర్యాపేట, వెలుగు: ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు ప్రతీ సబ్జెక్టులో 70 శాతం వచ్చేలా లెక్చరర్లు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, మోడల్ స్కూల్స్, వెల్ఫేర్ కళాశాలలు, కేజీబీవీల ప్రిన్సిపాల్స్ తో సమావేశం నిర్వహించారు. విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠాలు బోధించాలన్నారు. స్టూడెంట్స్హాజరు శాతం చాలా తక్కువగా ఉంటోందని, వారి తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించాలని చెప్పారు.
విద్యార్థులకు కెరియర్ పై మోటివేషనల్ క్లాస్ లు తీసుకొని ప్రోత్సహించాలని సూచించారు. ప్రతీ సోమ, మంగళవారాల్లో స్టాఫ్ అటెండెన్స్ 100 శాతం ఉండాలని, అత్యవసరమైతే తప్ప సెలవు మంజూరు చేయొద్దన్నారు. డీఐఈవో భానునాయక్, జీసీడీవో పూలన్, డీసీవోలు పద్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.