దేశంలో క్రిప్టో మేనియా

దేశంలో క్రిప్టో మేనియా
  • క్రిప్టో కరెన్సీ ఓనర్లు 10కోట్ల మంది పైనే

బిజినెస్‌‌ డెస్క్‌‌, వెలుగు: దేశంలో క్రిప్టో ఇండస్ట్రీ వేగంగా విస్తరిస్తోంది.   గ్లోబల్‌‌గా చూస్తే ఇండియాలోనే ఎక్కువ మంది క్రిప్టో ఇన్వెస్టర్లు ఉన్నారని అంచనా.  దేశంలో 10 కోట్ల మంది క్రిప్టో ఓనర్లు ఉన్నారని బ్రోకర్ చూజర్ ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌‌‌‌లో దేశంలో క్రిప్టో ఇన్వెస్ట్‌‌మెంట్ల విలువ 6.6 బిలియన్ డాలర్ల ( రూ. 49,189 కోట్ల) కు చేరుకుంది. కిందటేడాది సెప్టెంబర్‌‌‌‌లో కేవలం 923 మిలియన్ డాలర్ల (రూ. 6,830 కోట్ల) ఇన్వెస్ట్‌‌మెంట్లు మాత్రమే జరిగేవి. స్టాక్ మార్కెట్ల కంటే క్రిప్టో ఇండస్ట్రీపై  ఆసక్తి ఎక్కువయ్యింది. చాలా మందికి షేర్లు, బాండ్లు తెలియక పోయినా, బిట్‌‌కాయిన్‌‌ గురించి తెలుస్తోంది. అతిపెద్ద స్టాక్ బ్రోకరేజ్‌‌ కంపెనీ జెరోధా కస్టమర్ల కంటే క్రిప్టో ఎక్స్చేంజి కాయిన్ స్విచ్ కుబేర్ కస్టమర్లు ఎక్కువగా ఉండడం విశేషం. దేశంలో మొత్తం  15 క్రిప్టో ఎక్స్చేంజిలు గత రెండేళ్లలోనే పుట్టుకొచ్చాయి. ఇంతలా క్రిప్టో ఇండస్ట్రీపై ఆసక్తి పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. 

యువతే ముఖ్యం..
క్రిప్టో ఇండస్ట్రీ భారీగా విస్తరించడానికి ప్రధాన కారణం యువతే. 18–40 ఏళ్లు మధ్య వయసున్న వారు క్రిప్టో ట్రేడింగ్‌‌కు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. తక్కువ టైమ్‌‌లోనే పెద్ద మొత్తంలో రిటర్న్‌‌లు వస్తుండడం క్రిప్టో ట్రేడింగ్‌‌లో మెయిన్ అడ్వాంటేజ్‌‌. నష్టాలు కూడా అలానే వస్తాయి. కానీ, నష్టపోతే మన పెట్టిన డబ్బులు పోతాయి. అదే ప్రాఫిట్స్ వస్తే పెట్టిన ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ డబుల్‌‌, ట్రిపుల్‌‌ అవుతుందని అంచనా వేస్తున్నారు. కొన్ని క్రిప్టో కరెన్సీలు 1000 శాతానికి పైగా లాభాలను తక్కువ టైమ్‌‌లోనే ఇచ్చాయి. ఇది ఇన్వెస్టర్లను ముఖ్యంగా యువతను ఆకర్షిస్తోంది.

బిట్‌‌కాయిన్, డోజ్‌‌కాయిన్‌‌, ఎథరమ్‌‌ వంటి ఫేమస్ కరెన్సీలతో పాటే రీసెంట్‌‌గా పాపులర్ అవుతున్న సొలానా, కార్డనో వంటి  కరెన్సీలు కూడా గత కొన్ని సెషన్ల నుంచి భారీగా ర్యాలీ చేస్తున్నాయి. టీనేజర్లు తమ పేరెంట్స్ డిటైల్స్‌‌తో అకౌంట్లు ఓపెన్ చేసి క్రిప్టో ట్రేడింగ్ చేస్తున్నారు. క్రిప్టో ట్రేడింగ్ 24   గంటలూ ఉంటుంది. గ్లోబల్‌‌గా అన్ని దేశాల్లోని ఇన్వెస్టర్లు ఈ ట్రేడింగ్‌‌లో పాల్గొంటారు. దీంతో లిక్విడిటీ ఎక్కువగా ఉంటుంది. ఇది యువతను ఆకర్షిస్తోంది. రిస్క్ తీసుకోవడానికి బయపడని ఇన్వెస్టర్లు క్రిప్టోలో డబ్బులు పెడుతున్నారు.

కొంతమంది భారీ లాభాలను చూడగా, మరికొంత మంది నష్టపోతున్నారు కూడా. అయినప్పటికీ  క్రిప్టోలపై రోజు రోజుకీ ఆసక్తి పెరుగుతూనే ఉంది.  బ్లాక్ చెయిన్ టెక్నాలజీ వంటి కొత్త ఇన్నొవేషన్లలో స్టార్టింగ్‌‌ స్టేజ్‌‌లోనే ఇన్వెస్ట్ చేయాలనే ఆలోచన పెరిగింది. ఇక ఫ్యూచర్‌‌‌‌లో వర్చువల్ కరెన్సీలే ఉంటాయనే అంచనాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోలను ఆదరిస్తుండడంతో ఈ ఇండస్ట్రీ సస్టయిన్ అవుతుందనే నమ్మకం ఇన్వెస్టర్లకు కలుగుతోంది. 
సర్కులర్​ను మార్చిన ఆర్​బీఐ..
ఈ ఏడాది మే నెలలో ఆర్‌‌‌‌బీఐ ఇచ్చిన సర్కులర్‌‌‌‌  క్రిప్టో ఇండస్ట్రీకి వరంలా మారింది. క్రిప్టో ట్రేడింగ్‌‌కు వ్యతిరేకంగా 2018 లో ఇచ్చిన ఆదేశాలను పాటించొద్దని ఈ ఏడాది మేలో ఆర్‌‌‌‌బీఐ బ్యాంకులను ఆదేశించింది. క్రిప్టో సెటిల్‌‌మెంట్స్‌‌ను అడ్డుకోవద్దని ప్రకటించింది.  ఇది క్రిప్టో ఇండస్ట్రీకి పాజిటివ్‌‌ అంశం. ఆర్‌‌‌‌బీఐ ఇచ్చిన 2018 ఆదేశాలను 2020 లో సుప్రీం కోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి దేశంలో క్రిప్టో ఇండస్ట్రీ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. క్రిప్టో ఎక్స్చేంజిల్లో ట్రేడింగ్ వాల్యూమ్స్‌‌ పెరుగుతున్నాయి.

ప్రభుత్వానికి క్రిప్టోలను బ్యాన్ చేసే ఆలోచన లేదని, ఈ ఇండస్ట్రీపై  రెగ్యులేషన్స్ పెట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ప్రస్తుతం క్రిప్టో ట్రేడింగ్ లాభాల్లో 30 శాతం క్యాపిటల్‌‌ గెయిన్ ట్యాక్స్‌‌ను విధిస్తున్నారు. కాగా, ప్రభుత్వం కూడా డిజిటల్ కరెన్సీ బిల్లును తీసుకు రావాలని చూస్తోంది. డిజిటల్ రూపాయిని తెచ్చేందుకు సిద్ధమవుతుండడంతో ప్రభుత్వానికి వర్చువల్ కరెన్సీలను బ్యాన్ చేసే ఆలోచన లేదనే ఊహాగానాలు ఎక్కువవుతున్నాయి. దేశంలో క్రిప్టో మేనియాకు ఇదొక కారణం. 
బాలీవుడ్ యాక్టర్లతో  యాడ్స్‌‌..
క్రిప్టోల వైపు మరింత మందిని ఆకర్షించడానికి వజీర్ఎక్స్‌‌, కాయిన్‌‌స్విచ్ కుబేర్ వంటి ఎక్స్చేంజిలు బాలివుడ్ యాక్టర్లతో క్యాంపెయిన్ చేస్తున్నాయి. తమ ఫేవరేట్ యాక్టర్‌‌‌‌ క్రిప్టోల్లో ఇన్వెస్ట్ చేయమని చెబితే ఇన్వెస్టర్లకు కూడా క్రిప్టోలపై నమ్మకం కలుగుతుందని ఈ ఎక్స్చేంజిలు భావిస్తున్నాయి. అమితాబచ్చన్ వంటి సూపర్ స్టార్లు  తమ సొంత నాన్ ఫంగిబుల్‌‌ టోకెన్‌‌ (ఎన్‌‌ఎఫ్‌‌టీ)లను విడుదల చేస్తుండడంతో క్రిప్టో క్రేజ్ మరింత పెరుగుతోంది. దేశియ కాయిన్లయిన  బోలీకాయిన్‌‌, $గారిలను  బాలీవుడ్ యాక్టర్ సల్మాన్‌‌ఖాన్‌‌ ప్రమోట్ చేస్తున్న విషయం తెలిసిందే. 
దేశంలో క్రిప్టో మేనియా స్టార్టయ్యింది. ఒకప్పుడు వర్చువల్ కరెన్సీలను చూసి బయపడిన వారే, ఇప్పుడు ఈ కరెన్సీల వైపు పరుగెడుతున్నారు. ముఖ్యంగా యువత  రిస్క్‌‌ ఉన్నా తాము రెడీగా ఉన్నామంటోంది. దేశంలో క్రిప్టో ఓనర్లు 10 కోట్లకు పైనే ఉన్నారు. ఇది స్టాక్ మార్కెట్‌‌ ఇన్వెస్టర్ల కంటే ఎక్కువ.  తక్కువ టైములోనే భారీ లాభాలు వస్తుండడంతో పాటు, బ్లాక్ చెయిన్ టెక్నాలజీదే ఫ్యూచర్ అనే ఆలోచన ఇన్వెస్టర్లలో నెలకొంది. క్రిప్టో ఇండస్ట్రీ మరింత పెరుగుతుందనే అంచనాలు మరింతగా బలపడుతున్నాయి. 
బిట్‌‌కాయిన్ లక్ష డాలర్లకా!
తాజాగా 67 వేల డాలర్లను టచ్ చేసిన బిట్‌‌కాయిన్‌‌, భవిష్యత్‌‌లో లక్ష డాలర్లను టచ్‌‌ చేసిన ఆశ్చర్య పోవాల్సిన పనిలేదంటున్నారు కొంత మంది ఎనలిస్టులు. ఈ ఏడాది చివరికల్లా లక్ష డాలర్ల మార్క్‌‌ను ఈ క్రిప్టో కరెన్సీ టచ్ చేస్తుందని   చెబుతున్నారు. యూఎస్‌‌లో బిట్‌‌కాయిన్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్‌‌ను లాంచ్‌‌ చేశారు. దీంతో ఈ క్రిప్టోపై ఇన్వెస్టర్లలో నమ్మకం పెరుగుతోంది. ముఖ్యంగా చిన్న ఇన్వెస్టర్ల కంటే పెద్ద పెద్ద ఇన్‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు బిట్‌‌కాయిన్‌‌పై ఎక్కువ పాజిటివ్‌‌గా ఉన్నారు. మరికొంత మంది ఎనలిస్టులు మాత్రం ఈ ఏడాది చివరికల్లా బిట్‌‌కాయిన్ 90 వేల డాలర్లను టచ్ చేస్తుందని చెబుతున్నారు.