నకిలీ డాక్టర్లు, హాస్పిటళ్లపై చర్యలు తీసుకోవాలి

నకిలీ డాక్టర్లు, హాస్పిటళ్లపై చర్యలు తీసుకోవాలి

సూర్యాపేట, వెలుగు:  సూర్యాపేట జిల్లా కేంద్రంలో వైద్య రంగంలో ప్రక్షాళన జరగాలని, నకిలీ డాక్టర్లు, హాస్పిటళ్లపై చర్యలు తీసుకోవాలని వక్తలు డిమాండ్ చేశారు.  జయశంకర్ మానవ వనరుల అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం సూర్యాపేట వైద్యరంగంపై చర్చా వేదిక నిర్వహించారు. కార్యక్రమంలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు, ఐఎంఏ సభ్యులు, జర్నలిస్ట్ సంఘాల నాయకులు, ప్రజా సంఘాలు పాల్గొని మాట్లాడారు. పేద, అమాయక ప్రజలే లక్ష్యంగా నకిలీ డాక్టర్లు, అర్హత లేని రేడియాలజిస్టులతో స్కానింగ్ సెంటర్లు నిర్వహించడం దారుణమన్నారు.

పట్టణంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లపై నిర్వహించిన తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయన్నారు. జర్నలిస్టులు, ప్రజా సంఘాలు, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు, ఐఎంఏ పోరాటంతోనే నకిలీ డాక్టర్ల బాగోతాలు బయటపడ్డాయన్నారు. కార్యక్రమంలో జయశంకర్ మానవ వనరుల అభివృద్ధి వేదిక ప్రతినిధులు కుంట్ల ధర్మార్జున్, తండు నాగరాజు, మెడికల్ కౌన్సిల్ సభ్యులు రాజీవ్, ఐఎంఏ అధ్యక్షుడు ఆనంద్ దాండ్గే, తదితరులు పాల్గొన్నారు.