ఓబీసీ రిజర్వేషన్ల అమలు కీలక ముందడుగు

ఓబీసీ రిజర్వేషన్ల అమలు కీలక ముందడుగు

శతాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురై అణచివేతలోనే మగ్గుతున్న ఎస్సీలు, ఎస్టీలు, సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన తరగతులు, మహిళలు, దివ్యాంగులకు సమాజ మద్దతు అవసరం. బలహీన వర్గాల హక్కులను పరిరక్షించినప్పుడే రాజ్యాంగం ప్రతిపాదించిన సామాజిక న్యాయ సూత్రం అమలవుతుంది. తరాలుగా వెనకబడిన వారికి ఎదిగేందుకు అవకాశం ఇస్తే.. వాళ్లు కూడా అన్ని రంగాల్లో అద్భుత ప్రతిభను ప్రదర్శించగలుగుతారు. రిజర్వేషన్లు, ప్రత్యేక స్కూళ్లు, కాలేజీల ఏర్పాటు ద్వారా ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు తీసుకోవడం శుభపరిణామం. ఆల్​ఇండియా కోటా మెడికల్, డెంటల్​సీట్లలో ఓబీసీలకు 27 శాతం, ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సమాజంలోని వెనకబడిన, నిరాదరణకు గురవుతున్న వర్గాల ఆశలు తీర్చడంలో, బాబా సాహెబ్ అంబేద్కర్ లక్ష్యాలను సాధించడంలో కీలక ముందడుగు. దేశంలో అణచివేతకు గురవుతున్న వర్గాలకు విద్యనందించేందుకు ప్రభుత్వాలు రెసిడెన్షియల్ హాస్టళ్లు, కొండ ప్రాంతాల్లోని గిరిజన స్టూడెంట్స్​కోసం ఏకలవ్య స్కూల్స్​ఏర్పాటు చేయగా.. ప్రస్తుతం అవి వారి ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ స్కూళ్లలో విద్యనభ్యసించిన స్టూడెంట్స్​ఎందరో వివిధ రంగాల్లో ప్రతిభ చూపుతున్నారు.  ప్రజలు విద్యావంతులై, ఐక్యంగా ముందుకు సాగుతూ హక్కుల కోసం పోరాడాలని డాక్టర్ బీఆర్​అంబేద్కర్ పిలుపునిచ్చారు. విద్య, ఉపాధి, ప్రమోషన్లలో రిజర్వేషన్లు సమాజంలో అద్భుత అవకాశాలు అందించాయి. వీటి సాయంతో అట్టడుగు స్థాయి నుంచి ఎదిగిన ఎంతో మంది పాలన, విద్య, శాస్త్ర, సాంకేతిక, పరిశోధన, ఇన్నోవేషన్ రంగాల్లో విజయం సాధించి కీలక స్థానాల్లో ఉన్నారు. 
ఓబీసీ రిజర్వేషన్లు..
దేశంలోని వెనకబడిన, అణచివేతకు గురవుతున్న వర్గాల ప్రజల విముక్తికి, సాధికారతకు సమర్థవంతమైన సాధనం విద్య అని బాబా సాహెబ్ అంబేద్కర్​ప్రతిపాదించారు. వాళ్లు సమాజంలో ఎదిగేందుకు, హుందాగా జీవించడానికి అవసరమైన సామర్థ్యాన్ని విద్య అందిస్తోంది. అఖిల భారత వైద్య విద్య సీట్లలో ఓబీసీలకు 27 శాతం, ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న కేంద్ర కేబినెట్ నిర్ణయం సమాజంలోని వెనకబడిన, నిరాదరణకు గురవుతున్న వర్గాల ఆశలు తీర్చడంలో కీలక ముందడుగు అని చెప్పొచ్చు. సర్కారు నిర్ణయంతో సాధారణ విద్యార్థులతోపాటు ఓబీసీలు, ఆర్థికంగా వెనకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్) స్టూడెంట్స్​మెడికల్, డెంటల్​ఎడ్యుకేషన్​లో ఆల్​ఇండియా కోటాలో సీట్లు సాధించే వీలు కలిగింది.  అందరితోపాటు ఓబీసీ వర్గాలకు చెందిన స్టూడెంట్స్ కు​కూడా వైద్య రంగంలో మంచి ఉపాధి అవకాశాలు రానున్నాయి. మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఏటా ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన 5,550 మంది స్టూడెంట్స్​ వైద్య విద్యలో చేరేందుకు బాటలు వేసింది. అఖిల భారత కోటా ద్వారా గవర్నమెంట్​మెడికల్​ కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేట్ విభాగంలో 15%,  పీజీ విభాగంలో 50%సీట్లు అందుబాటులోకి వస్తాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2007లోనే ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7.5% రిజర్వేషన్లు ప్రవేశపెట్టారు. వాస్తవానికి కేంద్రీయ విద్యా సంస్థలను భాగస్వాములు చేయడం కోసం 27% రిజర్వేషన్లు ప్రవేశపెట్టారు. కానీ గతంలో వైద్య విద్యలో ఓబీసీలు, ఈడబ్ల్యూఎస్ లకు స్థానం ఉండేది కాదు. మోడీ ప్రభుత్వం ఓబీసీలు, ఈడబ్ల్యూఎస్ లను కూడా వైద్య విద్యలో భాగస్వాములను చేస్తూ రిజర్వేషన్లను 37 శాతానికి విస్తరించింది. తద్వారా తొలిసారిగా ఈ వర్గాల స్టూడెంట్స్​కూడా వైద్య వృత్తిలో రాణించేందుకు ఆస్కారం ఏర్పడింది. రిజర్వేషన్లకు అనుగుణంగా అదనపు సీట్లు అందుబాటులోకి తేవడం కోసం 2021-–22 అకడమిక్​ఇయర్​నుంచి వైద్య విద్య సీట్ల సంఖ్య పెంచారు. మోడీ ప్రభుత్వ నిర్ణయం సామాజికంగా, ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనాలను పరిరక్షించేదిగా ఉంది. 
ప్రభుత్వ ప్రత్యేక గుర్తింపు..
ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక గుర్తింపునిచ్చి అవకాశాలు కల్పించడం వల్ల సమాజంలో ఇప్పటి వరకు బహిష్కృతులుగా ఉన్న ఆ వర్గాల్లో భద్రతా భావం పెరిగింది. వారిలో సాధికారత ఏర్పడింది. అణచివేతకు గురవుతున్న వర్గాలకు చెందిన తొలి తరం విద్యార్థుల్లో ఎక్కువ మంది ఆంగ్లేతర, ప్రాంతీయ భాషా నేపథ్యం నుంచి వచ్చిన కారణంగా వారు సామాజిక శాస్త్ర విద్యారంగంలో రాణించినా స్టెమ్ విద్యా రంగంలో వెనుకబడిపోయారు. ఈ అంశం గుర్తించిన ప్రభుత్వం ప్రత్యేకించి శాస్త్ర, సాంకేతిక శాఖ (డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ) ఆ వర్గాల వారిని స్టెమ్ విద్యా రంగంలో కూడా నిపుణులను చేయడం కోసం స్కాలర్ షిప్ లు, ఫెలోషిప్ లు, ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు, వర్క్ షాప్ లు, ఉపాధ్యాయ శిక్షణ, ఇన్ హౌస్ కార్యక్రమాలు ప్రారంభించడం మంచి ఫలితాలనిచ్చింది. దీంతో వారు కూడా సైన్స్ అండ్​ టెక్నాలజీల్లో ప్రతిభ చూపుతున్నారు.                                                                                                 - ప్రొ. టీవీ కట్టిమణి వైస్ చాన్సలర్, సెంట్రల్​ ట్రైబల్ ​యూనివర్సిటీ, విజయనగరం