పిలగాండ్లను కిరాయికి తీస్కుంటున్నరు!

పిలగాండ్లను కిరాయికి తీస్కుంటున్నరు!

ఇండ్లను, బండ్లను కిరాయికి తీస్కొనుడు తెల్సు. చేలను, చెలకల్ను కౌలు తీస్కొనుడు తెల్సు. పిలగాండ్లను ఎవ్వలైనా కిరాయికి తీస్కొంటరానే? అయితెగియితె దత్తతకు తీస్కుంటరు గనీ, కిరాయికి తీస్కుంటరా ఏడనైనా! అని అనుకుంటున్రా? అగో ఆ ముచ్చటే ఇది. జపాన్​లో జనం ఎక్కువ దినాలు బత్కుతరు కదా అందుకే అక్కడ ముసలోళ్లు బాగా ఎక్కువ. వాళ్లను చూస్కోనీకి నర్సింగ్​ హోమ్​లు కూడా ఎక్వతక్వ గాకుండా ఉంటయ్​​. ఇవి మన దగ్గరున్న ఓల్డేజ్​హోమ్​ల లెక్క. అలాంటిదే ‘ఇచొయన్ ​నర్సింగ్​హోమ్’. ఇది ‘కిత్కయుషు’ టౌన్ల ఉంటది. ఇందులో 120 మంది ముసలోళ్లు ఉన్నరు. వీళ్లంతా 80 ఏండ్లు పైన ఉన్నోళ్లే. వీళ్లను జాగ్రత్తగా చూస్కోనీకి సిబ్బంది కూడా ఉన్నరు. అయితే, ఇక్కడ అన్ని సౌలతులున్నా.. పిలగాండ్లు లేక ముసలోళ్లు ఇబ్బంది పడుతున్నరని కనుక్కున్నరట సిబ్బంది. చాలామందికి మన్వలు, మన్వరాల్లు ఉన్నా వాళ్లు వచ్చుడు తక్కువాయె.

అందుకనే పిలగాండ్లను కిరాయికి తీస్కొని, నర్సింగ్​హోమ్​లోని ముసలోళ్ల మొహంలో సంతోషం చూడాలనుకున్నరు. వెంటనే పేపర్ల ప్రకటనిచ్చిన్రు. నాలుగేండ్లలోపు పిలగాండ్లను కిరాయికి తీస్కుంటమన్నరు. పిల్లలు నర్సింగ్​హోమ్​ల ఉన్నంతవరకు వాళ్ల అమ్మనాన్న లేదా గార్డియన్​ తోడుగా ఉండొచ్చన్నరు. ఆ ప్రకటన చూసి చాలామంది తమ పిల్లల్ని నర్సింగ్​హోమ్​కు కిరాయికి ఇస్తున్నరు. ఇప్పుడైతే 32 మంది పిల్లలు నర్సింగ్​హోమ్​కు వస్తున్నరు. ఆ పిల్లల నవ్వుల్ని చూసి, వాళ్లతో ఆడుకొని, ముద్దులు, కౌగిలింతలు ఇచ్చి మురిసిపోతున్నరంట అక్కడి పెద్దోళ్లు.  ఇంతకీ కిరాయికి ఇచ్చినందుకు పైసలేమైనా ఇస్తరా అని అనుకుంటున్రా ? ఇస్తరు.. కాకపోతే పైసలు కాదు.. డైపర్స్​, మిల్క్ బాటిల్స్​, ఫ్రీ బేబీ ఫొటో షూట్స్​, దగ్గర్లోని కేఫెల కూపన్స్​ ఇస్తున్నరు.