
- ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్స్ పెంచాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరెట్ లో బడిబాట కార్యక్రమం నిర్వహణ, ఇందిరా డెయిరీ కార్యక్రమం అమలుపై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో అడిషనల్ కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న వసతులు, నూతనంగా చేపట్టిన టీచర్ల నియామకం, వస్తున్న మార్పులను పిల్లల తల్లిదండ్రులకు వివరించాలన్నారు.
ఫలితాలు, టాపర్స్ వివరాలతో వీడియోలు రూపొందించి ప్రచారం చేసి ప్రభుత్వ బడులపై ప్రజలకు నమ్మకం కల్పించాలని సూచించారు. భవిత సెంటర్ లోని పిల్లల కోసం 7 సీటర్ ఆటో ఏర్పాటు చేయాలన్నారు. ఇందిరా డెయిరీ పై సమీక్షిస్తూ నిర్దేశించిన లక్ష్యం మేరకు పశువుల యూనిట్ గ్రౌండింగ్ కు కార్యాచరణ అమలు చేయాలన్నారు. జడ్పీ సీఈవో దీక్షా రైనా, డీఆర్డీవో సన్యాసయ్య, డీఈవో ఎస్. సత్యనారాయణ, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ నవీన్ బాబు, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి కస్తాల సత్యనారాయణ, జిల్లా బీసీ సంక్షేమ అధికారిణి జ్యోతి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారిణి విజయలక్ష్మి, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి డాక్టర్ పురందర్, ఎల్డీఎం శ్రీనివాస రెడ్డి, అధికారులు, పాల్గొన్నారు.
భూ సమస్యల పరిష్కారానికి కృషి
వైరా, వెలుగు : రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. వైరా మండలం పూసలపాడులో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సును ఆయన పరిశీలించారు. సాదా బైనామా దరఖాస్తులను హైకోర్టు తీర్పు ప్రకారం పరిష్కరించనున్నట్లు తెలిపారు. ప్రైవేట్ లైసెన్స్ సర్వేయర్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చి శిక్షణ అందిస్తోందని చెప్పారు.
జిల్లాలో 600 మందికి ప్రస్తుతం శిక్షణ అందుతోందని, త్వరలోనే గ్రామ కంట సర్వేలు నిర్వహిస్తామని చెప్పారు. రైతులు ఆయిల్ పామ్ లాంటి పంటలను సాగు చేసి లాభాలు పొందాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్లు అనర్హులకు ఇస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం వైరా మండలంలోని నారపనేనిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న బడిబాట కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.