
- 40 తులాల ఆభరణాలు,
- రూ. 10 వేలు ఎత్తుకెళ్లిన దొంగలు
- ఇంట్లో డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్స్ తో పోలీసుల తనిఖీలు
- మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఘటన
కోల్‌బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లాలో సింగరేణి కార్మికుడి ఇంట్లో భారీ చోరీ జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. మందమర్రి మండలం గద్దెరాగడి పద్మావతి కాలనీ(క్యాతనపల్లి మున్సిపాలిటీ)లో సింగరేణి కార్మికుడు మేకల రాజయ్య, స్వరూప దంపతులు కొత్తగా ఇంటిని నిర్మించుకున్నారు. శుక్రవారం ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకొని రాత్రి 11 గంటల సమయంలో కుటుంబసభ్యులు, బంధువులు నిద్రపోయారు. శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో రాజయ్య కుటుంబసభ్యులు లేచి చూడగా బ్యాగులు, ఇతర వస్తువులు చిందరవందరగా పడి కనిపించాయి.
బ్యాగులో దాచిన 30 తులాల బంగారు ఆభరణాలు, ఒక ఐ ఫోన్, రూ.10వేల నగదుతో పాటు స్వరూప చెల్లి కూతురు సింధు-, శ్రీనివాస్దంపతులకు చెందిన మరో 10తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించి రామకృష్ణాపూర్పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, మందమర్రి సీఐ శశిధర్‌రెడ్డి, ఆర్కేపీ ఎస్ఐ రాజశేఖర్వెళ్లి డాగ్‌స్వ్కాడ్,క్లూస్ టీమ్స్ తో సోదాలు చేయించారు. ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించారు. ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టామని ఏసీపీ, సీఐ తెలిపారు. కొత్త ఇంటికి కిటికి గ్రిల్ లేకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి వెళ్లి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.