మేడేపల్లి గ్రామానికి ఉత్తమ అవార్డు

మేడేపల్లి గ్రామానికి ఉత్తమ అవార్డు

ముదిగొండ, వెలుగు : పర్యావరణ పరిరక్షణలో భాగంగా ముదిగొండ మండలంలోని మేడేపల్లి గ్రామపంచాయతీకి వ్యర్థాల నిర్వహణలో అమలు చేసిన అత్యుత్తమ పనితీరు, వర్మీ కంపోస్ట్ ఎరువు తయారీ, తడి-పొడి చెత్త సేకరణ, సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధానికి సంబంధించి ప్రతిష్టాత్మక అవార్డుతో పాటు ప్రశంసా పత్రం లభించింది. రాష్ట్రంలోనే కేవలం మూడు గ్రామ పంచాయతీలకుగా  ఉత్తమ అవార్డులు దక్కగా, అందులో ఖమ్మం జిల్లా నుంచి మేడేపల్లి గ్రామం ఎంపికైంది.

 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం హైదరాబాద్ లో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో  పర్యావరణ అటవీ, దేవదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ద్వారా ఉత్తమ అవార్డు, ప్రశంస పత్రాన్ని గ్రామ పంచాయతీ కార్యదర్శి రమ్య అందుకున్నారు. గతంలో మేడేపల్లి గ్రామ మాజీ సర్పంచ్ సామినేని రమేశ్, మాజీ ఎంపీపీ సామినేని హరిప్రసాద్ గ్రామా అభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణలో కీలకపాత్ర పోషించారు. అవార్డు రావడం పట్ల గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి రమ్య మాట్లాడుతూ మేడేపల్లి గ్రామపంచాయతీకి ఉత్తమ అవార్డు లభించడం సంతోషంగా ఉందన్నారు. అందుకు సహకరించిన కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, డీపీవో, ఇతర అధికారులకు, గ్రామస్తులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.