ప్రతి తండాకు ఓ విజయగాథ : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

ప్రతి తండాకు ఓ విజయగాథ : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
  • ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు : ప్రతి తండాకు ఓ విజయగాథ ఉంటుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్​లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గిరిజనులకు రిజర్వేషన్ అమలైన రోజే రూ.3 కోట్లతో గిరిజన భవన్ నిర్మాణానికి జీవో విడుదల కావడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి అట్లూరి లక్ష్మణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. 1976లో  ఇందిరాగాంధీ పీఎంగా ఉన్న సమయంలో గిరిజనులకు విద్య, ఉద్యోగ రిజర్వేషన్ అమలు చేశారని, దాని ఫలితంగా ఎంతో మంది గిరిజనులు ఉన్నత పదవులు పొందాలని తెలిపారు. 

మూడు అంతస్తుల్లో గిరిజన భవన్​నిర్మిస్తామన్నారు. ఒక అంతస్తులో విద్యార్థులు చదువుకోవడానికి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. గిరిజనుల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. సమావేశంలో ఎస్టీ సెల్ నాయకులు ఆర్.శేఖర్ నాయక్, రఘునాయక్, లింగంనాయక్, కె.శేఖర్ నాయక్, లక్ష్మణ్ నాయక్, రాజు నాయక్, తులసీరామ్ నాయక్, కిషన్ నాయక్, నాయకులు పాల్గొన్నారు. 

ప్రతిభా పురస్కారాలు అందజేత..

మనం చేసే మంచి పనులే భవిష్యత్​తరాలకు ఉపయోగపడుతాయని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అరుంధతి ఉద్యోగ బంధు సేవా సమితి ఆధ్వర్యంలో నగరంలోని అరుంధతి భవనంలో ఏర్పాటు చేసిన ప్రతిభా పురస్కార మహోత్సవానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై పురస్కారాలు అందజేశారు. మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల్లో సీట్లు సాధించిన విద్యార్థులు, గ్రూప్ 1,2 ఫలితాల్లో విజయం సాధించిన వారిని అభినందించారు. అనంతరం తెలంగాణప్రదేశ్ ఎరుకల సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ కళాభవన్ లో ఆత్మగౌరవ పోరాట జెండా పండగ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏకలవ్యుడి ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు.