ప్రైవేట్​కు రెఫర్ చేస్తే చర్యలు : ఇలా త్రిపాఠి

ప్రైవేట్​కు రెఫర్ చేస్తే చర్యలు : ఇలా త్రిపాఠి
  • నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి 
  • మిర్యాలగూడ బాలింత మృతి ఘటనపై విచారణకు ఆదేశం 

నల్గొండ అర్బన్, వెలుగు: ప్రభుత్వ డాక్టర్లు రోగులను ప్రైవేట్ హాస్పిటల్స్ కు రెఫర్ చేస్తే చర్యలు తీసుకుంటామని నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులతో, మాతృ మరణాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత డిసెంబర్​లో కాన్పు కోసం వచ్చిన దామరచర్ల మండలం జైత్రం తండాకు చెందిన అడావత్ రాజేశ్వరికి వైద్యం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆమె మృతికి కారణమైన ప్రైవేట్​ఆస్పత్రిపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు.

ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. పేషెంట్ల అవగాహన లోపం, నిర్లక్ష్యం, తదితర కారణాలవల్ల మాతృ మరణాలు సంభవించకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళలు గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవమయ్యే వరకు నిరంతరం ఏఎన్సీ చెకప్ తోపాటు, ఈడీడీ ప్రకారం సుఖప్రసవం అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఇన్​చార్జి రెవెన్యూ అడిషన్​ కలెక్టర్ నారాయణ అమిత్, డీఎంహెచ్ వో పుట్ల శ్రీనివాస్, డీసీహెచ్ ఎస్ మాతృనాయక్, ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్ అరుణ కుమారి, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి 

నల్గొండ అర్బన్: ప్రత్యామ్నాయ పంటల సాగు, ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. శుక్రవారం నల్గొండ కలెక్టరేట్‌లో వ్యవసాయ శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులు, వ్యవసాయ అధికారులతో వానాకాలం సాగు సంసిద్ధతపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. వరి, పత్తి  వంటి పంటలే కాకుండా, కూరగాయలు, పండ్ల తోటలు, వాణిజ్య పంటల సాగు, ప్రకృతి వ్యవసాయం చేసేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు.

 ఉద్యాన పంటలు, కొత్త వంగడాల సాగుకు సంబంధించి ప్రతి 2 మండలాలను కలిపి క్లస్టర్‌‌గా ఏర్పాటు చేసేందుకు నెలలోపు ప్రతిపాదనలు సమర్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. కట్టంగూరు రైతు ఉత్పాదక సంస్థ వ్యవస్థాపకుడు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి, చందంపేట అభ్యుదయ రైతు పద్మా రెడ్డి, ప్రకృతి రైతులు అంజిరెడ్డి, జక్కుల వెంకటేశ్‌, నవీన్ రెడ్డి మాట్లాడారు. అనంతరం కూరగాయలు, పామాయిల్‌ సాగుపై రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కరపత్రాన్ని, బుక్ లెట్‌ను ఆవిష్కరించారు. డీఏవో శ్రవణ్, ఉద్యాన శాఖ అధికారి అనంతరెడ్డి, రైతులు పాల్గొన్నారు.

స్క్రీనింగ్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

ఈనెల 25న నల్గొండలోని నాగార్జున డిగ్రీ కాలేజీలో నిర్వహించనున్న గ్రామ పాలనాధికారుల  స్క్రీనింగ్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం తెలిపారు. ఈ పరీక్షకు 276 మంది హాజరుకానున్నట్లు చెప్పారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు కొనసాగుతుందన్నారు.