- ‘శామ్ భాయ్’ అంటూ దీపావళి శుభాకాంక్షలు
- మోదీని ‘గుజరాతీ స్నేహితుడు’గా అభివర్ణించిన పిట్రోడా
న్యూఢిల్లీ: రాజకీయంగా నిత్యం విమర్శలు గుప్పించుకునే ప్రధాని మోదీ, కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా మధ్య దీపావళి వేళ ఆశ్చర్యకరమైన రీతిలో స్నేహపూర్వక వాతావరణం నెలకొంది. పిట్రోడా తనను 'గుజరాతీ స్నేహితుడు' అని అభివర్ణించడంతోపాటు వ్యక్తిగతంగా ఎలాంటి విద్వేషాలు లేవని పేర్కొనగా.. ప్రధాని మోదీ ఆయనకు దీపావళి, గుజరాతీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ 'సామ్ భాయ్' అని సంబోధించారు. "శామ్ భాయ్, అంజనా బెన్‌లకు దీపావళి, నూతన సంవత్సర శుభాకాంక్షలు.
రాబోయే కాలం మీకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించాలి" అని ప్రధాని 'ఎక్స్' వేదికగా పోస్ట్ చేశారు. అంతకుముందు పిట్రోడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మోదీ తన గుజరాతీ స్నేహితుడని, ఆయనొక మంచి వక్త, కష్టపడి పనిచేసే వ్యక్తిని కొనియాడారు. తమ మధ్య రాజకీయ, సైద్ధాంతిక విభేదాలు మాత్రమే ఉన్నాయని, వ్యక్తిగతంగా ఎలాంటి కక్షల్లేవని స్పష్టం చేశారు. మోదీని రాజకీయంగా విభేదిస్తూనే, ఆయనతో కలిసి భోజనం చేసి నవ్వుతూ గడపగలనని చెప్పారు.
మరోవైపు, కాంగ్రెస్ విదేశీ శక్తులతో చేతులు కలిపిందంటూ బీజేపీ చేస్తున్న విమర్శలను పిట్రోడా తీవ్రంగా ఖండించారు. బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జ్ సోరోస్‌తో తనకూ, రాహుల్ గాంధీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.
