
- యూనిక్కోడ్తో ఫార్మర్రిజిస్ట్రేషన్
- ఇప్పటికే కునారం నుంచి మేలైన విత్తనోత్పత్తి
పెద్దపల్లి, వెలుగు: రైతులు తమ సొంత పొలాల్లో మేలైన విత్తనాలు ఉత్పత్తి చేసుకునేలా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ సైంటిస్టులు రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. పెద్దపల్లి జిల్లాలో నేటి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇప్పటికే జిల్లాలోని కునారం వ్యవసాయ పరిశోధన కేంద్రం నుంచి మేలైన వరి విత్తనాలను తయారు చేస్తున్నారు. ఈ విత్తనాలు తెలంగాణతో పాటు దక్షిణ భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో అధిక దిగుబడులు ఇస్తున్నాయి.
వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా జిల్లా వ్యవసాయశాఖ నేటి నుంచి ‘రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమం ద్వారా నూతన విత్తనోత్పత్తితో పాటు సులభతరమైన, అధిక దిగుబడులు సాధించడం లాంటి మెలకువలను నేర్పించనున్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండలం కునారం వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రధాన సైంటిస్ట్ శ్రీధర్సిద్ది నేతృత్వంలో ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి
రైతులకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా పీఎం కిసాన్ లబ్ధిదారులకు తదుపరి విడత లబ్ధి పొందేందుకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఆధార్ లాగే ప్రతీ రైతుకు 11 నెంబర్లతో విశిష్ట సంఖ్య (యూనిక్ కోడ్ ) ని కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రతీ రైతు తన భూములకు సంబంధించిన వివరాలను ఫార్మర్ రిజిస్ట్రేషన్‌లో పొందుపరచాల్సి ఉంటుంది.
ఈ వివరాలను వ్యవసాయ అధికారులు రైతు ఆధార్ సంఖ్యతో అనుసంధానం చేసి ఫార్మర్ ఐడీని కేటాయిస్తారు. అయితే ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఏ రకమైన చట్టబద్ధ యాజమాన్య హక్కును కల్పించదు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనుసంధానిస్తారు. ఈనెల 5 నుంచి పెద్దపల్లి జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు ప్రతి క్లస్టర్లలో ప్రారంభమవుతుంది. రైతులు ఏవో, ఏఈవోలను సంప్రదించి ఫార్మర్ ఐడీని క్రియేట్ చేసుకోవచ్చు.
అగ్రికల్చర్ వర్సిటీ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో..
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని పరిశోధనలను సైంటిస్ట్‌లు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో రైతులకు వివరించనున్నారు. ఈ అవగాహన సదస్సులు సోమవారం నుంచి జూన్ 11 వరకు జిల్లావ్యాప్తంగా ఆరు రైతు వేదికల్లో నిర్వహించనున్నారు. వ్యవసాయంలో వస్తున్న సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించడంతోపాటు అధిక దిగుబడులను ఇచ్చే వంగడాలను స్థానికంగానే ఉత్పత్తి చేసుకునేలా శిక్షణ ఇస్తారు.
మోతాదుకు మించి యూరియా, రసాయన ఎరువుల వాడకం వల్ల కలిగే నష్టాలను వివరిస్తారు. భూగర్భ జలాల పరిరక్షణ కోసం సాగునీటి వినియోగంపై అవగాహన, పంటల మార్పిడి, చెట్ల పెంపకం పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించనున్నారు. మొదటి రోజు మే 5న కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం, 12న ముత్తారం మండల కేంద్రం, 24న కాల్వ శ్రీరాంపూర్ మండలం తారుపల్లి, 28 ఓదెల మండలం జీలకుంట, జూన్ 5న పెద్దవల్లి మండలం రాంపల్లి, జూన్ 11 పెద్దపల్లి కేంద్రంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
రైతులు సద్వినియోగం చేసుకోవాలి
వ్యవసాయంలో మెలకువలు, విత్తనోత్పత్తిపై అవగాహన కల్పించేందుకు సైంటిస్ట్‌లు గ్రామాల్లో రైతులను కలుస్తారు. రైతులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఈ నెల రోజులు రైతులు తమ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవాలి. క్లస్టర్లతో పాటు జీపీల్లో కూడా రిజిస్ట్రేషన్ చేస్తారు. రెండు ప్రోగ్రామ్స్‌కు రైతులు అందుబాటులో ఉండాలి.
ఆదిరెడ్డి, డీఏవో, పెద్దపల్లి