కమిషన్లు నిల్.. సీఎంవో ఫుల్​!

కమిషన్లు నిల్.. సీఎంవో ఫుల్​!
  • కమిషన్లు నిల్.. సీఎంవో ఫుల్​!
  • జనానికి అక్కరకొచ్చే ఆఫీసుల్లో పోస్టులన్నీ ఖాళీ
  • సీఎం ఆఫీసు మాత్రం రిటైర్డ్  అధికారులతో నింపుడే నింపుడు
  • రెండేండ్లుగా ఎస్సీ, ఎస్టీ కమిషన్​లో నియామకాల్లేవ్​
  • 5 నెలలుగా మానవ హక్కుల కమిషన్​దీ అదే పరిస్థితి
  • సమాచార కమిషన్​లోనూ ఖాళీ కుర్చీలే
  • సీఎంవోలో మాత్రం ఇద్దరు చీఫ్​ అడ్వయిజర్లు,  పది మంది అడ్వయిజర్లు
  • అందులో తొమ్మిది మంది రిటైర్డ్, మాజీ ఆఫీసర్లే

హైదరాబాద్, వెలుగు:  తమ గోస చెప్పుకుందామని మానవ హక్కుల కమిషన్​ దగ్గరికి జనం పోతే అక్కడ చైర్మన్​ సీటు ఖాళీ..  సభ్యుల సీట్లూ ఖాళీ. ఎస్సీ, ఎస్టీ కమిషన్​ వద్దకు పోతే అక్కడా ఖాళీ కుర్చీలే. సమాచార కమిషన్​లోనూ అదే పరిస్థితి. ప్రజలకు ఎంతో అక్కరకు వచ్చే కీలకమైన కమిషన్లను రాష్ట్ర సర్కారు గాలికి వదిలేసింది. కమిషన్లలోని పోస్టులు ఖాళీ అయి నెలలు, ఏండ్లు గడుస్తున్నా భర్తీ చేయడం లేదు. అదే.. చీఫ్​ మినిస్టర్​ ఆఫీసు (సీఎంవో)ను మాత్రం రిటైర్డ్​ ఐఏఎస్, రిటైర్డ్​ ఐపీఎస్​ ఆఫీసర్లతో నింపేస్తున్నది. అయినోళ్లను, అక్కరకు వస్తరనుకున్నోళ్లను ఇట్ల రిటైర్డ్​ అవగానే..  అట్ల సీఎంవోలోకి తెచ్చిపెట్టుకుంటున్నది. ప్రత్యేక పోస్టులు క్రియేట్​ చేసి బాధ్యతలు అప్పగిస్తున్నది. లక్షల జీతంతో చీఫ్​ అడ్వయిజర్లుగా, అడ్వయిజర్లుగా నియమించుకొని, కేబినెట్​ హోదా ఇచ్చి, వాళ్ల పదవీకాలాన్ని ఏండ్లకేండ్లు పొడిగిస్తున్నది. 

ఎస్సీ, ఎస్టీ కమిషన్​.. పేరుకే ఉంది!

‘‘రాజ్యాంగం, చట్టాల అమలు. దళితులు,  గిరిజనులకు రక్షణ. ప్రతి నెలా 30న జరిగే పౌర హక్కుల దినోత్సవంలో అన్ని గ్రామాల ప్రజలు పాల్గొని సమసమాజాభివృద్ధికి తోడ్పడాలని మా మనవి’’... ఇదీ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్​ వెబ్​సైట్​ ఓపెన్​ చేయగానే  కనిపించే సందేశం. కానీ, వాస్తవం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ప్రతి నెలా పౌర హక్కుల దినోత్సవాన్ని  నిర్వహించడం సంగతి దేవుడెరుగు.. మొదాలు ఆ కమిషన్​కే పెద్ద దిక్కు లేకుండా పోయింది. అసలు కమిషన్​ను ఏర్పాటు చేయడంలోనే చాలా ఆలస్యం జరిగింది. రాష్ట్రం ఏర్పడినప్పట్నుంచి దాదాపు నాలుగేండ్ల పాటు కమిషన్​ లేకుండానే సర్కారు నెట్టుకొచ్చింది. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు పోరాడగా పోరాడగా 2018లో కమిషన్​ను ఏర్పాటు చేసింది.

అదే ఏడాది ఫిబ్రవరిలో చైర్మన్​ను, సభ్యులను నియమించింది. కమిషన్​ చైర్మన్​గా బీఆర్​ఎస్​ లీడర్​ ఎర్రోళ్ల శ్రీనివాస్​, సaభ్యులుగా బోయుల్లా విద్యాసాగర్​, ఎం.రాంబాల్​ నాయక్​, కుస్రం నీలా దేవి, సుంకపాక దేవయ్య, చిలకమర్రి నర్సింహలను మూడేండ్ల కాలపరిమితితో నియమించింది. వాళ్లు స్వచ్ఛందంగా తప్పుకోవాలనుకుంటే.. వారి రాజీనామాను ప్రభుత్వం ఆమోదించి కొత్త చైర్మన్​ సభ్యులను నియమించే దాకా వారు ఆ పదవిలోనే కొనసాగుతారని అప్పట్లో నియామక ఉత్తర్వుల్లో సర్కారు పేర్కొంది. అయితే, ఆ కమిషన్​ మొత్తం 2021 ఫిబ్రవరిలో ఖాళీ అయింది. ఎస్సీ, ఎస్టీ కమిషన్​ చైర్మన్​ ఎర్రోళ్ల శ్రీనివాస్​ను ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్​కు చైర్మన్​గా నియమించడంతో కమిషన్​ కుర్చీ వెకెంట్​గా ఉంది. అప్పట్నుంచి సర్కారు కొత్తగా ఎవరినీ చైర్మన్​గా నియమించలేదు. అసలు దాని గురించే పట్టించుకోవడం లేదు. అంతేకాదు.. ప్రతి నెలా నిర్వహించాల్సిన పౌర హక్కుల దినోత్సవమూ మూలకు పడింది. దళితులపై జరుగుతున్న దాడులు, అరాచకాలపై ఫిర్యాదు చేసేందుకు వేదికంటూ లేకుండా పోయింది. అంతేకాదు.. చైర్మన్​ ఉన్నప్పుడు ఇచ్చిన ఫిర్యాదులూ ఇప్పటికీ పెండింగ్​లోనే ఉన్నాయి. ఇప్పుడు మేజర్​ ఫిర్యాదులను తీసుకుని రిజిస్టర్​ చేస్తున్నా అవీ ఫైళ్లకే పరిమితమవుతున్నాయి. ఏదైనా సంఘటన జరిగితే జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషనే నేరుగా రంగంలోకి దిగాల్సి వస్తున్నది. కమిషన్​లో నియామకాలకు సంబంధించి ఇటీవల సర్కారుకు హైకోర్టు మొట్టికాయలు వేసినా.. స్పందన లేదు. 

రిటైరవ్వుడే ఆలస్యం.. సీఎంవోలోకి

కీలకమైన కమిషన్లన్నింటినీ ఖాళీగా పెట్టిన సర్కారు.. తనకు కావాల్సిన ఐఏఎస్​, ఐపీఎస్​ అధికారులు రిటైరైతే మాత్రం వెంటనే సీఎంవోలోకి తెచ్చి పెట్టుకుంటున్నది. ప్రభుత్వ ముఖ్య సలహాదారులు, సలహాదారులుగా పోస్టులు క్రియేట్​ చేసి వాళ్లకు ఇస్తున్నది. అట్లా ఇప్పటిదాకా తొమ్మిది మందిని నియమించింది. రాజీవ్​ శర్మనైతే.. 2016 డిసెంబర్​లో అలా సీఎస్​గా రిటైరయ్యారో లేదో ఆ వెంటనే ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా సర్కారు నియమించింది. ఇప్పటికీ ఆయన ఆ పదవిలోనే కొనసాగుతున్నారు. ఈ మధ్యే వీఆర్​ఎస్​ తీసుకున్న మాజీ సీఎస్​ సోమేశ్​ కుమార్​.. కొద్ది రోజుల కింద మహారాష్ట్రలో నిర్వహించిన బీఆర్​ఎస్​ పార్టీ సమావేశంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయనను తీసుకొచ్చి ముఖ్య సలహాదారు పోస్టులో ప్రభుత్వం కూర్చోబెట్టింది. రిటైర్డ్​ ఐఏఎస్​ అధికారులు కేవీ రమణాచారి, శైలేంద్ర కుమార్​ జోషి, రిటైర్డ్​ ఐఎఫ్​ఎస్​ఆఫీసర్​ ఆర్.శోభ, రిటైర్డ్​ ఐపీఎస్ అధికారులు ఏకే ఖాన్​, అనురాగ్​ శర్మ, రిటైర్డ్  ఐఈఎస్ ఆఫీసర్​ జీఆర్​రెడ్డితోపాటు మరో రిటైర్డ్​ ఆఫీసర్​ఈ. శ్రీనివాస రావును  ప్రభుత్వ సలహాదారులుగా కొనసాగుతున్నారు. వీరితోపాటు టంకశాల అశోక్​, సుద్దాల సుధాకర్​ తేజ, రాజేంద్ర ప్రసాద్​ సింగ్ కూడా  ప్రభుత్వ సలహాదారులుగా ఉన్నారు. మొత్తంగా ప్రభుత్వ సలహాదారులుగా 12 మంది సీఎంవోలో ఉండగా.. వీరిలో తొమ్మిది మంది రిటైర్డ్​, మాజీ ఆఫీసర్లే.  ముఖ్యమంత్రి కార్యాలయంలో  సీఎస్, సీఎంవో సెక్రటరీలు, పర్సనల్​ సెక్రటరీలున్నా కూడా.. కావాల్సిన వాళ్లకు పదవులు క్రియేట్​ చేసి ఇచ్చారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఫిబ్రవరి నుంచి  సమాచార కమిషన్​ ఖాళీ

సమాచార కమిషన్​పైనా సర్కారు చిన్నచూపే చూస్తున్నది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కమిషన్​లోని సభ్యులంతా ఒకేసారి రిటైర్​ అయ్యారు. దీంతో అప్పట్నుంచి అది కూడా ఖాళీగానే ఉంది. 2017లో ఏర్పాటు చేసిన కమిషన్​కు తొలి చీఫ్​ కమిషనర్​గా జస్టిస్​ ఎస్. రాజా సదారాం, కమిషనర్​గా బుద్ధా మురళిని ఆనాటి గవర్నర్​ నర్సింహన్​ నియమించారు. వారితో పాటు సీనియర్​ జర్నలిస్టులు కట్టా శేఖర్​ రెడ్డి, మైదా నారాయణరెడ్డి, లాయర్లు సయ్యద్​ ఖలీలుల్లా, మహ్మద్​ అమీర్​ హుస్సేన్​, గిరిజన విద్యార్థి నేత శంకర్​ నాయక్​ను నియమించారు. సదారాం రిటైర్​ అయిన తర్వాత బుద్ధా మురళి చీఫ్​ కమిషనర్​గా ఎంపికయ్యారు. బుద్ధా మురళి ఈ ఏడాది జనవరిలో, మిగతా కమిషనర్ల పదవీ కాలం ఫిబ్రవరిలో ఒకేసారి ముగిసింది. దీంతో అక్కడా ఖాళీ చైర్లే కనిపిస్తున్నాయి. కమిషనర్లు ఉన్నప్పుడే వేల సంఖ్యలో పిటిషన్లు పెండింగ్​లో ఉండగా.. ఇప్పుడు వాటికి మరిన్ని పిటిషన్లు తోడవుతున్నాయి. పిటిషన్లకు రిప్లై ఇచ్చేందుకు నెలల టైం పడుతున్నది. 

మానవ హక్కుల కమిషన్​కు వెబ్​సైట్​ కూడా లేదు

రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​ నిరుడు డిసెంబర్​లో ఖాళీ అయింది. ఈ కమిషన్​ ఏర్పాటులోనూ సర్కారు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. హైకోర్టు జోక్యం చేసుకున్న తర్వాతే 2019 డిసెంబర్​ 21న ఏర్పాటు చేసింది. కమిషన్​కు మొట్టమొదటి చైర్మన్​గా జస్టిస్​ చంద్రయ్యను నియమించారు. మెంబర్​గా రిటైర్డ్​ సెషన్స్​ జడ్జి నడిపల్లి ఆనందరావు, నాన్​ జ్యుడీషియల్​ మెంబర్​గా మహ్మద్​ ఇర్ఫాన్​ను నియమించారు. వాళ్ల పదవీకాలం 2022 డిసెంబర్​ 22తో ముగిసింది. దాదాపు ఐదు నెలల నుంచి ఖాళీ కుర్చీలే కమిషన్​లో దర్శనమిస్తున్నాయి. ఇటీవల నాలుగేండ్ల బాలుడిపై కుక్కలు దాడి చేసి చంపేసిన ఘటనపై ఫిర్యాదు చేసేందుకు వెళ్తే కమిషన్​ ఆఫీసులో ఎవరూ లేకపోవడం పరిస్థితికి అద్దం పడుతున్నది. దీంతో బాధితులు గతిలేక అక్కడి ఉద్యోగులకు ఫిర్యాదును అందజేశారు. సంచలనంగా మారిన మెడికో ప్రీతి మృతి కేసు.. రాష్ట్రంలో హక్కుల కమిషన్​ లేకపోవడంతో జాతీయ హక్కుల కమిషన్​కు చేరింది. అసలు రాష్ట్రంలో కమిషన్​ పెట్టి ఇన్నేండ్లవుతున్నా.. దానికంటూ ప్రత్యేకంగా ఒక వెబ్​సైట్​ అంటూ ఏదీ లేదు.  దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలూ తమ తమ మానవ హక్కుల కమిషన్లకు వెబ్​సైట్లను నిర్వహిస్తున్నాయి. కానీ, మన దగ్గర అదీ లేదు. 


సీఎంవోలో అంతా వాళ్లే

సీఎంవోలో చీఫ్​ సెక్రటరీ, సీఎంవో సెక్రటరీలు, పర్సనల్​ సెక్రటరీలు ఉండగా.. వారికి తోడు ముఖ్య సలహాదారు, సలహాదారులను ప్రభుత్వం నియమించింది. ఇందులో  మాజీ సీఎస్​ రాజీవ్​ శర్మ.. ఆరేడేండ్ల నుంచి ముఖ్య సలహాదారుగా కొనసాగుతున్నారు. మొన్నామధ్య వీఆర్​ఎస్​ తీసుకున్న మాజీ సీఎస్​ సోమేశ్​ కుమార్​కు ప్రభుత్వం ఇటీవలే ముఖ్య సలహాదారు పదవిని ఇచ్చింది. రిటైర్డ్​ ఆఫీసర్లయిన కేవీ రమణాచారి, శైలేంద్ర కుమార్​ జోషి,  ఆర్.శోభ, ఏకే ఖాన్​, అనురాగ్​ శర్మ, జీఆర్​రెడ్డి, ​ఈ. శ్రీనివాస రావు అడ్వయిజర్లుగా కొనసాగుతున్నారు.  టంకశాల అశోక్​, సుద్దాల సుధాకర్​ తేజ, రాజేంద్ర ప్రసాద్​ సింగ్​ కూడా సలహాదారులుగా ఉన్నారు. మొత్తంగా 12 మంది అడ్వయిజర్లలో..  తొమ్మిది మంది రిటైర్డ్​, మాజీ ఆఫీసర్లే.