
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా దేవస్థానం ఆధ్వర్యంలో 'సామూహిక గిరిప్రదక్షిణ' కార్యక్రమాన్ని చేపట్టారు. శనివారం తెల్లవారుజామున ఉదయం 5:30 గంటలకు వైకుంఠ ద్వారం వద్ద భక్తులతో కలిసి భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో భాస్కర్ శర్మ ప్రత్యేక పూజలు చేసి గిరిప్రదక్షిణ ఆరంభించారు. గిరిప్రదక్షిణలో భాగంగా భక్తులు రెండున్నర కిలోమీటర్లు కొండ చుట్టూ కాలినడకన ప్రదక్షిణలు చేశారు. అనంతరం కొండపైకి చేరుకుని గర్భగుడిలో స్వయంభు నారసింహుడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. గిరిప్రదక్షిణ చేసిన భక్తులకు దేవస్థాన ఆఫీసర్లు ప్రత్యేక దర్శనం సదుపాయం కల్పించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.
ఘనంగా 'అష్టోత్తర శతఘటాభిషేకం'..
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో అష్టోత్తర శతఘటాభిషేక కైంకర్యాన్ని ఆలయ అర్చకులు అట్టహాసంగా నిర్వహించారు. స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామి–అమ్మవార్లకు శతఘటాభిషేకాన్ని ఘనంగా చేపట్టారు. ఉత్సవంలో భాగంగా ప్రధానాలయ ముఖమంటపంలో, గర్భగుడికి అభిముఖంగా, స్వర్ణ ధ్వజస్తంభానికి ఎదురుగా శుద్ధ జలంతో కూడిన 108 వెండి కలశాలను వరుసగా పేర్చి వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల హోరు నడుమ కలశాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 108 కలశాల్లో ఉన్న మంత్రజలంతో స్వామివారికి అర్చనాభిషేకాలు నిర్వహించారు.