మ‌‌‌‌‌‌‌‌రో 25 సబ్​రిజిస్ట్రార్ ​ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్ : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

మ‌‌‌‌‌‌‌‌రో 25 సబ్​రిజిస్ట్రార్ ​ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్ : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
  • ఈ నెల 12 నుంచి అమలు చేస్తం
  • మూడో వారానికల్లా అన్ని సబ్​రిజిస్ట్రార్​ ఆఫీసుల్లో అందుబాటులోకి 
  • స్లాట్​ విధానంపై 94 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 12వ తేదీ నుంచి మరో 25 సబ్​రిజిస్ట్రార్​ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలోని మొత్తం 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వచ్చే నెల మూడో వారం నాటికి ఈ విధానాన్ని  అమలులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. గత నెల 10వ తేదీ నుంచి 22 ఎస్​ఆర్​ఓల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ విధానం ద్వారా.. నవంబర్ 30 నాటికి సగటున 866 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయినట్లు మంత్రి వెల్లడించారు. ఈ విధానం ప్రజలకు సమయం ఆదా చేయడంతో పాటు, రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసిందని తెలిపారు. 

త్వరలో రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దీనిని అమలు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురువారం సచివాలయంలో స్టాంప్స్ అండ్​ రిజిస్ట్రేషన్ విభాగంపై రివ్యూ చేశారు. రెండో దశలో రంగారెడ్డి జిల్లాలోని ఫరూక్ నగర్, షాద్‌‌‌‌‌‌‌‌నగర్, మహేశ్వరం, వనస్థలిపురం, షేర్ లింగంపల్లి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఉప్పల్, ఘట్‌‌‌‌‌‌‌‌కేసర్, నారప్పల్లి, మల్కాజ్‌‌‌‌‌‌‌‌గిరి, జనగామ, ఘన్‌‌‌‌‌‌‌‌పూర్, నర్సంపేట, బీబీనగర్, ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల, పెద్దపల్లి, కల్వకుర్తి, వనపర్తి, గద్వాల్, గజ్వేల్, మెదక్ జిల్లాలోని సిద్దిపేట అర్బన్,  రూరల్, రంగారెడ్డి, వరంగల్, హైదరాబాద్, హైదరాబాద్ సౌత్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. 

ప్రయోగాత్మకంగా అమలు చేసిన 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి పోస్ట్‌‌‌‌‌‌‌‌కార్డ్ ద్వారా సేకరించిన అభిప్రాయాల్లో 94 శాతం మంది ప్రజలు స్లాట్ బుకింగ్ విధానంపై సంతృప్తి వ్యక్తం చేశారని అధికారులు మంత్రికి వివరించారు. చంపాపేటలో రిజిస్ట్రేషన్ చేసుకున్న విష్ణుగౌడ్ అనే వ్యక్తితో మంత్రి స్వయంగా ఫోన్‌‌‌‌‌‌‌‌లో మాట్లాడి, విధానం పట్ల స్పందనను తెలుసుకున్నారు. "స్లాట్ బుకింగ్ విధానం వల్ల గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం తగ్గింది. కేవలం 10 నుంచి -15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతోంది" అని విష్ణుగౌడ్ తెలిపినట్టు మంత్రి వెల్లడించారు.

త్వరలోనే ఆధార్-ఈ సైన్​

రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి ఆధార్ ఆధారిత ఈ-సైన్​ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ విధానాన్ని వీలైనంత త్వరగా అమలులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అలాగే, స్లాట్ బుకింగ్ కోసం ఇంటర్నెట్ స్పీడ్‌‌‌‌‌‌‌‌ను పెంచాలని, సాంకేతిక సమస్యలను తక్షణం పరిష్కరించాలని సూచించారు. "రాష్ట్రంలోని 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ విధానాన్ని దశలవారీగా విస్తరిస్తాం. వచ్చే నెల మూడో వారం నాటికి అన్ని కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ అమలులోకి రానుంది" అని మంత్రి స్పష్టం చేశారు. 

ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి అదనపు సిబ్బందిని నియమించడంతో పాటు, రద్దీ ఎక్కువగా ఉన్న కార్యాలయాల్లో స్లాట్‌‌‌‌‌‌‌‌ల సంఖ్యను పెంచనున్నట్టు తెలిపారు. స్లాట్ బుకింగ్ విధానం విజయవంతం కావడంలో అధికారుల పాత్ర ప్రశంసనీయమని మంత్రి పొంగులేటి  శ్రీనివాస్​ రెడ్డి కొనియాడారు. స్లాట్ బుకింగ్ విధానం అమలులో సాంకేతిక సమస్యలుతలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. 

రద్దీ ఎక్కువగా ఉన్న కార్యాలయాల్లో అదనపు సబ్ రిజిస్ట్రార్లను నియమించడం ద్వారా స్లాట్‌‌‌‌‌‌‌‌ల సంఖ్యను పెంచినట్టు తెలిపారు. ఉదాహరణకు.. కుత్బుల్లాపూర్ కార్యాలయంలో అదనంగా ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లను నియమించడం వల్ల 144 స్లాట్‌‌‌‌‌‌‌‌లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, స్టాంప్స్ అండ్​ రిజిస్ట్రేషన్ ఐజీ జ్యోతి బుద్దప్రకాశ్, సీసీఎల్ఏ సెక్రటరీ మకరంద్, మీసేవ డైరెక్టర్ రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.

పాస్‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌ కరెక్షన్ల  అప్లికేషన్లే ఎక్కువ

రైతుల భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు తీసుకొచ్చిన ‘భూ భారతి’చట్టానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. 4 పైలట్ మండలాల్లో 11,630 దరఖాస్తులు స్వీకరించగా, 555 మండలాల్లో అవగాహనా సదస్సులు పూర్తయినట్టు తెలిపారు. ఈ నెల 5 నుంచి 28 జిల్లాల్లో.. జిల్లాకు ఒక మండలంలో చట్టాన్ని అమలు చేయనున్నట్లు గురువారం ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. జూన్ 2 నాటికి పైలట్ మండలాల్లో భూ సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. గత నెల 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా భూ భారతి చట్టం అమలు ప్రారంభమైందని.. ఖమ్మం (నేలకొండపల్లి), కామారెడ్డి (లింగంపేట), నారాయణ్‌‌‌‌‌‌‌‌పేట (మద్దూర్), ములుగు (వెంకటాపూర్) మండలాల్లో పైలట్‌‌‌‌‌‌‌‌గా రెవెన్యూ సదస్సులు అమలు చేస్తున్నట్లు చెప్పారు.

 ఈ 4 మండలాల్లోని 72 రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు నిర్వహించినట్లు తెలిపారు. ‘‘605 మండలాల్లో 555లో అవగాహనా సదస్సులు నిర్వహించినం. కలెక్టర్లు, ఎమ్మార్వోల నేతృత్వంలో 2 బృందాలు ఈ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాయి. పైలట్ మండలాల్లో స్వీకరించిన 11,630 దరఖాస్తుల్లో పట్టాదారు పాస్​బుక్​ కరెక్షన్​కు సంబంధించినవి 3,446 ఉన్నాయి. ప్రతి అప్లికేషన్​కు రశీదు ఇచ్చినం. రోజువారీగా కంప్యూటర్‌‌‌‌‌‌‌‌లో నమోదు చేసి అధికారులకు పంపినం’’అని పొంగులేటి తెలిపారు.