ఈహెచ్ఎస్ పై తేల్చకపోతే కార్యాచరణ ప్రకటిస్తాం : శ్రీనివాసరావు

ఈహెచ్ఎస్ పై తేల్చకపోతే కార్యాచరణ ప్రకటిస్తాం : శ్రీనివాసరావు
  • టీజీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు

యాదగిరిగుట్ట, వెలుగు : ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్(ఈహెచ్ఎస్) అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్(టీజీవోస్) అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. శనివారం యాదగిరిగుట్టలోని సౌభాగ్య రిసార్ట్స్ లో టీజీవోస్ కేంద్ర సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై తీర్మానాలు చేసి ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న రూ.180 కోట్ల మెడికల్ బిల్లులను చెల్లించిన ప్రభుత్వానికి గెజిటెడ్ ఉద్యోగుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కేబినెట్ సబ్ కమిటీ ఆమోదించిన 57 డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. 

పెండింగ్ లో ఉన్న నాలుగు డీఏలు రిలీజ్ చేసి కాంట్రిబ్యూషన్ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని, పాత పెన్షన్ స్కీమ్ ను పునుద్ధరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ఫార్ములా ప్రకారం రెండో పీఆర్సీ అమలు చేయాలన్నారు. అద్దె వాహనాల బిల్లును నెలకు రూ.50 వేలకు పెంచి, బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు గుడిబండగా మారిన 317 జీవోపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో పాత జిల్లాల ప్రకారం అన్ని విభాగాల్లో అదనపు క్యాడర్ స్ట్రెంత్ ను తీసుకోవాలన్నారు. 

రిటైర్మెంట్ తీసుకున్న అధికారులను తిరిగి సర్వీసులోకి చేర్చుకోకుండా కొత్త నియామకాలు చేపట్టాలని, పలు కారణాలతో సస్పెండ్ అయిన ఉద్యోగులను నిబంధనల మేరకు తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. తీర్మానాలకు సంబంధించిన పత్రాలను ప్రభుత్వ సీఎస్, కేబినెట్ సబ్ కమిటీ, ఆఫీసర్స్ త్రిసభ్య కమిటీని కలిసి అందజేస్తామని తెలిపారు. 

సమావేశంలో టీజీవోస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ సత్యనారాయణ, అసోసియేట్ అధ్యక్షుడు శ్యామ్, కోశాధికారి ఉపేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు జగన్ మోహన్ రావు, సహదేవ్, రామకృష్ణగౌడ్, నరహరిరావు, మల్లేశం, సెక్రటరీలు పరమేశ్వర్ రెడ్డి, శిరీష, శ్రీనివాస్ రెడ్డి, హరికృష్ణ, శ్రీధర్, సుజాత, 33 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.