రష్యా దాడుల్లో ఉక్రెయిన్ యువ నటుడు పాషా లీ కన్నుమూత

రష్యా దాడుల్లో ఉక్రెయిన్ యువ నటుడు పాషా లీ కన్నుమూత

కీవ్: ఉక్రెయిన్ పై రష్యా సైన్యం జరుపుతున్న బాంబు దాడుల్లో ఉక్రెయిన్ యువనటుడు పాషా లీ (33) కన్నుమూశారు. రష్యా యుద్ధం ప్రారంభించిన వెంటనే అధ్యక్షుడు జెలన్ స్కీ పిలుపునకు స్పందించి సైన్యంలో చేరాడు. ఇర్ఫిన్ నగర శివారు ప్రాంతంలో ఉక్రెయిన్ సైనికులతో కలసి రష్యా సేనలను నిలువరించే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే రష్యా సైనికులు జరిపిన కాల్పుల్లో పాషా లీ తుదిశ్వాస విడిచారు. 
క్రిమియాలో జన్మించిన పాషా లీ ఉక్రెయిన్ సినిమాల్లో నటిస్తున్నాడు. రష్యా ఉక్రెయిన్ పై యుద్ధం ప్రారంభించడంతో ఉక్రెయిన్ ప్రజలు సైనికులు ఎక్కడికక్కడ రష్యా సేనలను ఎదుర్కోవాలని.. ఉత్సాహం ఉన్న వాళ్లంతా యుద్ధంలో చేరాలని అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రకటించిన విషయం తెలిసిందే. రాజధాని కీవ్ పై రష్యా సేనలు విరుచుకుపడుతుంటే.. మరింత ముందుకు రాకుండా ఉక్రెయిన్ సేనలతోపాటు ప్రజలు ఎక్కడికక్కడ తిరగబడుతున్నారు. దేశాన్ని కాపాడుకునేందుకు నావంతు పోరాడుతానని ముందుకొచ్చారు పాషా లీ. ఇర్ఫిన్ నగర శివార్లలో ఉక్రెయిన్ సైన్యంతో కలసి విధులు నిర్వహిస్తున్నాడు. ఒక ప్రాంతంలో విధుల్లో ఉండగా.. ఫోటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘గత 48 గంటలుగా ఇక్కడ డ్యూటీలో ఉన్న నాకు.. కాస్త ఫోటో తీయించుకునే విరామం దొరికింది.. ఉక్రెయిన్ మా దేశం.. మా దేశం కోసం మేం ఏమైనా చేయగలం.. అందుకే నవ్వుతున్నాం ’ అంటూ సైనిక దుస్తుల్లో ఫోటో దిగి ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో షేర్ చేశారు.

ఇది జరిగిన కొద్ది సేపటికే అంటే ఆదివారం రాత్రి రష్యా సేనలు వైమానిక దాడులు, లాంఛర్ దాడులతో ఇర్ఫిన్ ప్రాంతంలో విధ్వంసాన్ని సృష్టించింది. రష్యా సేనల కాల్పుల్లో ఇర్ఫిన్ ప్రాంతంలో చాలా చోట్ల అనేక భవనాలు నేల మట్టం అయ్యాయి. ఈ దాడుల్లో పాషా లీ చనిపోయినట్లు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ధృవీకరించింది.

ఇవి కూడా చదవండి

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్ అప్‎డేట్స్

వండర్స్‌‌ క్రియేట్‌‌ చేయాలంటే.. ఇలా కూడా చేయొచ్చు