పెళ్లి తర్వాత కూతుళ్లు మారిపోతారు : ఇంటర్నెట్ లో ఎమోషనల్ డిస్కషన్.. ఇందులో మీరూ ఉంటారు కచ్చితంగా..

పెళ్లి తర్వాత కూతుళ్లు మారిపోతారు : ఇంటర్నెట్ లో ఎమోషనల్ డిస్కషన్.. ఇందులో మీరూ ఉంటారు కచ్చితంగా..

చాలా మంది అమ్మాయిలకు వివాహానంతరం కూడా తన తల్లిదండ్రులకు ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వాలని ఉంటుంది. కానీ చాలా సందర్భాల్లో భర్త లేదా అత్తమామలు అడ్డుచెప్పడం లాంటివే జరుగుతూ ఉంటాయి. పెళ్లయిన తర్వాత కూడా తన తల్లిదండ్రులకు అండగా ఉండాలని, వాళ్లకు ఎలాంటి కష్టం కలగకుండా చూసుకోవాలని భర్త ఏ విధంగానైతే ఆలోచిస్తాడో.. అతన్ని చేసుకున్న మహిళకు కూడా అలాంటి ఆలోచనే ఉంటుందని ఎందుక ఆలోచించరు. ఈ పురుష పక్షపాతం వల్ల ఎందరో మహిళలకు తమ పేరెంట్స్ కు సాయం చేయాలన్నా, తానున్నానని ధైర్యంగా, నిర్భయంగా చెప్పాలని ఉన్నా ఈ కారణాల వల్ల తమ ఆలోచనలను, కోరికలను తమలోనే సమాధి చేసుకుంటున్నారు. పని చేసే అమ్మాయి అయితే.. పెళ్లయిన తర్వాత ఆమె తెచ్చే జీతానికి ఆశపడి పెళ్లి చేసుకుంటున్న వాళ్లూ లేకపోలేదు. కానీ చాలా సందర్భాల్లో చేయాలని, చెప్పాలని ఉన్నా.. పెద్ద సంస్థల్లో కీలక పదవుల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నా.. ఇలాంటి కుటుంబ విషయాల్లో ముఖ్యంగా అమ్మాయి తన తల్లిదండ్రులకు మద్దతుగా నిలిచే విషయంలో కాస్త వెనకే ఉన్నారన్నది నమ్మాలనిపించని వాస్తవం. ఇంతకీ ఈ టాపిక్ ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే.. ఓ ట్విట్టర్ యూజర్ కూడా ఇదే విషయమై తన అభిప్రాయాన్ని వెల్లగక్కింది.. అదేమనంటే..

ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ ట్వీట్ మైక్రో బ్లాగింగ్ సైట్‌లో చర్చకు దారితీసింది. ట్విటర్ యూజర్ రిచా సింగ్ ఈ చర్చను లేవనెత్తారు. పెళ్లి తర్వాత వారి అమ్మాయి తన తల్లిదండ్రులకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడాన్ని భర్తలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారనే ప్రశ్న అడగడంతో ఈ డిస్కషన్ ప్రారంభమైంది. ఒక స్త్రీ తన జీవితంలో ఒక దశ తర్వాత తల్లిదండ్రులను ఆర్థికంగా ఆదుకోలేకపోతుందనే ఆలోచనను ఆమె నిలదీసింది. ఈ పోస్టుకి ఇప్పటికే 1 లక్షా 24వేల వ్యూస్ రాగా.. ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. అంతే కాదు సోషల్ మీడియాలో చాలా మంది ఈ పోస్టుకు స్పందిస్తూ కామెంట్లు కూడా చేశారు.

చాలా మంది ఈ పోస్టుపై చర్చించేందుకు, ఈ సమస్యకు పరిష్కారం రావడానికి ఏం చేయాలో కూడా సూచించారు. “పురాతన కాలం నుంచి స్త్రీలు మాత్రమే రెండు ఇళ్లకు చెందినవారని భావించేవారు. ఆమె పుట్టినప్పటి నుంచి ఆమె తల్లిదండ్రులు తమను సంరక్షలుగా మాత్రమే భావించారు. వివాహానంతరం ఆమె బాధ్యత అత్తమామలది అవుతుంది. కాలాలు మారుతున్నాయి.. జనరేషన్స్ కూడా మారుతున్నాయి… కానీ అత్తమామలు మాత్రం మారలేదు” అని ఓ యూజర్ తెలిపారు. “తగినంత సంపాదించడానికి సామర్థ్యం లేని వ్యక్తులు మాత్రమే అలా చేస్తారు. భార్య తల్లిదండ్రులకు డబ్బు పంపడాన్ని వ్యతిరేకిస్తే.. భర్త తన సొంత తల్లిదండ్రుల కోసం డబ్బు ఖర్చు చేయడాన్ని భార్య కూడా వ్యతిరేకించాలి. దీనిపై వాదించేవాళ్లెవరైనా ఉంటే నా వద్దకు రండి. నేను సిద్ధం” అంటూ ఇంకో మహిళా యూజర్ అన్నారు.