సోషల్ మీడియా ఎక్కువసేపు వాడకుండా..

సోషల్ మీడియా ఎక్కువసేపు వాడకుండా..

గంటలకొద్దీ సోషల్ మీడియా వాడేవాళ్లు చాలామందే ఉంటారు. మొబైల్‌‌కు అతుక్కుని అలాగే ఉండిపోతారు. ఈ రోజుల్లో చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్య ఇదే. అయితే ఈ సమస్యకు సొల్యూషన్ కూడా సోషల్ మీడియా యాప్స్‌‌లోనే ఉంది! సోషల్ మీడియా యాప్స్‌‌లో ‘స్క్రీన్ టైం లిమిట్’ సెట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ‘రోజుకి 20 నిముషాల పాటు ఫేస్‌‌బుక్, గంట పాటు యూట్యూబ్ చూడాలి’ అనుకుంటే ఆయా టైం లిమిట్స్‌‌ను యాప్స్‌‌లోనే సెట్ చేసుకోవచ్చు. లిమిట్ దాటి వాడితే అవి గుర్తు చేస్తాయి. ఫేస్‌‌బుక్ యాప్‌‌లో కుడివైపు పైన ఉండే మూడు గీతలపై క్లిక్ చేసి, ‘సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ’ని సెలక్ట్ చేసుకోవాలి. ఆప్షన్స్‌‌లో కింద ‘యువర్ టైం ఆన్ ఫేస్‌‌బుక్’ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయాలి. తర్వాత ‘మేనేజ్ యువర్ టైమ్’ ఆప్షన్ సెలక్ట్ చేసుకుని డైలీ ఎంత టైమ్ వాడాలనుకుంటున్నారో సెలక్ట్ చేసుకుని రిమైండర్ సెట్ చేసుకోవచ్చు. 

ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో పైన ఉండే మూడు గీతలపై క్లిక్ చేసి ‘యువర్ యాక్టివిటీ’ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి.  అక్కడ ‘టైమ్ స్పెంట్ ఆప్షన్’ పై క్లిక్ చేస్తే... సగటున రోజూ ఎంతసేపు ఇన్‌‌స్టాగ్రామ్ వాడుతున్నారో స్టాటిస్టిక్స్ కనిపిస్తాయి. అక్కడే కింద ‘సెట్ డైలీ టైమ్ లిమిట్’ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేసి, టైం సెలక్ట్ చేసుకుంటే చాలు. యూట్యూబ్ యాప్‌‌లో ప్రొఫైల్ ఫొటోపై క్లిక్ చేసి ‘సెట్టింగ్స్’లోకి వెళ్లాలి.  అక్కడ ‘జనరల్’పై  క్లిక్ చేస్తే.. ‘రిమైండ్ మి టు టేక్ ఎ బ్రేక్’ అని ఉంటుంది. దాన్ని ఆన్ చేసి, టైం లిమిట్ సెట్ చేసుకోవచ్చు.

కాన్ఫిడెన్షియల్ జీమెయిల్

వాట్సాప్, ఎస్సెమ్మెస్​లతో పోలిస్తే జీమెయిల్ అనేది ప్రొఫెషనల్ అవసరాలు, పర్సనల్ విషయాల కోసం వాడేవాళ్లు ఎక్కువ. దీన్ని దృష్టిలో ఉంచుకునే గూగుల్.. జీమెయిల్‌‌లో ‘కాన్ఫిడెన్షియల్ మోడ్’ అనే ఫీచర్‌‌‌‌ను ఉంచింది. అయితే, ఈ ఫీచర్‌‌‌‌ను వాడేవాళ్లు చాలా తక్కువ. ఇదెలా పనిచేస్తుందంటే..
మెయిల్స్‌‌ బయటివాళ్లు చదవకుండా, కాపీ, ఫార్వార్డ్, స్క్రీన్‌‌షాట్, డౌన్‌‌లోడ్ లాంటివి చేయకుండా ఉండేందుకు జీమెయిల్‌‌లో ‘కాన్ఫిడెన్షియల్‌‌ మోడ్‌‌’ ఉంటుంది.  బ్రౌజర్‌‌లో జీమెయిల్ ఓపెన్ చేసి ‘కంపోజ్‌‌’పై క్లిక్ చేయాలి. కంపోజ్ విండో ఓపెన్ అయిన తర్వాత కింద ఉన్న ‘సెండ్’ బటన్‌‌  పక్కన ఐకాన్స్‌‌ కనిపిస్తాయి. వాటిలో లాక్‌‌ సింబల్‌‌ ఉన్న ఐకాన్‌‌ ఉంటుంది. దానిపైన కర్సర్ ఉంచితే ‘టాగుల్ కాన్ఫిడెన్షియల్ మోడ్‌‌’ అని కనిపిస్తుంది. మొబైల్‌‌లో అయితే కంపోజ్ బటన్ నొక్కాక కుడివైపు పైన ఉండే మూడు చుక్కలు నొక్కితే ‘కాన్ఫిడెన్షియల్ మోడ్’ కనిపిస్తుంది. 

మెయిల్ పంపే ముందు దానిపై క్లిక్ చేస్తే విండో ఓపెన్ అవుతుంది.  అందులో ‘ఎక్స్‌‌పైరేషన్‌‌ డేట్‌‌’ , ‘ఎస్సెమ్మెస్ పాస్‌‌కోడ్’ అనే రెండు ఆప్షన్లు ఉంటాయి. పంపిన మెయిల్ కొంతకాలానికి ఆటోమెటిక్‌‌గా డిలీట్‌‌ అవ్వాలనుకుంటే ఎక్స్‌‌పైరేషన్‌‌లో టైం సెట్ చేసుకోవాలి. అలాగే పాస్ కోడ్ సెలక్ట్ చేసుకుని, అవతలి వాళ్ల మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే.. పంపిన మెయిల్ ఓపెన్ చేసే ముందు అవతలి వాళ్లకి గూగుల్ నుంచి ఎస్సెమ్మెస్ వెళ్తుంది. సెక్యూర్‌‌‌‌గా మెయిల్ పంపేందుకు ఇది ఉపయోగపడుతుంది.కాన్ఫిడెన్షియల్ మోడ్‌‌లో పంపిన మెయిల్‌‌లో తప్పలుండి దాన్ని అవతలి వాళ్లు చూడకూడదు అనుకుంటే సెంట్ ఆప్షన్‌‌లోకి వెళ్లి  మెయిల్‌‌పై క్లిక్‌‌ చేసి ‘రిమూవ్ యాక్సెస్‌‌’పై క్లిక్ చేయొచ్చు. అప్పుడు అవతలి వ్యక్తి మెయిల్ ఓపెన్‌‌ చేసినా అందులోని కంటెంట్‌‌ చూడలేరు. ఒకవేళ తిరిగి యాక్సెస్‌‌ ఇవ్వాలనుకుంటే ‘రెన్యూ యాక్సెస్’ పై క్లిక్ చేయొచ్చు. 

ఇలా చేస్తే బ్యాటరీ డౌన్​ కాదు

మొబైల్స్‌‌లో ఉండే బోలెడు ఫీచర్లు, రకరకాల యాప్స్ వల్ల ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుంటుంది. దీనివల్ల అర్జెంట్​ అయినప్పుడు బ్యాటరీ లేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. మొబైల్‌‌లో బ్యాటరీ ఎక్కువసేపు వచ్చేందుకు ఏం చేయొచ్చంటే..ఫోన్‌‌లో బ్యాటరీని ఎక్కువగా వాడుకునేది స్క్రీన్. కాబట్టి స్క్రీన్ బ్రైట్‌‌నెస్ తగ్గించి లేదా  బ్రైట్‌‌నెస్ ఆటో మోడ్‌‌లో పెట్టుకుంటే బ్యాటరీ ఎక్కువసేపు వస్తుంది. నెట్‌‌వర్క్ సిగ్నల్స్‌‌ను గ్రహించేందుకు ఫోన్‌‌కు ఎక్కువ బ్యాటరీ అవసరం. అందుకే ‘ఎల్‌‌టీఈ’, ‘జీపీఎస్‌‌’, ‘వై-ఫై’, ‘బ్లూటూత్‌‌’ వంటి ఆప్షన్స్‌‌ను అవసరం లేనప్పుడు ‘ఆఫ్‌‌’లో ఉంచుకోవాలి. వై-ఫై, బ్లూటూత్, నావిగేషన్ లాంటివి ఎప్పుడూ ‘ఆన్‌‌’ లోనే ఉంచడం వల్ల ఫోన్‌‌ ఆయా సిగ్నల్స్ కోసం వెతుకుతూనే ఉంటుంది. ఫలితంగా బ్యాటరీ తగ్గిపోతుంటుంది. యాప్‌‌తో పని అయిపోయాక బ్యాక్‌‌ బటన్ లేదా హోం బటన్‌‌తో యాప్స్‌‌ క్లోజ్‌‌ చేస్తే చాలదు. అవి బ్యాక్‌‌గ్రౌండ్‌‌లో పనిచేస్తూనే ఉంటే బ్యాటరీ ఖాళీ అవుతూనే ఉంటుంది.  అందుకే  రీసెంట్‌‌ యాప్స్‌‌లోకి వెళ్లి బ్యాక్‌‌గ్రౌండ్‌‌ యాప్స్‌‌ క్లోజ్‌‌ చేయాలి.  అలాగే సెట్టింగ్స్‌‌లోకి వెళ్లి యాప్స్‌‌కు లొకేషన్‌‌ యాక్సెస్  ఆఫ్ చేయడం ద్వారా అవి బ్యాక్‌‌గ్రౌండ్‌‌లో లొకేషన్‌‌ కోసం వెతకడం ఆపేస్తాయి. బ్యాటరీ సేవ్ అవుతుంది. ఇక వీటితోపాటు లైవ్‌‌ వాల్‌‌పేపర్లు, వెదర్‌‌ విడ్జెట్‌‌లు, న్యూస్‌‌ విడ్జెట్ల వంటివి కూడా బోలెడంత బ్యాటరీని వాడతాయి. పవర్‌‌ ఎక్కువసేపు రావాలంటే వీటిని ఆఫ్ చేయాలి. బ్యాటరీ సగానికి తగ్గినప్పుడు పవర్ సేవింగ్ మోడ్‌‌లో పెట్టేయాలి. అప్పుడు బ్యాటరీని వేస్ట్ చేసే యానిమేషన్లు, గ్రాఫిక్స్‌‌, వైబ్రేషన్‌‌, సౌండ్‌‌ వంటివి డిజేబుల్‌‌ అవుతాయి.