ఆమె కడుపులో కిలోన్నర…

ఆమె కడుపులో కిలోన్నర…

కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన ఓ మహిళకు సర్జరీ చేసిన డాక్టర్లు షాక్ తిన్నారు. ఆమె కడుపులో దాదాపు కేజీన్నరకు పైగా బంగారు నగలు ఉండడంతో విస్తుపోయారు. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమబెంగాల్‌లోని బీర్‌భూమ్‌ జిల్లా రామ్‌పురహాట్‌కు చెందిన ఓ మహిళ కొంతకాలంగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతోంది. ఆమె పరిస్థితి చూసిన  కుటుంబసభ్యులు ఆమెను నగరంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆ మహిళ కడుపులో ఏదో లోహ పదార్థం ఉందని గుర్తించారు.

సర్జరీ చేసి ఆ పదార్ధాన్ని తీసేయాలని కుటుంబ సభ్యులకు డాక్టర్లు సూచించడంతో అందుకు వారు ఒప్పుకున్నారు. ఆపరేషన్ చేసిన డాక్టర్లు.. ఆమె కడుపులో ఏకంగా 1.680 కేజీల లోహ వస్తువులను గుర్తించారు. వాటిలో బంగారపు గొలుసులు, దుద్దులతోపాటు గడియారం, నాణేలు ఉండడంతో షాక్ తిన్నారు. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మాత్రం బాగానే ఉందని, ఐసీయూలో ఉంచి పర్యవేక్షిస్తున్నామని డాక్టర్ సిద్ధార్థ్‌ విశ్వాస్‌ చెప్పారు. బాధితురాలు విపరీతమైన ఆకలితో బాధపడేదని, బహుశా అందుకే తమ దుకాణాల్లోని వస్తువులు మింగి ఉండొచ్చని కుటుంబసభ్యులు తెలిపారు.