ఆగిపోనున్న 104 మొబైల్ వైద్య సేవలు

ఆగిపోనున్న 104  మొబైల్ వైద్య సేవలు

మంచిర్యాల, వెలుగు: పల్లె ప్రజల ముంగిట్లోకి వెళ్లి వైద్యసేవలు అందిస్తున్న 104 అంబులెన్స్​సర్వీసులు త్వరలోనే నిలిచిపోనున్నాయి. మొబైల్​వైద్య సేవల రద్దు దిశగా సర్కారు అడుగులు వేస్తోంది. 104 స్టాఫ్​ను సర్దుబాటు చేసేందుకు జిల్లాల్లో స్పెషల్​ఆఫీసర్లను నియమించింది. దీంతో తమను ఎక్కడ, ఏ విధంగా సర్దుబాటు చేస్తారోనని ఉద్యోగులకు బుగులు పట్టుకుంది. సర్దుబాటు చేసిన చోటే రెగ్యులరైజ్​ చేయాలనే డిమాండ్​తో మెడికల్​అండ్​హెల్త్​ డిపార్ట్​మెంట్​ కమిషనర్​ను కలువనున్నట్టు 104 ఎంప్లాయీస్​యూనియన్​ లీడర్లు చెప్తున్నారు. 14 ఏండ్లుగా చాలీచాలని జీతాలతో పనిచేస్తున్నామని, ఇప్పుడు సర్దుబాటు పేరుతో ఆగం చేయవద్దని వేడుకుంటున్నారు. 
14 సంవత్సరాలుగా సేవలు 
మారుమూల ప్రాంతాల్లో బీపీ, షుగర్, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికి లోకల్​గానే ట్రీట్​మెంట్​అందించేందుకు 2008లో అప్పటి సీఎం వైఎస్సార్​104 అంబులెన్స్​సర్వీసులను ప్రవేశపెట్టారు. ఇందులో ఏఎన్​ఎం, ఫార్మసిస్ట్, ల్యాబ్​టెక్నీషియన్, మెడికల్‌ అసిస్టెంట్‌, డ్రైవర్లను నియమించారు. వీరు ప్రతి ఊరికి 20 రోజులకోసారి వెళ్లి బాధితులకు టెస్టులు చేసి గోలీలు, మందులు అందిస్తున్నారు. ఇటీవల నాన్‌ కమ్యూనికల్‌ డిసీజెస్‌(ఎన్‌సీడీ) ప్రోగ్రాం ద్వారా మెడికల్​ అండ్​హెల్త్​స్టాఫ్​ఇంటింటికి తిరిగి బీపీ, షుగర్‌ తదితర దీర్ఘకాలిక రోగులకు మందులు ఇస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం గ్రామీణులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు పల్లె దవాఖానలను ఏర్పాటు చేస్తోంది. ఈ నేపథ్యంలో 104 అంబులెన్స్​ల అవసరం లేదని సర్కారు భావిస్తోంది. 
మొదటి నుంచీ నిర్లక్ష్యమే..
తెలంగాణలో టీఆర్ఎస్​సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 104 అంబులెన్స్​సర్వీసులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఏటేటా ఫండ్స్​ కేటాయింపులో కోతపెడుతూ వస్తోంది. దీంతో కొంతకాలంగా వెహికల్స్​మెయింటెనెన్స్​తోపాటు డీజిల్​కు సైతం పైసల్లేక పరేషాన్​ అవుతున్నారు. ఇప్పటికే చాలా అంబులెన్స్​లు​ఆగిపోయాయి. మంచిర్యాల జిల్లాలో ఐదు అంబులెన్స్​లు ఉంటే ప్రస్తుతం మూడు మాత్రమే నడుస్తున్నాయి. మొదట్లో 130 రకాల మందులు ఉండగా, ప్రస్తుతం అందులో సగం కూడా సప్లై చేయడం లేదు. బీపీ, షుగర్, దగ్గు, జలుబు, జ్వరం వంటి రోగాలకు సరిపడా మందులు లేకపోవడంతో సంచార వైద్యసేవలు నామమాత్రంగా మారాయి. స్టాఫ్​కు ఇచ్చే అరకొర జీతాలు సైతం మూడు నాలుగు నెలలకోసారి వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్టాఫ్​ సర్దుబాటుకు రంగం సిద్ధం 
రాష్ట్ర వ్యాప్తంగా 195 అంబులెన్స్​లు ఉండగా, 1,250 మంది స్టాఫ్​ పనిచేస్తున్నారు. 2012లో ఏఎన్ఎంలను పీహెచ్​సీలు, సబ్​సెంటర్లకు కేటాయించారు. ఉమ్మడి ఆదిలాబాద్​జిల్లాలో ఉన్న 18 మంది ఏఎన్ఎంలను డిప్యుటేషన్​పై పంపారు. అప్పటినుంచి అంబులెన్స్​ ఏ గ్రామానికి వెళ్తే అక్కడి ఏఎన్​ఎంలు 104 స్టాఫ్​తో కలిసి సేవలందిస్తున్నారు. తాజాగా 104 అంబులెన్స్​లను నిలిపివేయాలని నిర్ణయించడంతో ప్రస్తుతం ఉన్న సిబ్బందిని పల్లె దవాఖానలు, పీహెచ్​సీలు, హాస్పిటల్స్​లో సర్దుబాటు చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం జిల్లాలకు స్పెషల్​ ఆఫీసర్లను నియమించింది. వీరు ఆయా జిల్లాల్లోని డీఎంహెచ్​వోలతో సమావేశమై 104 ఎంప్లాయీస్​ వివరాలు సేకరిస్తున్నారు. స్టాఫ్​ను ఎక్కడెక్కడ సర్దుబాటు చేయాలనే అంశంపై రిపోర్టులు తయారు చేస్తున్నారు. అయితే 104 సేవల నిలిపివేతపై ప్రభుత్వం నుంచి ఇంకా ఉత్తర్వులు రాలేదని ఆఫీసర్లు చెప్తున్నారు.