తెలంగాణలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్.

తెలంగాణలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్.
  • తెలంగాణలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్
  • ఫిబ్రవరిలో జేఎన్టీటీయూలో నిర్వహణ
  • ముఖ్య అతిథిగా హాజరుకానున్న ప్రధాని మోదీ
  • చివరిసారి 2006లో హైదరాబాద్​లో సదస్సు 

హైదరాబాద్, వెలుగు: దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘ఇండియన్ సైన్స్ కాంగ్రెస్’ కు తెలంగాణ వేదిక కానుంది. హైదరాబాద్ లోని జేఎన్టీయూహెచ్​లో 109వ సదస్సును ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్టు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ (ఐఎస్​సీఏ) ప్రకటించింది. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించనున్నారు. నిజానికి జనవరి 3 నుంచి పంజాబ్​లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో ఈ సదస్సు జరగాల్సి ఉండగా, చివరి నిమిషంలో ఆ వర్సిటీ చేతులెత్తేయడంతో మన రాష్ట్రంలో నిర్వహించేందుకు అవకాశం వచ్చింది. శాస్త్ర సాంకేతిక రంగాల్లోని పరిశోధనలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 1914 నుంచి ఐఎస్​సీఏ ఏటా సదస్సులు నిర్వహిస్తోంది. 

107వ సదస్సు బెంగళూరులో, 108వ సదస్సు పుణెలో జరిగింది. ఈ క్రమంలో 109వ సదస్సు పంజాబ్ లోని లవ్లీ  యూనివర్సిటీలో నిర్వహించనున్నట్టు గతంలో నిర్వాహకులు ప్రకటించారు. అయితే అక్కడ రద్దు కావడంతో రాష్ట్రంలోని జేఎన్టీయూహెచ్​కు చాన్స్ దక్కింది. కాగా, చివరిసారిగా హైదరాబాద్​లో 2006లో 93వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ నిర్వహించారు. 

వర్సిటీతో ఐఎస్ సీఏ చర్చలు.. 

ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ జనరల్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ అర్వింద్ కుమార్ సక్సేనాతో పాటు డాక్టర్ అశోక్ సక్సేనా, రజిత వర్మ, నారాయణరావు ఇటీవల హైదరాబాద్​కు వచ్చారు. జేఎన్టీయూ వీసీ కట్టా నర్సింహారెడ్డి, వర్సిటీ రెక్టార్ ప్రొఫెసర్ గోవర్ధన్, రిజిస్ర్టార్ మంజూర్ హుస్సేన్ తదితరులతో సమావేశమయ్యారు. సదస్సు నిర్వహణకు వర్సిటీ అంగీకరించడంతో అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. పరిశోధనలపై పేపర్ ప్రజంటేషన్, మోడల్ పరికరాలు, వాటి పని విధానం, కొత్త ఆవిష్కరణలు, సైన్స్ రంగంలో వస్తున్న మార్పులు, జరగాల్సిన పరిశోధనలపై సదస్సులో చర్చలు ఉంటాయి. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, విద్య, వైద్య రంగాల్లోని మార్పులపై డిస్కషన్ ఉంటుంది. ఈ సదస్సుకు శాస్ర్తవేత్తలు, సీనియర్ ప్రొఫెసర్లు హాజరుకానున్నారు.