టెన్త్​లో 91శాతం పాస్ .. గతేడాదితో పోలిస్తే 4.71 శాతం ఎక్కువ

టెన్త్​లో 91శాతం పాస్ .. గతేడాదితో పోలిస్తే 4.71 శాతం ఎక్కువ
  • ఫలితాల్లో నిర్మల్ ఫస్ట్.. వికారాబాద్ లాస్ట్
  • 3,927 బడుల్లో అందరూ పాస్.. ఆరు స్కూళ్లలో జీరో రిజల్ట్స్​
  • సత్తా చాటిన గురుకుల విద్యార్థులు
  • ఫలితాలు రిలీజ్ చేసిన విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం

హైదరాబాద్, వెలుగు: పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష రాసిన స్టూడెంట్లలో 91.31% మంది పాసయ్యారు. అయితే, ఈసారి టెన్త్ ఫలితాల్లో గురుకుల విద్యార్థులు సత్తా చాటారు. అత్యధికంగా 98.71% మంది స్టూడెంట్స్ ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో నిర్మల్ జిల్లా మొదటి స్థానంలో నిలవగా, వికారాబాద్ చివరి స్థానంలో నిలిచింది. మంగళవారం హైదరాబాద్ లోని ఎస్​సీఈఆర్టీ బిల్డింగ్ లో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావుతో కలిసి విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం రిజల్ట్ ను రిలీజ్ చేశారు. 

నిర్మల్ జిల్లాలో అత్యధికంగా 99.05% పాస్

మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు టెన్త్ ఎగ్జామ్స్ జరిగాయి. ఏప్రిల్ 3 నుంచి 13 దాకా వాల్యువేషన్ ప్రక్రియ పూర్తయింది. కాగా, మొత్తం 4,94,207 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షకు అటెండ్ కాగా, వారిలో 4,51,272 (91.31%) మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో అమ్మాయిలు 2,45,208 మందికి గానూ 2,28,616 (93.23%) మంది, అబ్బాయిలు 2,48,999 మందికి గానూ 2,22,656 (89.42%) మంది పాస్ అయ్యారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటుగా 11,606 మంది రాయగా 5,772 (49.73%) మంది ఉత్తీర్ణత సాధించారు. అయితే, గతేడాదితో పోలిస్తే పాస్ పర్సంటేజీ 4.71% పెరిగింది. ఈ ఏడాది 3,927 బడుల్లో వందశాతం మంది స్టూడెంట్లు పాస్ కాగా, దీంట్లో 1,814 ప్రైవేటు స్కూళ్లుండగా, 1,347 జిల్లా పరిషత్ హైస్కూళ్లు, 177 కేజీబీవీ స్కూళ్లు, 142 బీసీ గురుకులాలు, 112 సోషల్ వెల్ఫేర్ గురుకులాలు ఉన్నాయి. ఆరు స్కూళ్లలో ఒక్కరూ పాస్ కాలేదని, దీంట్లో నాలుగు ప్రైవేటు స్కూళ్లుండగా, రెండు ఎయిడెడ్ స్కూళ్లున్నాయి. రాష్ట్రంలో నిర్మల్ జిల్లాలో అత్యధికంగా 99.05%, సిద్దిపేటలో 98.65% మంది పాస్ కాగా, అత్యల్పంగా వికారాబాద్ జిల్లాలో 65.10% మంది పాసయ్యారు.

రెసిడెన్షియల్స్ స్కూల్స్ హవా

రాష్ట్రంలో 12 మేనేజ్​మెంట్ పరిధిలో స్కూళ్లుండగా, వాటిలో స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో నడిచే తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ నుంచి 2,475 మంది పరీక్ష రాస్తే 2,443 (98.71%) మంది పాసయ్యారు. తర్వాత బీసీ వెల్ఫేర్ నుంచి 17,467 మంది రాయగా 17,154 (98.21%) మంది, సోషల్ వెల్ఫేర్ గురుకులాల నుంచి 18,063 మంది రాయగా 17,706 (98.02%) మంది, ట్రైబల్ వెల్ఫేర్ నుంచి 6,893 మంది రాస్తే 6,697 (97.16%) మంది, మైనార్టీ రెసిడెన్షియల్ నుంచి 10,076 మంది రాస్తే 9,756 (96.82%) మంది పాసయ్యారు. మరోపక్క మోడల్ స్కూళ్ల నుంచి 17,592 మంది రాయగా 16,723 మంది, కేజీబీవీల నుంచి 17,546 మంది రాస్తే 16,329 మంది, ఆశ్రమ స్కూళ్ల నుంచి 7,913 మంది రాయగా 7,093 మంది పాసయ్యారు. గవర్నమెంట్ స్కూళ్లలో 80.18%, జిల్లా పరిషత్ స్కూళ్లలో 86.03% మంది స్టూడెంట్లు పాసయ్యారు.

8,883 మందికి టెన్ జీపీఏ 

టెన్త్ లో టెన్ జీపీఏ గ్రేడ్ పాయింట్లు పొందిన విద్యార్థులు గతేడాదితో పోలిస్తే పెరిగారు. గతేడాది 6,163 మంది స్టూడెంట్లకు రాగా.. ఈ ఏడాది 8,883 మంది ఆ ఘనత సాధించారు. దీంట్లో ప్రైవేటు స్కూళ్లకు చెందిన స్టూడెండ్లు 7,635 మంది ఉండగా, బీసీ వెల్ఫేర్ నుంచి 386 మంది, జిల్లా పరిషత్ హైస్కూళ్లకు చెందిన 212 మంది ఉన్నారు. తెలుగు మీడియంలో 80.71% మంది, ఇంగ్లిష్ మీడియంలో 93.74%, ఉర్దూ మీడియంలో 81.50%, ఇతర మీడియాలకు చెందిన విద్యార్థులు 88.47% మంది ఉత్తీర్ణులయ్యారు. ఈసారి ఎక్కువ మంది మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టుల్లో విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. సెకండ్ లాంగ్వేజీలో అత్యధికంగా 99.87% మంది పాస్ కాగా, అత్యల్పంగా మ్యాథ్స్ లో 96.46% మంది పాసయ్యారు.

ఒత్తిడికి గురికావొద్దు: బుర్రా వెంకటేశం

టెన్త్ ఫెయిలైన స్టూడెంట్లు ఒత్తిడికి గురికావొద్దని విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం తెలిపారు. ఇటీవల రిలీజైన ఇంటర్ ఫలితాల్లో ఫెయిలయ్యామని పది మంది ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చదువుల్లో ఫెయిలైన చాలా మంది జీవితంలో రాణించారని గుర్తుచేశారు. 

జూన్ 3 నుంచి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ

రాష్ట్రంలో టెన్త్ అడ్వాన్స్​డ్ సప్లిమెంటరీ పరీక్షలను జూన్ 3 నుంచి 13 వరకు నిర్వహించనున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. ఫెయిలైన స్టూడెంట్లు ఈ నెల16 వరకు ఎగ్జామ్ ఫీజును హెడ్మాస్టర్లకు చెల్లించవచ్చని తెలిపారు. ఫలితాల రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోసం మే 15లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఒక్కో సబ్జెక్టుకు రీ కౌంటింగ్​కు రూ.500, రీ వెరిఫికేషన్​ కోసం రూ.వెయ్యి ఫీజు ఉంటుందని పేర్కొన్నారు.