
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో కొత్తగా 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా తెలిపారు. నమోదైన కేసుల్లో 8 మంది పోలీసు, రెవెన్యూ, వార్డు సచివాలయ ఉద్యోగులని ఆయన తెలిపారు. వారెవ్వరూ రెడ్ జోన్‌లకు వెళ్లకపోయినా.. వైద్యపరీక్షల్లో కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని, వ్యాధి వ్యాప్తికి కారణాలను అన్వేషిస్తున్నామని అన్నారు. వైరస్ సోకిన వారందర్నీ క్వారెంటైన్ కు తరలించామని తెలిపారు. శ్రీకాళహస్తిలోని ఓ మెడికల్ దుకాణం నిర్వాహకుడికి, అందులో పనిచేసే వారికి కరోనా సోకడంపై పూర్తిస్థాయి విచారణ చేస్తున్నామని, ఆ దుకాణంలో మందులు కొనుగోలు చేసిన వారు స్వచ్ఛందంగా వైద్య పరీక్షలకు ముందుకు రావాలని కలెక్టర్ కోరారు. ఇప్పటికే మున్సిపాలిటిలో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా కొత్త వాటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 21 కి చేరిందని తెలిపారు.