ఆకలి వైరస్​ ఎక్కువైంది.. నిమిషానికి 11 ఆకలి చావులు

ఆకలి వైరస్​ ఎక్కువైంది.. నిమిషానికి 11 ఆకలి చావులు
  • ప్రపంచ వ్యాప్తంగా ఆకలితో అలమటిస్తున్న 15.5 కోట్ల మంది
  • ‘హంగర్​ వైరస్​ మల్టిప్లైస్​’ పేరిట ఆక్స్​ఫాం నివేదిక
  • మహమ్మారితో 74.5 కోట్ల మంది పేదరికంలోకి జారే ముప్పు
  • రూ.30.77 లక్షల కోట్లు పెరిగిన 10 మంది కుబేరుల సంపద 
  • 3.3 కోట్ల జాబ్స్ పోయినయ్
  • 40% పెరిగిన సరుకుల ధరలు.. 10 ఏళ్లలో ఇదే ఎక్కువ

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఆకలి చావులు పెరిగిపోయాయి. యుద్ధ సంక్షోభం, వాతావారణ మార్పులకు ఇప్పుడు కరోనా మహమ్మారి తోడవడంతో కోట్లాది మంది జనాలు తిండి లేక అలమటించిపోతున్నారు. ప్రతి నిమిషానికి 11 మంది ఆకలికి తట్టుకోలేక ప్రాణాలు వదులుతున్నట్టు ఆక్స్​ఫాం అనే సంస్థ ‘హంగర్​ వైరస్​ మల్టిప్లైస్​ (ఆకలి వైరస్​ ఎక్కువైంది)’ పేరిట విడుదల చేసిన నివేదికలో తేలింది. కరోనా మరణాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువని ఆందోళన వ్యక్తం చేసింది. కరోనాతో నిమిషానికి సగటున ఏడుగురు చనిపోతున్నట్టు చెప్పింది. 55 దేశాల్లో 15.5 కోట్ల మంది తిండి లేక అలమటించిపోతున్నట్టు నివేదికలో ఆక్స్​ఫాం పేర్కొంది. అందులోనూ యుద్ధ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న 23 దేశాల్లోనే 10 కోట్ల మంది దాకా ఉన్నారని ఆందోళన వ్యక్తం చేసింది. 5.2 లక్షల మందికిపైగా కరువు పరిస్థితుల్లో బతుకుతున్నారని వెల్లడించింది. 

సరుకుల రేట్లు 40% పెరిగినయ్​
కరోనా మహమ్మారితో పెట్టిన లాక్​డౌన్​ల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 3.5 శాతం దిగజారిపోయిందని, పేదరికం 16 శాతం పెరిగిందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో సుమారు 3.3 కోట్ల మంది ఉద్యోగాలు పోయాయంది. 3.7 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.2.76 కోట్ల కోట్లు)  మేర కార్మికులు ఆదాయాన్ని కోల్పోయారని పేర్కొంది. అది 2019 ప్రపంచ జీడీపీలో 4.4 శాతమంది. 17 దేశాల్లో 4 కోట్ల మంది పస్తులుంటున్నారని, అంతకుముందు ఏడాదితో పోలిస్తే 70 శాతం పెరిగారని తెలిపింది. లాక్​డౌన్​ల వల్ల అన్ని వ్యాపారాలూ ఆగిపోవడం, ఆర్థికంగా పెద్ద దెబ్బ పడడం వంటి కారణాల వల్ల కిరాణ సామాను, కూరగాయలు, తిండి వస్తువుల ధరలు భారీగా పెరిగాయని పేర్కొంది. ఈ పదేళ్లలో ఇదే ఎక్కువని చెప్పింది. దీంతో చాలామంది తిండి తగ్గించుకున్నారని, కోట్లాది మంది పస్తులున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. 

ఎక్కువ నష్టపోయింది మహిళలే
కరోనా మహమ్మారి కారణంగా ఎక్కువ నష్టపోయింది మహిళలేనని నివేదిక వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా 5 శాతం మంది మహిళలు ఉపాధి కోల్పోతే.. 3% మంది మగవాళ్లు చేస్తున్న పనిని కోల్పోయారంది. మహిళలు 80 వేల కోట్ల డాలర్ల మేర ఆదాయాన్ని నష్టపోయారని చెప్పింది. ఈ ఏడాది మరో 4.7 కోట్ల మంది మహిళలు పేదరికంలోకి జారుకునే ప్రమాదముందని చెప్పింది. వాతావరణ పరిస్థితుల వల్ల 5 వేల కోట్ల డాలర్ల మేర నష్టం వాటిల్లినట్టు పేర్కొంది. 

పేదలు మరింత లోతుకు.. పెద్దోళ్లు ఇంకింత ఎత్తుకు 
ఆకలి మంటకు యుద్ధ సంక్షోభం ఆజ్యం పోస్తే.. కరోనా తోడై ఆ మంటను ఇంకా పెంచిందని రిపోర్టు పేర్కొంది. ఈ ఏడా ది చివరి నాటికి 74.5 కోట్ల మంది కడు పేదరికంలోకి జారుకునే ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. మహమ్మారి మొదలైనప్పటి నుంచి పేదరికంలో మగ్గుతున్న వారి సంఖ్య 10 కోట్లు పెరి గిందని తెలిపింది. అయితే, డబ్బున్నోళ్లు మాత్రం మరిన్ని ఆస్తులు కూడబెట్టు కున్నారని పేర్కొంది. ఈ ఏడాదిన్నరలో కేవలం 10 మంది కుబేరులు 41,300 కోట్ల డాలర్ల (రూ.30.77 లక్షల కోట్లు) సంపద పోగేసుకున్నారని చెప్పింది. 400 ప్రకృతి విపత్తుల వల్ల కూడా పేదలు తిండికి దూరమవ్వాల్సిన పరిస్థితులు వచ్చాయంది. మొత్తంగా అఫ్గానిస్తాన్​, యెమన్​, సాహెల్​, సౌత్​సూడాన్​, వెనెజులాల్లోనే తీవ్రమైన ఆకలి పరిస్థితులున్నాయని చెప్పింది.

మనదేశంలోనూ పెరుగుతున్నరు 
మన దేశంలోనూ పస్తులుంటున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోందని ఆక్స్​ఫాం రిపోర్ట్​ హెచ్చరించింది. దాదాపు 19 కోట్ల మందికి మంచి తిండి దొరకట్లేదని ఆందోళన వ్యక్తంచేసింది. 33% మంది పిల్లల్లో ఎదుగుదల సరిగ్గాలేదని పేర్కొంది. పప్పులు తినడం 64%, కూరగాయల వాడకం 73% తగ్గిందని చెప్పింది. 70% మంది తాము తినే తిండిని తగ్గించుకున్నట్టు తెలిపింది. 15 రాష్ట్రాల్లోని 47 వేల కుటుంబాలను సర్వే చేసి ఈ విషయాన్ని వెల్లడించింది. కరోనా ఎంటరైన దగ్గర్నుంచి ఇప్పటిదాకా ప్రతి కుటుంబం సగటున 60% ఆదాయాన్ని కోల్పోయిందని తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్​లోనే 80 లక్షల ఉద్యోగాలు పోయాయని తెలిపింది. ఇటు రేషన్​ కూడా సరిగ్గా అందట్లేదని తెలిపింది. 10 కోట్ల మందికి రేషన్​ అందాల్సి ఉన్నా.. కేవలం 57% మందికే అందుతోందని పేర్కొంది.