న్యూఢిల్లీ: మంగళ, బుధ వారాల్లో ఇండిగో విమానాల్లో ప్రయాణించిన 12 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు ఆ కంపెనీ ప్రకటించింది. మంగళవారం ఢిల్లీ నుంచి జమ్ము వెళ్లిన వారిలో ముగ్గురు, బుధవారం బెంగళూరు నుంచి కోయంబత్తూరు వెళ్లిన వారిలో ఆరుగురు, ఢిల్లీ నుంచి కోయంబత్తూరు వెళ్లిన విమానంలో ఇద్దరు, బెంగళూరు నుంచి మదురై వెళ్లిన వారిలో ఒకరు వైరస్ బారిన పడినట్లు గురువారం వెల్లడించింది. ప్రయాణ సమయంలో వీరిలో ఎలాంటి లక్షణాలు కనిపించలేదని, క్వారంటైన్ సెంటర్లలో జరిపిన టెస్టుల్లో మాత్రం వైరస్ పాజిటివ్ గా తేలిందని పేర్కొంది. దీంతో తమ ప్రయాణికులు, సిబ్బంది సేఫ్టీ కోసం ఆయా ఫ్లైట్లలో ప్రయాణించిన మిగతా వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లు వివరించింది. జర్నీలో తమ ప్రయాణికులందరూ మాస్క్‌లు, ఫేస్ షీల్డ్‌లు, గ్లౌవ్స్ ధరించారని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. కరోనా నివారణ చర్యల్లో భాగంగా తమ విమానాలను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయడంతో పాటు రూల్స్ ప్రకారం సిబ్బంది క్వారంటైన్ లో ఉంటున్నారని ఇండిగో ఓ ప్రకటనలో వెల్లడించింది.

