బండ్లు అమ్ముడుపోవట్లే

బండ్లు అమ్ముడుపోవట్లే
  • మారుతీకి మళ్లీ నిరాశే   
  • 14 శాతం తగ్గిన అమ్మకాలు   
  • మిగతా కంపెనీలదీ అదే బాట

న్యూఢిల్లీ: వాహనరంగానికి జూన్‌‌ నెలలోనూ కష్టాలు కొనసాగాయి. యథావిధిగా అమ్మకాలు తగ్గాయి. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ వాహన సంస్థ మారుతీ సుజుకీ అమ్మకాలు గత నెల కూడా క్షీణించాయి. 2018 జూన్‌‌లో ఈ కంపెనీ 1.45 లక్షల యూనిట్లను అమ్మగా, గత నెల మాత్రం కేవలం 1.24 లక్షల యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది. దేశీయంగా అమ్మకాలు 1.35 లక్షల యూనిట్ల నుంచి 1.14 లక్షల యూనిట్లకు పడిపోయాయి. మినీ సెగ్మెంట్‌‌ పరిధిలోని ఆల్టో, వేగన్‌‌ ఆర్‌‌లు కూడా నిరాశపర్చాయి. వీటి అమ్మకాల్లో 36 శాతం పతనం కనిపించింది. విక్రయాలు 29,381 యూనిట్ల నుంచి 18,733 యూనిట్లకు తగ్గిపోయాయి. కాంపాక్ట్‌‌ సెగ్మెంట్‌‌కు చెందిన న్యూవేగన్ ఆర్‌‌, సెలేరియో, ఇగ్నిస్‌‌, స్విఫ్ట్‌‌, బాలెనో, డిజైర్‌‌ అమ్మకాల్లో 12 శాతం పతనం కనిపించింది. విక్రయాలు 71,750 యూనిట్ల నుంచి 62,897 యూనిట్లకు తగ్గిపోయాయి. మిడ్‌‌ సెగ్మెంట్‌‌ వాహనం సియాజ్‌‌  అమ్మకాల్లో మాత్రం 47 శాతం పెరుగుదల నమోదయింది. విక్రయాలు 1,579 యూనిట్ల నుంచి 2,322 యూనిట్లకు పెరిగాయి. యుటిలిటీ వెహికిల్స్‌‌గా పిలిచే జిప్సీ, ఎర్టిగా, వాటారా బ్రెజా, ఎస్‌‌–క్రాస్‌‌  అమ్మకాల్లో 7.9 శాతం పతనం కనిపించింది. విక్రయాలు 19,321 యూనిట్ల నుంచి 17,797 యూనిట్లకు తగ్గిపోయాయి. ఓమ్నీ, ఈకో వ్యాన్ల అమ్మకాల్లో 24 శాతం పతనం కనిపించింది. విక్రయాలు 12,185 యూనిట్ల నుంచి 9,265 యూనిట్లకు తగ్గిపోయాయి. తేలికపాటి కమర్షియల్‌‌ వాహనం సూపర్‌‌ క్యారీ విక్రయాలు మాత్రం 24 శాతం పెరిగాయి. అమ్మకాలు 1,626 యూనిట్ల నుంచి 2,017 యూనిట్లకు పెరిగాయి. వాహన ఎగుమతులు 2018 జూన్‌‌తో పోలిస్తే 2019 జూన్‌‌లో 5.7 శాతం పెరిగాయి.  విక్రయాలు 9,319 యూనిట్ల నుంచి 9,847 యూనిట్లకు పెరిగాయని మారుతీ సుజుకీ తెలిపింది.

మహీంద్రా సేల్స్‌‌ 6 శాతం డౌన్‌‌

మహీంద్రా అండ్‌‌ మహీంద్రా గ్రూపునకు కూడా జూన్‌‌ నెల కలిసి రాలేదు. 2018 జూన్‌‌తో పోలిస్తే ఈ ఏడాది జూన్‌‌లో అమ్మకాలు ఆరు శాతం తగ్గి 42,547యూనిట్లుగా నమోదయ్యాయి. గత జూన్‌‌లో ఇది 45,155 వాహనాలను అమ్మింది. దేశీయంగా అమ్మకాలు ఐదుశాతం తగ్గాయి. అమ్మకాలు 41,689 యూనిట్ల నుంచి 39,471 యూనిట్లకు పడిపోయాయని కంపెనీ తెలిపింది. ఎగుమతులు 11 శాతం తగ్గాయి. ఈ విభాగంలో అమ్మకాలు 3,466 యూనిట్ల నుంచి 3,076 యూనిట్లకు పడిపోయాయి. ప్యాసింజర్‌‌ వెహికల్స్‌‌ అమ్మకాలు 18,137 లక్షల యూనిట్ల నుంచి 18,826 యూనిట్లకు పెరిగాయి. కమర్షియల్‌‌ వాహన అమ్మకాలు 19,229 యూనిట్ల నుంచి 16,393 యూనిట్లకు తగ్గిపోయాయి. మార్కెట్‌‌ సెంటిమెంట్‌‌ చాలా బలహీనంగా ఉందని, ముఖ్యంగా ప్యాసింజర్‌‌ వాహన అమ్మకాలు బాగా తగ్గాయని మహీంద్రా తెలిపింది.

టొయోటా కిర్లోస్కర్‌‌ అమ్మకాల్లో 19% తగ్గుదల

మారుతి, మహీంద్రా మాదిరే టొయోటా కిర్లోస్కర్‌‌ కంపెనీ పరిస్థితీ బాగా లేదు. గత జూన్‌‌తో పోలిస్తే ఈ ఏడాది జూన్‌‌లో ఈ కంపెనీ అమ్మకాలు 19 శాతం తగ్గి 11,365 యూనిట్లుగా నమోదయ్యాయి. గత జూన్‌‌లో ఇది 14,102 యూనిట్లను అమ్మింది. దేశీయంగా అమ్మకాలు 13,088 యూనిట్ల నుంచి 10,603 యూనిట్లకు పడిపోయాయి. డిమాండ్‌‌ తగ్గుదల, మార్కెట్‌‌ సెంటిమెంట్‌‌ బలహీనంగా ఉండటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది.

హ్యుండై అమ్మకాలు 3.2 శాతం డౌన్‌‌

హ్యుండై  అమ్మకాలు గత నెల 58,807 యూనిట్లుగా నమోదయ్యాయి. 2018 జూన్‌‌ నెలలో నమోదైన 60,722 యూనిట్లతో పోలిస్తే ఇవి మూడు శాతం తక్కువ. దేశీయంగా అమ్మకాలు 45,314 యూనిట్ల నుంచి 42,007  యూనిట్లకు పడిపోయాయి. అంటే అమ్మకాలు 7.3 శాతం క్షీణించాయి. ఎగమతులు మాత్రం 15,408 యూనిట్ల నుంచి 16,800 యూనిట్లకు పెరిగాయని కంపెనీ తెలిపింది.