Andhra train accident: ఏపీ రైలు ప్రమాదం.. 14కి చేరిన మృతులు

Andhra train accident: ఏపీ రైలు ప్రమాదం.. 14కి చేరిన మృతులు

ఏపీలోని విజయనగరం జిల్లా కంటకాపురంలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య  14 కు చేరింది. సుమారు వంద మందికి పైగా ప్యాసింజర్లకు గాయాలయ్యాయి. ఘటనాస్థలిలో అర్ధరాత్రి 10 మంది డెడ్ బాడీలను వెలికితీశారు. రాయగడ రైల్ ఇంజిన్ లోని లోకో  పైలెట్లు ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది. అటు బాధితులకు విజయనగరం, వైజాగ్ హాస్పిటల్స్ లో చికిత్స అందిస్తున్నారు.

వైజాగ్ నుంచి విజయనగరంవైపు బయల్దేరిన విశాఖ- పలాస ప్యాసింజర్ రైల్ ను విశాఖపట్నం-రాయగఢ రైల్ వెనుక నుంచి ఢీకొట్టింది. అలమండ-కంటకాపల్లి దగ్గర జరిగిన ప్రమాదం ధాటికి రాయగడ రైల్లోని ఇంజిన్ సహా ఐదుబోగులు నుజ్జునుజ్జు కాగా..మరికొన్ని పట్టాలు తప్పాయి. ఓవర్ హెడ్ కేబుల్ తెగటంతోనే ఆగి ఉన్న రైలును రాయగఢ్ రైలు వేగంగా ఢీకొట్టినట్లు రైల్వేసిబ్బంది చెబుతున్నారు. బాలేశ్వర్ రైల్ యాక్సిడెంట్ తరహాలో జరిగిన ఘటనతో మృతుల సంఖ్య మరింత పెరిగే చాన్స్ ఉందన్నారు.

ప్రమాదం జరిగిన ప్రాంతం భయానక పరిస్థితులను తలపిస్తోంది. NDRF, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. అర్ధరాత్రే ఘటనాస్థలికి  చేరుకున్న ఏపీ మంత్రి బొత్ససత్యనారాయణ, విజయనగరం కలెక్టర్, ఎస్పీలు సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఘటన సమయంలో పలాస,రాయగడ ప్యాసింజర్ రైల్ లో సుమారు 14వందల మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. 

రైల్ ప్రమాదంతో ఇవాళ ఏపీలో 12 రైళ్లను ఈస్ట్ కోస్ట్ రైల్వే రద్దు చేసింది. సుమారు 15 రైళ్లను దారి మళ్లించారు రైల్వే  అధికారులు. ప్రయాణికుల కోసం  ప్రత్యేక బస్సులను ఏర్పాట్లు చేసినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే CPRO బిస్వజిత్ సాహు చెప్పారు.

విజయనగరం రైల్ యాక్సిడెంట్ పై ప్రధాని మోదీ తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణనష్టంపై మోదీ సంతాపం వ్యక్తం చేశారు. సహాయక చర్యలపై రైల్వేమంత్రి  అశ్వినీ వైష్ణవ్ ను అడిగి తెలుసుకున్నారు ప్రధాని మోదీ. మృతుల కుటుంబాలకు రెండు లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన కేంద్రం...గాయపడినవారికి 50వేలు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఏపీ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు ప్రకటించగా..గాయపడిన వారికి రూ.2లక్షలు ప్రకటించింది. 

Also Read : ఏపీ రైలు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు కేంద్రం, ఏపీ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా..

ప్రమాదంపై రైల్వే హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. బాధితుల కోసం విశాఖ కేజీహెచ్ లో ప్రత్యేక హెల్ప్ లైన్లు అందుబాటులోకి తెచ్చారు. బాధితులకు వైద్య సహాయం వివరాలు అందించనున్నట్లు రైల్వే సిబ్బంది తెలిపారు.