
- మార్చి నుంచి మెస్, నిర్వహణ చార్జీలు బంద్ పెట్టిన సర్కారు
- రూ.60 కోట్ల దాకా పెండింగ్
- ఒక్కో కేజీబీవీకి 15 లక్షల బకాయిలు
- అప్పులు చేసి స్కూళ్లను నడుపుతున్న స్పెషల్ ఆఫీసర్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల (కేజీబీవీ) నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఆరు నెలల నుంచి మెస్, నిర్వహణ చార్జీలను సర్కారు ఇవ్వడం లేదు. దీంతో భారమంతా కేజీబీవీల స్పెషల్ ఆఫీసర్లపై పడింది. అప్పులు చేసి మరీ స్కూళ్ల నిర్వహణ చూస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 475 కేజీబీవీలు ఉండగా, వాటిలో 1.14 లక్షల మంది స్టూడెంట్లు చదువుకుంటున్నారు. ప్రతినెలా ఒక్కో స్టూడెంట్‌కు రూ.1,060 డైట్ చార్జీలను సర్కారు ఇస్తోంది. అలాగే స్కూళ్లకు నెలకు ఎలక్ర్టిసిటీ, వాటర్ చార్జీలు రూ.10 వేలు, టాయ్‌లెట్, బాత్రూమ్ క్లీనింగ్‌కు రూ.వెయ్యి, స్పెషల్ ఆఫీసర్లకు మొబైల్ చార్జీలకు రూ.400, ఇంటర్నెట్ చార్జీలకు రూ.500, న్యూస్ పేపర్ రూ.300, స్టేషనరీ కోసం రూ.వెయ్యి, మెడికల్ కేర్, ఆఫీసు నిర్వహణ ఇతర ఖర్చుల కోసం కొంత మొత్తం ఇస్తున్నారు. గత ఫిబ్రవరి దాకా ప్రభుత్వం బిల్స్ క్లియర్ చేసింది. మార్చి నెల నుంచి ఇప్పటిదాకా పైసా రిలీజ్ చేయలేదు. బకాయిలను రిలీజ్ చేయాలని కోరుతూ సర్కారుకు ప్రతిపాదనలు పంపించినట్టు ఎస్ఎస్ఏ అధికారులు చెబుతున్నారు.
కేజీబీవీ ఎస్ఓలపై కాంట్రాక్టర్ల ఒత్తిడి
కేజీబీవీల్లో రాష్ట్రస్థాయిలో అన్ని వస్తువులకు ధరలు నిర్ణయించినా, జిల్లా స్థాయిల్లో పాలు, ఇతర నిత్యావసర సరుకులకు టెండర్ల ద్వారా ధరలు ఫైనల్ చేస్తారు. ఏమైనా సర్కారు నిర్ణయించిన రూ.1,060లోనే ఉండేలా చర్యలు తీసుకుంటారు. నెలకు ఒక్కో కేజీబీవీకి డైట్ చార్జీలు రూ.రెండున్నర లక్షల నుంచి రూ.మూడున్నర లక్షల దాకా అవసరం. నాన్ డైట్ చార్జీలు అన్ని కేజీబీవీలకు కలిపి నెలకు రూ.రెండు కోట్లకు పైగా అవసరం. మార్చి, ఏప్రిల్, మే, జూన్, జులై, ఆగస్టు నెలలకు సంబంధించి మొత్తం సుమారు రూ.60 కోట్ల దాకా బకాయిలున్నట్టు కేజీబీవీ ఎస్ఓలు చెప్తున్నారు. ఒక్కో కేజీబీవీకి సుమారు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల దాకా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు కేజీబీవీలకు కూరగాయలు, సరుకులను సరఫరా చేసే కాంట్రాక్టర్లు బకాయిలు చెల్లించాలని కేజీబీవీ ఎస్ఓలపై ఒత్తిడి తెస్తున్నారు. సరుకులు బంద్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో ఎస్ఓలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోపక్క గ్యాస్, కరెంట్ బిల్లు, ఇంటర్నెట్, స్టేషనరీ, ఇతర రిపేర్లు, టాయిలెట్ల క్లినింగ్ వంటి వాటికి సొంతంగానే ఎస్ఓలు ఖర్చు చేస్తున్నారు. ప్రతి నెల రెండు రోజులు స్టూడెంట్లకు మటన్ పెట్టాలనే నిబంధన ఉన్నా, ఎక్కడా అది అమలు కావడం లేదు. మార్కెట్‌లో రేటుకు, సర్కారు నిర్ణయించిన రేటుకు భారీగా వ్యత్యాసం ఉండటంతో కాంట్రాక్టర్లు మటన్ సరఫరా చేయడం లేదు. గతంలో రేట్ల వ్యత్యాసంతో చికెన్, గుడ్లు కూడా పలు జిల్లాల్లో బంద్ చేశారు.
అప్పులతో నిర్వహణ
విద్యాసంవత్సరం ప్రారంభమైనా సర్కారు స్కూళ్లతో పాటు కేజీబీవీలకు ఇప్పటికీ పైసా అందలేదు. దీంతో బడులు తెరిచినప్పటి నుంచి నిర్వహణ ఖర్చులన్నీ కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లే పెట్టుకుంటున్నారు. ఎస్ఓలంతా కూడా కాంట్రాక్టు ఎంప్లాయీస్. వీరికి ఇటీవలే జీతం పెరగ్గా ప్రస్తుతం నెలకు రూ.32,500గా వస్తున్నది. ఈ పైసల్లో మెజార్టీ మొత్తాన్ని కేజీబీవీకే పెడుతున్నారు. ఇటీవల పంద్రాగస్టు, వజ్రోత్సవ వేడుకలకూ సర్కారు పైసా ఇవ్వలేదు. ఎస్ఓలే సొంతంగా ఖర్చు చేశారు. తాజాగా 175 మోడల్ స్కూల్ హాస్టళ్ల బాధ్యతలనూ దగ్గరలోని కేజీబీవీల ఎస్ఓలకే ఇచ్చారు. దీంతో వీటికీ ఖర్చు పెట్టాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘కేంద్రం నుంచి నిధులు రాకపోవడంతోనే కేజీబీవీలకు నిధులు ఇవ్వలేకపోయాం. డైట్, నిర్వహణ చార్జీలు ఇవ్వాలని ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినం. సర్కారు ఇవ్వగానే కేజీబీవీలకు ఇస్తాం”అని ఎస్ఎస్ఏ ఉన్నతాధికారి ఒకరు చెప్పుకొచ్చారు.