ఎవరి లాభం కోసం.. అప్రోచ్‌‌‌‌ రోడ్డు నిర్మాణం

ఎవరి లాభం కోసం.. అప్రోచ్‌‌‌‌ రోడ్డు నిర్మాణం
  • ఓయూకు చెందిన రూ. 16  కోట్ల నిధులు విడుదల
  • ఈ రోడ్డు నిర్మాణంతో 30 ఎకరాల భూములకు రక్షణ కరవు 
  •  విలువైన భవనాలు కూల్చివేత 
  • లేడీస్‌‌‌‌ హాస్టళ్లలో సమస్యలు పక్కనబెట్టి రోడ్డు నిర్మాణం

సికింద్రాబాద్​, వెలుగు : ఓయూలో కనీస వసతులు లేని హాస్టళ్లు,  ఫ్యాకల్టీ సమస్యలు ఎన్నో పరిష్కరించాల్సి ఉండగా..  రూ.16 కోట్ల నిధులు వెచ్చించి అప్రోచ్‌‌‌‌ రోడ్డు నిర్మాణం చేపట్టడంపై అధ్యాపకులు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.  వర్సిటీ క్యాంపస్​ నుంచి వాహనాల రద్దీ పెరగుతోంది.  దీని వల్ల విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ  సమస్యను అధిగమించడానికి  అడిక్​మెట్​ జామై ఉస్మానియా  రైల్వే  బ్రిడ్జి నుంచి ఎన్​సీసీ  వరకు అప్రోచ్ రోడ్డు​ నిర్మాణం చేపట్టేందుకు నిధులు కేటాయించాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓయూ అధికారులు కోరారు.

దీనిపై అప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోడ్డు నిర్మాణానికి  జీహెచ్‌‌‌‌ఎంసీ నుంచి నిధులు కేటాయిస్తామని, పనులు చేపట్టాలని సూచించారు.  ఏడాది పాటు నిధుల కోసం అధికారులు వేచి చూశారు.  నిధులు తర్వాత సర్దుబాటు చేస్తామని, అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని చెప్పారు.  దీంతో అధికారులు ఆగమేఘాల మీద  ఓయూ వర్సిటీ అంతర్గత నిధుల నుంచి రూ.16  కోట్లు కేటాయించి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు.  ఈ పనులు చేసే ప్రాంతంలో అడ్డంగా ఉన్న వర్సిటీ క్వార్టర్లు,  విలువైన భవనాలను కూల్చివేశారు.  

అయినా ఇప్పటివరకు జీహెచ్‌‌‌‌ఎంసీ అధికారులు నిధులు మాత్రం విడుదల చేయలేదు.  వంద ఫీట్ల రోడ్డు కోసం దాదాపు 5 ఎకరాల యూనివర్సిటీ స్థలాన్ని కేటాయించారు.  ఈ  రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత  రోడ్డుకు ఇవతలి  వైపు నుంచి కాంపౌండ్ వాల్​ నిర్మాణం చేపడితే  రోడ్డుకు అవతలి వైపు దాదాపు 30 ఎకరాల భూములకు రక్షణ లేకుండాపోయే ప్రమాదముందని అధ్యాపకులు, అధ్యాపక, విద్యార్థి సంఘాలు పేర్కొంటున్నాయి.   

క్లోజ్‌‌‌‌డ్‌‌‌‌ క్యాంపస్​ పేరిట.. 

ప్రస్తుత వైస్​ చాన్స్‌‌‌‌ లర్‌‌‌‌‌‌‌‌ ​ పదవిలోకి రాగానే సంస్కరణల పేరుతో  క్యాంపస్‌‌‌‌ను  క్లోజ్‌‌‌‌డ్​ క్యాంపస్‌‌‌‌గా మార్చేశారు.  వర్సిటీకి రెండు వైపులా ఉన్న ప్రధాన గేట్లను పగలు మాత్రమే తెరిచి రాత్రి సమయాల్లో క్లోజ్​ చేస్తున్నారు.  ఆర్టీసీ బస్సులను సైతం క్యాంపస్​ నుంచి రాకుండా నిషేధించారు.  ఇప్పుడు వర్సిటీ క్యాంపస్‌‌‌‌లో  నిర్మించే అప్రోచ్​ రోడ్డు వల్ల విద్యార్థులకు గానీ, అధ్యాపకులు, ఉద్యోగులకు ఎలాంటి ఉపయోగం లేదు. 

నిధులు దుర్వినియోగం 

ఓయూలో ఏటా విద్యార్థినుల సంఖ్య పెరుగుతోంది.  అమ్మాయిల కోసం క్యాంపస్‌‌‌‌లో నాలుగు హాస్టళ్లుండగా,  సుమారు 3 వేల మంది ఉంటున్నారు. నలుగురు విద్యార్థినులు ఉండాల్సిన గదిలో 10 నుంచి 20 మంది ఉంటున్నారు.  హాస్టళ్లలో సీసీ కెమెరాలు లేవు.  రక్షణ పూర్తిగా లోపించింది.  ప్రహరీ గోడలు సరిగా లేక లేడీస్​ హాస్టళ్లలో దుండగులు చొరబడుతున్నారు.  ఇన్ని సమస్యలుండగా.. రూ. 16 కోట్ల నిధులను అప్రొచ్ రోడ్‌‌‌‌కు మళ్లించారు. ఈ నిధులనే  లేడీస్‌‌‌‌ హాస్టళ్లలో సదుపాయాల కోసం వెచ్చిస్తే  బాగుండేదని విద్యార్థి సంఘాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.  

ప్రస్తుత ఓయూ వైస్​ చాన్స్ లర్‌‌‌‌‌‌‌‌ పదవీ కాలం ఈ ఏడాది మే నెలతో ముగుస్తుందని,  పదవీ కాలానికి ఆరు నెలల ముందు ఎలాంటి  ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పనులు, నియామకాలు  చేపట్టరాదనే నిబంధనలు ఉన్నాయి.  అయినా అన్నింటిని విస్మరించి పనులు   చేపట్టడం అనుమానాలకు తావిస్తోంది.  ఈ రోడ్డు నిర్మాణ పనులపై  అభ్యంతరాలు తెలుపుతూ ఇప్పటికే  ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్​అసోసియేషన్​(ఔటా), ఓయూ కాంట్రాక్టర్​ టీచర్స్​అసోసియేషన్లు వేర్వేరుగా ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డికి వినతిపత్రాలు అందజేశాయి. 

అకడమిక్​, అడ్మినిస్ట్రేటివ్​ జోన్స్ గా క్యాంపస్‌‌‌‌ 

క్యాంపస్​ నుంచి  వాహనాల రాకపోకలు తగ్గించేందుకే  అప్రోచ్​ రోడ్డు నిర్మాణాలు చేపట్టాం. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే  క్యాంపస్​ గుండా వాహనాల రద్దీ తగ్గుతుంది. పూర్తిగా క్లోజ్​డ్​ క్యాంపస్​గా మారుతుంది. అలాగే క్యాంపస్​లో ఒక వైపు అకడమిక్​, మరో వైపు అడ్మినిస్ర్టేటివ్​ జోన్స్​గా మారుస్తున్నాం.  భవనాలు కూల్చివేసే విషయంలో యాజమాన్యం అభ్యంతరం లేవనెత్తి  కోర్టును ఆశ్రయించింది.  అయితే ఆంధ్రమహిళా సభ కాలేజీ  క్యాంపస్​ స్థలం వర్సిటీదే.  వర్సిటీ అవసరాలకు స్థలాన్ని ఇవ్వడానికి అభ్యంతరాలు లేవనెత్తడం సరికాదు. 

ఓయూ రిజిస్ర్టార్​ ప్రొఫెసర్​ లక్ష్మినారాయణ