ఎమ్మెల్సీలు నారాజ్ : కడియం, కౌశిక్‍కు తప్ప మిగతావారికి నిరాశ

ఎమ్మెల్సీలు నారాజ్ : కడియం, కౌశిక్‍కు తప్ప మిగతావారికి నిరాశ

వరంగల్‍/ నెట్​వర్క్​, వెలుగు:  బీఆర్‍ఎస్‍ లో మెజారిటీ సీట్లన్నీ సిట్టింగ్​ ఎమ్మెల్యేలకే  కేటాయించడంతో ఇన్నాళ్లూ టికెట్ల ఆశ పెట్టుకున్న ఎమ్మెల్సీలంతా షాక్​కు గురయ్యారు. నిన్నమొన్నటి దాకా చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నడుమ టికెట్​వార్​ నడిచింది. కొన్నిచోట్ల ఢీ అంటే ఢీ అనుకున్నారు. ఎమ్మెల్సీల్లో చాలామంది సీనియర్లు కావడం, హైకమాండ్‍ వద్ద పలుకుబడి కూడా ఉండడంతో పలువురు సిట్టింగులకు ఈసారి టికెట్లు కట్‍ చేసి ఎమ్మెల్సీలకు చాన్స్​ ఇస్తారని భావించారు. పార్టీలోనూ ఇదే ప్రచారం జరిగింది. కానీ, సోమవారం సీఎం కేసీఆర్‍115 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించగా, అందులో కేవలం ఇద్దరు ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, కౌశిక్‍ రెడ్డికి మాత్రమే  చోటు కల్పించడంతో.. మిగిలినవాళ్లు నారాజ్​ అయ్యారు.

 మిగిలిన చోట్ల నిరాశే.. 

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తాండూరు నుంచి ఎమ్మెల్సీ పట్నం మహేందర్​రెడ్డి, కుత్బుల్లాపూర్​ నుంచి ఎమ్మెల్సీ శంభీపూర్​ రాజు టికెట్​ ఆశించినప్పటికీ బీఆర్​ఎస్​ హైకమాండ్​ మొండిచెయ్యి చూపింది. ఇక పెద్దపల్లి  సిట్టింగ్​ ఎమ్మెల్యే దాసరి మనోహర్​రెడ్డిని ఈసారి పక్కనపెడ్తారనే వార్తలతో ఎమ్మెల్సీ భానుప్రసాదరావు కొంతకాలంగా నియోజకవర్గంపై ఫోకస్​ పెట్టారు. 

కీలకమైన నేతలతో టచ్​లోకి వెళ్తూ ఎన్నికల కోసం గ్రౌండ్​ ప్రిపేర్​ చేసుకున్నారు. తీరా, టికెట్ ​రాకపోవడంతో భానుప్రసాదరావు అనుచరులు నిరాశ చెందారు. ఇక మెదక్​ నుంచి కేసీఆర్​ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి టికెట్​ఆశించారు. తన సొంతూరు హవేలీ ఘనపూర్ మండలం కుచన్ పల్లిలో ఫామ్ హౌస్ నిర్మించుకొని రెండేళ్లుగా నియోజకవర్గంపై ఫోకస్​పెట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యేకు పోటీగా  నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ వచ్చారు. ఎమ్మెల్యే పద్మా దేవేందర్​రెడ్డికి టికెట్​ ఇస్తే తాము సహకరించబోమంటూ ఇటీవల సుభాష్​రెడ్డి అనుచరులు హైకమాండ్​కు అల్టిమేటం ఇచ్చినా లాభం లేకుండా పోయింది.

 వరంగల్‍ తూర్పు నియోజకవర్గం నుంచి ఈసారి నన్నపనేని నరేందర్‍ ను పక్కనపెడ్తారని, ఆయన స్థానంలో వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య పేర్లు వినిపించాయి. తీరాచూస్తే వీళ్లిద్దరిలో ఎవరికీ చాన్స్​ ఇవ్వలేదు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల సీటును మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ ఆశించారు. ఈ క్రమంలోనే కొద్దిరోజులుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కానీ ఆయనకు నిరాశే మిగిలింది. ఇక గద్వాల జిల్లాలో అలంపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంను మారుస్తారనే ప్రచారం జరిగింది. అబ్రహం స్థానంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డికి టికెట్ వస్తుందని ఆశించారు. టికెట్ఇ స్తామన్న హామీ పైనే చల్లా కాంగ్రెస్​ నుంచి బీఆర్ఎస్​లో చేరారని, తీరా మొండిచెయ్యి చూపారని ఎమ్మెల్సీ వర్గీయులు ఆరోపిస్తున్నారు.

ఉమ్మడి వరంగల్​ నుంచి పోటాపోటీ.. 

ఉమ్మడి వరంగల్‍ జిల్లా నుంచి మంత్రి సత్యవతి రాథోడ్‍, శాసనమండలి వైస్‍ చైర్మన్‍ బండా ప్రకాశ్‍, సిరికొండ మధుసూదనచారి, కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‍రెడ్డి, బస్వరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్‍రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్‍రావు మొత్తంగా ఎనిమిది మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇందులో బండా ప్రకాశ్‍ తప్పించి మిగిలిన ఎమ్మెల్సీలందరూ ఎమ్మెల్యే టికెట్​ కోసం ప్రయత్నాలు చేశారు. మహబూబాబాద్‍ జిల్లాకు చెందిన  తక్కళ్లపల్లి రవీందర్‍రావుకు రిజర్వేషన్‍ కలిసిరాలేదు. తనకు రాకపోయినా సిట్టింగ్​ ఎమ్మెల్యే శంకర్‍ నాయక్‍కు  రావద్దని  ప్రయత్నించి విఫలమయ్యారు.  సత్యవతి రాథోడ్‍ డోర్నకల్, మధుసూదనాచారి భూపాలపల్లి, కడియం శ్రీహరి స్టేషన్‍ ఘన్‍పూర్‍, పల్లా రాజేశ్వరరెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‍రెడ్డి జనగామ, వరంగల్‍ తూర్పు నుంచి బస్వరాజు సారయ్య తమవంతు ప్రయత్నాలు చేశారు.

 వీరిలో స్టేషన్‍ ఘన్‍పూర్‍లో తాటికొండ రాజయ్య ప్లేస్​లో కడియం శ్రీహరి తప్పించి ఇతరచోట్ల ఎవరికీ టికెట్లు కేటాయించలేదు. జనగామ నుంచి పల్లా రాజేశ్వర్‍రెడ్డి పేరు వినిపించినా.. ఇప్పటికి పెండింగ్‍ పెట్టారు. ఇక కరీంనగర్‍ జిల్లా హుజూరాబాద్‍ నియోజకవర్గంలో కాంగ్రెస్‍ నుంచి బీఆర్ఎస్​లో చేరిన ఎమ్మెల్సీ కౌశిక్‍ రెడ్డికి హైకమాండ్‍ అవకాశమిచ్చింది. గవర్నర్‍పై అనుచిత కామెంట్లు మొదలుకొని నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో వివాదాల్లో ఉండే కౌశిక్‍రెడ్డిని పక్కనపెడ్తారని టాక్​ వచ్చినా ఈటలను ఢీకొట్టేందుకే టికెట్​ ఇచ్చినట్లు తెలుస్తోంది.