ఆ గ్రహంపై 18 గంటలకే ఏడాది!

ఆ గ్రహంపై 18 గంటలకే ఏడాది!

మనకు ఏడాదికి ఎన్ని రోజులు? 365 డేస్ కదా. కానీ ఓ గ్రహంపైకి పోతే మాత్రం.. జస్ట్ 18 గంటలకే ఏడాది గడిచిపోతుందట! అదెట్లంటే.. మన భూమి సూర్యుడి చుట్టూ ఒకసారి తిరిగి వచ్చేటందుకు పట్టే కాలాన్నే మనం ఏడాదిగా లెక్కపెడ్తం కదా. మరి ఆ గ్రహం దాని నక్షత్రం చుట్టూ18 గంటల్లోనే ఒక రౌండ్ పూర్తి చేసుకుంటోందట. మనకు 2 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ‘ఎన్జీటీఎస్-10బీ’ అనే ఆ ఎక్జోప్లానెట్ ను  చిలీలోని పరానల్ అబ్జర్వేటరీ ద్వారా బ్రిటన్ లోని యూనివర్సిటీ ఆఫ్​వార్విక్ ఆస్ట్రోనామర్లు కనుగొన్నారు. మన సౌరకుటుంబంలోని గురు గ్రహం కన్నా అది 20% పెద్దగా ఉందని గుర్తించారు. ఆ గ్రహం దాని సూర్యుడికి చాలా దగ్గరగా, లాక్ అయి తిరుగుతుండటం వల్ల ఒకవైపు భాగంలో 1000 డిగ్రీ సెల్సియస్ ల వేడి ఉంటుందట. బుధ గ్రహంతో పోలిస్తే అది నక్షత్రానికి 27 రెట్లు దగ్గరగా తిరుగుతోందట. ఇలాంటి వేడి ఎక్జోప్లానెట్లను సైంటిస్టులు హాట్ జుపిటర్స్ గా పిలుస్తుంటారు. అయితే, ఈ హాట్ జుపిటర్ దాని స్టార్ తో డెత్ డ్యాన్స్ చేస్తోందని, రానురాను దగ్గరగా వెళ్లి, స్టార్ ను ఢీకొట్టి, అందులో అంతమైపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఏదేమైనా, మరో పదేళ్లు ఈ గ్రహంపై నిరంతరం ఓ కన్నేసి ఉంచుతామని సైంటిస్టులు తెలిపారు.